'టీమిండియాతో మ్యాచ్ కు ఆతృతగా ఉన్నాం'
కరాచీ:వచ్చే ఏడాది జరగనున్న ట్వంటీ 20 వరల్డ్ కప్ లో తమ జట్టు క్లిష్టమైన గ్రూప్ లో ఉందని పాకిస్థాన్ ట్వంటీ 20 కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది అభిప్రాయపడ్డాడు. భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఉన్న గ్రూప్ లో తాము కూడా ఉండటంతో ముందుకు వెళ్లాలంటే విపరీతంగా శ్రమించాలని ఆఫ్రిది తెలిపాడు. తాము ప్రధానంగా భారత్ తో మార్చి 19వ తేదీన ధర్మశాలలో జరిగే పోరుపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నాడు.
' ట్వంటీ 20 వరల్డ్ కప్ కు సన్నద్ధమవుతున్నాం. ఇటీవల తాము చిన్నచిన్న తప్పిదాలతో చాలా మ్యాచ్ ల్లో ఓటమి చవిచూశాం. వాటిని అధిగమించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. వరల్డ్ కప్ నాటికి పరిస్థితి సర్దుకుంటుందని భావిస్తున్నా. వరల్డ్ కప్ లో ఏమాత్రం పొరపాటు చేసినా రెండో ఛాన్స్ ఉండదు. వరల్డ్ కప్ లో ఇప్పటివరకూ టీమిండియాపై గెలవలేదు.ఈసారి మ్యాచ్ ను గెలవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాం. టీమిండియాతో మ్యాచ్ కు ఆతృతగా ఎదురుచూస్తున్నాం' అని ఆఫ్రిది తెలిపాడు.
మార్చి 9 నుంచి ఏప్రిల్ 3 వరకు మొత్తం 8 నగరాల్లో ట్వంటీ 20 వరల్డ్ కప్ జరుగుతుంది. గ్రూప్-2లో భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో పాటు క్వాలిఫయింగ్ గ్రూప్ ‘ఎ’ విజేత; గ్రూప్-1లో శ్రీలంక, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్‌లతో పాటు క్వాలిఫయింగ్ గ్రూప్ ‘బి’ విజేత ఉంటాయి. ప్రతి గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి.