రాజ్‌కోట్: కీలక ఆటగాళ్లు గాయాల పాలవడం... కోహ్లి విశ్రాంతి కొనసాగిస్తుండటం... యువ బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్‌లకు వరంగా మారనుంది. మూడో టెస్టులో వీరిద్దరు బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌లో వీరిద్దరు మాత్రం గంటల తరబడి చెమటోడ్చడం చూస్తుంటే వారి అరంగేట్రానికి సూచనగా కనిపిస్తోంది.
కెప్టెన్ రోహిత్ శర్మ వారి ప్రాక్టీస్‌ను దగ్గరుండి పరిశీలించాడు. శ్రేయస్ అయ్యర్‌ను మిగతా మూడు టెస్టుల నుంచి తప్పించగా, ఎంపిక చేసిన కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో అతనూ రాజ్‌కోట్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇవన్నీ కూడా సర్ఫరాజ్, జురెల్‌లకు రాచబాటను పరిచింది. ఆంధ్ర వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ వరుసగా విఫలమవడం కీపర్ జురెల్‌కు కలిసి రానుంది.
గత మ్యాచ్ ఆడిన రజత్ పటిదార్‌తోపాటు సర్ఫరాజ్, జురెల్ మిడిలార్డర్‌లో బరిలోకి దిగుతారు. ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్ ప్రాక్టీస్ చేయలేదు. అతని కుడిచేతి చూపుడు వేలు నొప్పి కారణంగా ట్రెయినింగ్‌కు దూరంగా ఉన్నాడు.
అయితే అతని గాయం ఏమాత్రం తీవ్రమైంది కాదని జట్టు వర్గాలు వెల్లడించాయి. ఆల్‌రౌండర్ జడేజా స్పిన్ బౌలింగ్ కంటే బ్యాటింగ్ ప్రాక్టీసే ఎక్కువ చేశాడు. పేసర్లు బుమ్రా, ఆకాశ్‌దీప్‌లు బౌలింగ్‌లో శ్రమించారు. భారత్, ఇంగ్లండ్‌ల మధ్య గురువారం నుంచి మూడో టెస్టు జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment