
మిథాలీకి క్షమాపణ చెప్పిన షారుక్
న్యూఢిల్లీ: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఏ విషయంలోనైనా చాలా వరకూ కచ్చితత్వాన్ని పాటిస్తాడు. అటు బిగ్ స్క్రీన్ పై యాక్టర్ గానే కాకుండా, బయట ప్రపంచంలో జెంటిల్మెన్ తరహాలో వ్యవహరించడం కూడా షారుక్ కు తెలిసిన విద్య. ఎక్కడ ఎలా ఉండాలి..ఎవరితో ఎలా మాట్లాడాలి అనే దానిపై షారుక్ ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటాడు. దాంతో అతను ఎవరికి క్షమాణలు చెప్పిన దాఖలాలు దాదాపు రాలేదట. ఒకవేళ సారీ చెప్పాల్సిన అవసరం వచ్చినా అలా చేయడం కూడా షారుక్ కు ఇష్టం ఉండదట. అయితే ఇటీవల షారుక్ ఖాన్ తనంతట తానే ఒక వ్యక్తికి సారీ చెప్పేశాడు. అది కూడా సినిమా ఫీల్డ్ కు చెందిన వ్యక్తికి కాదు. భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ కు షారుక్ క్షమాపణలు తెలియజేశాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇటీవల 'ఛేంజింగ్ రిలేషన్ షిప్స్' అంటూ మానవ సంబంధాల్లో వస్తున్న మార్పులపై టెడ్ టాక్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో షారూక్ ఖాన్ తో పాటు దర్శకుడు కరణ్ జోహార్.. భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ లు కూడా పాల్గొన్నారు. కాగా, ఈ కార్యక్రమానికి అనుకున్న సమయం కంటే ఆలస్యంగా వచ్చారు షారుక్, కరణ్లు. వీరిద్దరూ దాదాపు మూడు గంటల పాటు మిథాలీని వెయిట్ చేసేలా చేశారు. దీంతో తన తప్పు గ్రహించిన షారూక్.. వచ్చీ రాగానే తనంతట తానే మిథాలీ దగ్గరకు వెళ్లి.. మనస్ఫూర్తిగా క్షమించమని అడిగాడట.ఎందుకు ఆలస్యంగా రావాల్సి వచ్చిందనే దానిపై షారుక్ వివరణ ఇచ్చాడట.