
బౌన్సర్లతో భయపెట్టాడు!
మొహాలి:ఇంగ్లండ్ తో మూడో టెస్టులో భారత ప్రధాన పేసర్ మొహ్మద్ షమీ అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఒకవైపు పదునైన ఫుల్ లెంగ్త్ బంతులను సంధిస్తునే, మరొకవైపు బౌన్సర్లతో ఇంగ్లండ్ ఆటగాళ్లను హడలెత్తించాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో షమీ సాధించిన రెండు వికెట్లు బౌనర్లను సంధించి తీసినవే కావడం విశేషం.
ప్రధానంగా ఇన్నింగ్స్ 84.0 ఓవర్ ను అందుకున్న షమీ తొలి బంతినే వోక్స్‌కు బౌన్సర్‌గా సంధించాడు. దాంతో వోక్స్ తడబడటంతో ఆ బంతి కాస్త అతని హెల్మెట్‌ను బలంగా తగిలింది. అదే క్రమంలో అతని హెల్మెట్‌కు ఉన్న నెక్ గార్డ్ కూడా ఎగిరికిందపడింది.
అయితే వోక్స్‌కు ఎటువంటి గాయం కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, అదే ఓవర్ రెండో బంతి మరోసారి షమీ బౌన్సర్ వేశాడు. ఈ బంతిని ఆడటానికి మరోమారు ఆందోళనకు గురైన వోక్స్(30).. భారత వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా, ఆ తరువాత నాల్గో బంతికి క్రీజ్‌లోకి వచ్చిన రషిద్ ను కూడా బౌన్సర్ తో షమీ బొల్తా కొట్టించాడు. ఆ బంతిని ఆడబోయి ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఉమేశ్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చాడు. దాంతో ఇంగ్లండ్ జట్టు 195 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ ను కోల్పోయింది.