టీమిండియాకు కోచ్ కావాలని ఉంది: స్పిన్నర్
లెజండరీ ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ తన మనసులోని మాట బయటపెట్టాడు. టీమిండియా కోచ్ బాధ్యతలు చేపట్టాలని ఉందని చెప్పాడు. భవిష్యత్తులో తనను కోచ్‌గా సేవలందించాలని బీసీసీఐ కోరితే నిరాకరించబోనని స్పష్టం చేశాడు. ప్రస్తుతం టీమిండియా డైరెక్టర్‌గా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి బాధ్యతలు అందిస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఆయన ఈ బాధ్యతల నుంచి తప్పుకొనే అవకాశముంది. దీంతో జట్టుకు పూర్తికాల కోచ్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నియమించే అవకాశముంది.
'టీమిండియాతో పనిచేయడానికి ఇష్టపడతాను. చాలా ప్రతిభావంతమైన, అద్బుతమైన టీమ్ అది. జట్టుపై ఎంతో ఒత్తిడి ఉంటుంది. వందకోట్లమంది మద్దతు కలిగిన జట్టు అది. ఒక్కసారి తప్పుచేసినా నిలదొక్కుకోవడం కష్టం. కాబట్టి అవకాశం వస్తే తప్పకుండా ఆలోచిస్తా' అంటూ కోచ్ విషయంలో తన ఆలోచన బయటపెట్టాడు వార్న్.
'నా జీవితంలో ఎప్పుడూ ఏ దానికి నో చెప్పలేదు. ఇండియాకు కోచ్‌గా ఉండటానికి కానీ, ఐపీఎల్‌లో కోచ్‌గా సేవలందించడంలోగానీ ఎప్పుడూ ఓపెన్‌గానే ఉన్నాను. క్రికెట్‌తో కొనసాగాలని భావిస్తున్నా. నాకు కామెంటరీ కూడా ఇష్టమే. నేను చెప్తుంటే ప్రజలు ఆనందిస్తారని భావిస్తాను. కోచ్‌గా బాధ్యతలు నిర్వహించడానికీ నేను సిద్ధంగా ఉన్నాను' అని షేన్ వార్న్ చెప్పాడు.