అనుష్కకే నా ఓటు
ఇటీవల విరాట్ కోహ్లి, అనుష్క శర్మల ప్రేమ పురాణం కబుర్లు అన్ని చోట్లా వినిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంగా షారుఖ్... కోహ్లికి స్వయంవరం ఏర్పాటు చేశాడు. అమ్మాయిల ఫోటోలు ఉంచిన కవర్ల నుంచి కోహ్లి ఒకటి ఎంచుకోగా...అందులో అనుష్కనే ఉండటంతో అంతా గొల్లుమన్నారు. ఇది ఖాన్ కొంటెతనమే అని కోహ్లికీ అర్థమైంది. ఆ తర్వాత అనుష్క నటించిన రబ్‌నే బనాదీ జోడి పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుండగా కోహ్లికి షారుఖ్ స్వయంవరం జరిపించడం అంతటా నవ్వులు పూయించింది.
డ్యాన్స్ నా వల్ల కాదు...
అనంతరం ధోనితో షారుఖ్ సంవాదం కూడా సరదాగా సాగింది. వీరిద్దరు షారుఖ్ ఫేమస్ స్టైల్‌లో ఒక పాటకు పోజిచ్చారు. ధోని హెలికాప్టర్ షాట్ వచ్చాక తన హెలికాప్టర్ ఫోజును ఎవరూ పట్టించుకోవడం లేదని ఖాన్ వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత ధోని చేతులు కట్టేసి డ్యాన్స్ చేయమంటే...‘మర్‌జావూంగా మగర్ డ్యాన్స్ నహీ కరూంగా’ అని ధోని బదులిచ్చాడు. చెన్నై కెప్టెన్‌ను కుర్చీలోనే కట్టేసి షారుఖ్, దీపికతో కలిసి లుంగీ డ్యాన్స్ పాటకు నర్తించగా, వెనకనే ఉన్న ఇతర జట్ల కెప్టెన్లు పదం కలిపారు.
అందరూ ఒక్కటే కాదు: గవాస్కర్
ఐపీఎల్ డిన్నర్ సందర్భంగా బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ... ఆటగాళ్లందరినీ ఒకే గాటన కట్టవద్దని విజ్ఞప్తి చేశారు. వివాదాలు లేకుండా లీగ్‌ను సమర్థంగా నిర్వహించి క్రికెట్ విలువను నిలబెడతానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూఏఈ యువజన, సాంస్కృతిక శాఖ మంత్రి షేక్ నాహ్యన్ బిన్ ముబారక్ తదితరులు పాల్గొన్నారు.