తొమ్మిది రోజులు...భారత్, ఇంగ్లండ్ రెండో, మూడో టెస్టు మ్యాచ్‌ల మధ్య విరామం! చూస్తుంటే ఒక సిరీస్ 1–1తో ముగిసిపోయింది. ఇప్పుడు కొత్తగా మూడు టెస్టుల సిరీస్ మొదలవుతున్నట్లుగా అనిపిస్తోంది.
ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ ఆడుతున్న నేపథ్యంలో కొత్త ఉత్సాహంతో, కొత్త వ్యూహాలతో బరిలోకి దిగేందుకు ఇది పనికొచ్చింది. ఇప్పుడు సిరీస్‌లో ఆధిక్యం ప్రదర్శించేందుకు మరో పోరుకు రంగం సిద్ధమైంది. విరామం తర్వాత పైచేయి ఎవరిదనేది ఆసక్తికరం.
రాజ్‌కోట్: టెస్టు సిరీస్‌లో 1–1తో సమంగా ఉన్న స్థితిలో మళ్లీ ఆధిక్యంలోకి వెళ్లేందుకు భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. నేటినుంచి జరిగే మూడో టెస్టులో ఇరు జట్లు హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమయ్యాయి.
ఉత్కంఠభరితంగా సాగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించగా...రెండో టెస్టులో భారత్‌కు భారీ విజయం దక్కింది. అయితే గత పర్యటనతో పోలిస్తే ఇంగ్లండ్ కాస్త మెరుగైన ప్రదర్శన కనబర్చగా...భారత్ కోణంలో చూస్తే అనూహ్యంగా గట్టి పోటీ ఎదురైంది. బుధవారం జరిగిన కార్యక్రమంలో రాజ్‌కోట్ మైదానాన్ని ‘నిరంజన్ షా స్టేడియం’గా బీసీసీఐ పేరు పెట్టింది.
సర్ఫరాజ్ అరంగేట్రం!
రెండో టెస్టుతో పోలిస్తే భారత తుది జట్టులో మార్పులు ఖాయమయ్యాయి. గాయంతో వైజాగ్ టెస్టుకు దూరమైన రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వస్తున్నాడు. తన సొంత మైదానంలో అతడు చెలరేగిపోతే ఇంగ్లండ్‌కు కష్టాలు తప్పవు. అయ్యర్‌పై వేటు పడటంతో అతని స్థానంలో బ్యాటర్‌గా సర్ఫరాజ్ ఖాన్‌కు తొలి అవకాశం దక్కవచ్చు.
వికెట్ కీపర్‌గా ఆంధ్ర ఆటగాడు కేఎస్ భరత్‌ను తప్పించి ధ్రువ్ జురేల్‌ను ఎంపిక చేయవచ్చని కూడా తెలుస్తోంది. అయితే జురేల్‌ను ఆడిస్తారా లేక భరత్‌కు చివరి చాన్స్ ఇస్తారా చూడాలి. మిడిలార్డర్‌లో అనుభవలేమి కనిపిస్తుండటంతో బ్యాటింగ్ భారం ప్రధానంగా టాప్–3పైనే ఉంది.
గత మ్యాచ్‌లో జైస్వాల్ తానేంటో నిరూపించుకోగా, గిల్ కూడా కీలక సెంచరీ సాధించాడు. రోహిత్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఇప్పుడైనా ఆడాల్సి ఉంది. బౌలింగ్‌లో అశ్విన్, కుల్దీప్‌లను ఇంగ్లండ్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. బుమ్రా స్థాయి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముకేశ్ స్థానంలో సిరాజ్ వస్తాడు.
ఇద్దరు పేసర్లతో...
తొలి రెండు టెస్టుల్లో ఒకే ఒక పేసర్‌కే పరిమితమైన ఇంగ్లండ్ ఈ సారి వ్యూహం మార్చింది. రెండో పేసర్‌గా అండర్సన్‌తో పాటు వుడ్ తుది జట్టులోకి వచ్చాడు. స్పిన్నర్లలో హార్ట్‌లీ ఇప్పటికే సత్తా చాటగా, రేహన్ పర్వాలేదనిపించాడు. వుడ్ రాకతో ఆఫ్‌స్పిన్నర్ బషీర్‌పై వేటు పడింది. అయితే రూట్ ఆఫ్ స్పిన్ జట్టుకు అదనపు బలంగా మారింది కాబట్టి సమస్య ఉండకపోవచ్చు.
ఓడినా, గెలిచినా ఆ జట్టు బ్యాటింగ్ శైలిలో మార్పు ఉండకపోవచ్చు. ఓపెనర్లు క్రాలీ, డకెట్‌లతో పాటు పాటు పోప్ దూకుడు కొనసాగిస్తున్నాడు. ఇంకా ప్రభావవంతమైన ఇన్నింగ్స్ ఆడని రూట్, బెయిర్‌స్టో రాణించాల్సి ఉంది. స్టోక్స్ బ్యాటింగ్‌లో ఎలా చెలరేగుతాడో చూడాలి. అతని నాయకత్వ ప్రతిభకు కూడా ఈ మ్యాచ్ పరీక్ష కానుంది.
పిచ్, వాతావరణం
ఎప్పటిలాగే ఈ పిచ్ బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. పరుగుల వరదకు అవకాశం ఉంది. అయితే జడేజా చెప్పినదాన్ని బట్టి చూస్తే మ్యాచ్ సాగిన కొద్దీ పగుళ్లు ఏర్పడి స్పిన్‌ను అనుకూలిస్తుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ తీసుకోవడం సరైన నిర్ణయం అవుతుంది. మంచి వాతావరణం, వర్షసూచన లేదు.
జట్ల వివరాలు
భారత్ (అంచనా): రోహిత్ (కెప్టెన్), యశస్వి, గిల్, రజత్, సర్ఫరాజ్, జడేజా, భరత్/ జురేల్, అశ్విన్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్.
ఇంగ్లండ్: స్టోక్స్ (కెప్టెన్), క్రాలీ, డకెట్, పోప్, రూట్, బెయిర్‌స్టో, ఫోక్స్, రేహన్, హార్ట్‌లీ, వుడ్, అండర్సన్.
100 500 700
ఈ టెస్టులో పలు ఆటగాళ్లకు వ్యక్తిగతంగా ఇది చిరస్మరణీయ మ్యాచ్ కానుంది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కెరీర్‌లో ఇది 100వ టెస్టు మ్యాచ్. ఈ ఘనత సాధించిన 16వ ఇంగ్లండ్ ఆటగాడిగా స్టోక్స్ నిలుస్తాడు. మరో వికెట్ తీస్తే భారత స్పిన్నర్ అశ్విన్ 500 వికెట్ల ఘనతను అందుకుంటాడు. ఈ మైలురాయిని చేరిన 9వ ఆటగాడిగా నిలుస్తాడు. మరో 5 వికెట్లు తీస్తే అండర్సన్ 700 వికెట్ల ఘనతను అందుకుంటాడు.
2024 టి20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు రోహిత్ శర్మనే కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. బోర్డు కార్యదర్శి జై షా ఈ విషయాన్ని నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment