
అదిరిపడ్డ వాట్సన్
రాకాసి బౌన్సర్‌కు ఫిల్ హ్యూస్ ప్రాణాలు విడిచిన సంఘటన ఆస్ట్రేలియా ఆటగాళ్ల కళ్ల ముందు మరోసారి మెదిలింది.
హెల్మెట్‌కు బలంగా తాకిన ప్యాటిన్సన్ బంతి
మెల్‌బోర్న్: రాకాసి బౌన్సర్‌కు ఫిల్ హ్యూస్ ప్రాణాలు విడిచిన సంఘటన ఆస్ట్రేలియా ఆటగాళ్ల కళ్ల ముందు మరోసారి మెదిలింది. మంగళవారం నెట్ ప్రాక్టీస్‌లో ప్యాటిన్సన్ వేసిన బౌన్సర్... ఆల్‌రౌండర్ వాట్సన్ హెల్మెట్‌ను బలంగా తాకడంతో ఒక్కసారిగా అందరూ షాక్‌కు గురయ్యారు. ఇక వాట్సన్ అయితే కొన్ని క్షణాల పాటు తేరుకోలేకపోయాడు. మోకాళ్లపై కూర్చొని హెల్మెట్‌ను తీసి పరిశీలించుకున్నాడు.
కొన్ని నిమిషాల పాటు చేతులతో తలను పదేపదే రుద్దుకుంటూ కనిపించాడు. ఇక ప్రాక్టీస్‌ను ఆపేసి టీమ్ డాక్టర్ పీటర్ బ్రూక్నెర్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. ఈ సంఘటనకు నిర్ఘాంతపోయిన ప్యాటిన్సన్ కూడా మధ్యలోనే వైదొలిగాడు. ఆటగాళ్లు, అధికారులు వాట్సన్‌ను చూసేందుకు వెళ్లిపోవడంతో ప్రాక్టీస్ సెషన్ ముందుగానే ముగిసింది. బంతి తగలడంతో షాక్‌కు గురైన వాట్సన్ పరిస్థితి బాగానే ఉందని ఆసీస్ జట్టు అధికార ప్రతినిధి తెలిపారు.
తర్వాత ఎంసీజీలో ఆసీస్ జట్టుకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనకుండా వాట్సన్ హోటల్ రూమ్‌కు వెళ్లిపోయాడు. అంతకుముందు బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో స్టార్క్ మోకాలికి గాయం చేసుకున్నాడు. ఇన్‌సైడ్ బంతులను ఎదుర్కొనే క్రమంలో అతను పదేపదే బ్యాట్‌ను మోకాలికి తగిలించుకున్నాడు. దీంతో నొప్పి రావడంతో ప్రాక్టీస్‌ను ఆపేసి వెళ్లిపోయాడు.