అఫ్రిదీ.. నిన్ను చూసి సిగ్గుపడుతున్నా..!
కరాచీ: పాకిస్థాన్ టీ20 జట్టు సారథి షాహిద్ అఫ్రిదిపై ఆ దేశ మాజీ క్రికెటర్ జావేద్ మియందాద్ తీవ్రంగా విరుచుకుపడ్డాడు. పాకిస్థాన్ క్రికెటర్లను భారతీయులే ఎక్కువగా ప్రేమిస్తారన్న అఫ్రిది వ్యాఖ్యలపై ఆగ్రహంతో ఊగిపోయాడు.
'మన క్రికెటర్లు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నా' అంటూ ఆగ్రహంగా పేర్కొన్నాడు. క్రికెట్ ఆడినంతకాలం భారత్ జట్టుకు కొరకరాని కొయ్యగా వ్యవహరించిన మియందాద్.. తన కొడుకుకు మాఫియా గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం కూతురితో పెళ్లి చేసిన సంగతి తెలిసిందే.
పాకిస్థాన్ జట్టు భారత్‌కు వెళ్లింది టీ20 వరల్డ్ కప్ ఆడటానికే కానీ, ఆ దేశాన్ని ప్రశంసల్లో ముంచెత్తడానికి కాదని మియందాద్ పేర్కొన్నాడు. 'భారతీయులు మనకేం ఇచ్చారు? భారత్‌లో ఉన్నా నిజాన్నే మాట్లాడండి. గత ఐదేళ్ల కాలంలో పాకిస్థాన్ క్రికెట్‌కు వాళ్లు ఏమైనా ఇచ్చారా? పాకిస్థాన్ జట్టుకు ఎంతోకాలం సేవలందించిన నేను.. మన ఆటగాళ్ల నోటి నుంచి ఇలాంటి మాటలు వినడం బాధించింది. షాక్‌కు గురిచేసింది' అని ఆజ్ చానెల్‌తో ఆయన చెప్పాడు. భారత్‌లో అడుగుపెట్టిన సందర్భంగా అఫ్రిది, షోయబ్ మాలిక్ భారత్ క్రికెట్ ప్రేమికులను ప్రశంసల్లో ముంచెత్తిన సంగతి తెలిసిందే.
టీ20 వరల్డ్ కప్‌లో ఆడేందుకు కోల్‌కతాలో అగుడుపెట్టిన సందర్భంగా అఫ్రిదీ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ' భారత్‌లో ఆడటాన్ని మేం ఎప్పుడూ ఆస్వాదిస్తూనే ఉన్నాం. ఇక్కడి ప్రజలు మాపై ఎంతో ప్రేమను చూపారు. కొన్ని దేశాల్లో మాత్రమే నేను క్రికెట్ బాగా ఎంజాయ్ చేశాను. అందులో భారత్ ఒకటి. ఇక్కడ మాకు ఎంతో ప్రేమ లభించింది. ఇంతటి ప్రేమకు మాకు పాకిస్థాన్‌లో కూడా లభించలేదని నేను చెప్పగలను' అని పేర్కొన్న సంగతి తెలిసిందే.