కోల్ కతా/ నాగ్ పూర్: మంగళవారం(మార్చి 15) నుంచి ప్రారంభంకానున్న టీ20 వరల్డ్ కప్ పోటీలకు భారత్, పాకిస్థాన్ జట్లు సన్నధ్ధంఅవుతున్నాయి. షాహిద్ అఫ్రిది నేతృత్వంలో 27 మందితో కూడిన బృందం అబుదాబి నుంచి శనివారం రాత్రి కోల్ కతాకు చేరుకున్న సంగతి తెలిసిందే. భారీ భద్రత నడుమ హోటల్ కు చేరుకున్న పాక్ జట్టు.. ఆదివారం ఉదయమే ఈడెన్ గార్డెన్ కు చేరుకుని నెట్ ప్రాక్టీస్ లో మునిగిపోయింది.
శ్రీలంకతో సోమవారం జరగనున్న వామప్ మ్యాచ్ లో సత్తాచాటలని భావిస్తోన్న పాక్ కు 19న భారత్ తో పోరు పెనుసవాలుగా మారింది. ఆసియా కప్ లో పరాజయం తర్వాత స్వదేశంలో చెలరేగిన ఆందోళనల నేపథ్యంలో ఈసారి అవకాశం కోల్పోకూడదనుకుంటోంది. నెట్ ప్రాక్టీస్ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్ చుట్టుపక్కల కనీవినీ ఎరుగనిరీతిలో భద్రతా బలగాలు మోహరించాయి. భారత్ తో మ్యాచ్ జరిగే రోజు వేల మంది సాయుధులు పహారాకాయనున్నారు.
ఇక మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని భారత్ జట్టు ఆదివారం ఉదయం నాగపూర్ కు చేరుకుంది. మార్చి 15న(మంగళవారం) టీమిండియా న్యూజిలాండ్ తో తలపడనుంది. ఆదివారం సాయంత్రం నుంచే ఇండియా టీమ్ ప్రాక్టీస్ ప్రారంభించనున్నట్లు సమాచారం. నాగ్ పూర్ ఎయిర్ పోర్టులో అధికారులు, అభిమానులు ధోనీ సేనకు ఘనస్వాగతం పలికారు. అటు కోల్ కతాలో మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. 'భారత్, పాక్ మ్యాచ్ కు ఈడెన్ వేదిక కావటం అదృష్టంగా భావిస్తున్నా' అని అన్నారు.