
ప్రపంచకప్‌లో భాగంగా ఆసీస్ టాపార్డర్ బ్యాట్స్‌మెన్ షాన్‌మార్ష్ స్థానంలో పీటర్ హ్యాండ్స్‌కోంబ్ ప్రపంచకప్ తుది జట్టుతో చేరతాడని ఐసీసీ పేర్కొంది. ఈ మేరకు...‘ ప్రపంచకప్‌లో భాగంగా గాయపడిన షాన్‌మార్ష్ స్థానాన్ని పీటర్ హ్యాండ్స్‌కోంబ్‌తో భర్తీ చేసేందుకు, ఆస్ట్రేలియా తదుపరి మ్యాచ్‌లలో అతడు ఆడే విషయాన్ని ఐసీసీ ధ్రువీకరించింది’ అని గురువారం ప్రకటన విడుదల చేసింది. కాగా ఈ ప్రపంచకప్‌లో సెమీస్‌లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచిన ఆసీస్ తమ తదుపరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనున్న సంగతి తెలిసిందే. శనివారం జరిగే ఈ మ్యాచ్ కోసం ఓల్డ్ ట్రఫార్డ్‌లో నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్న షాన్ మార్ష్ గాయపడ్డాడు. పాట్ కమిన్స్ బంతులను ఎదుర్కొనే క్రమంలో అతడి మణికట్టుకు తీవ్ర గాయమైంది. దీంతో సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ కుడి ముంజేతికి కూడా గాయమైంది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అతడు గాయపడ్డాడు. అయితే శనివారం నాటి మ్యాచ్‌కు అతడు అందుబాటులోకి వస్తాడని కోచ్ జస్టిన్ లాంగర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక షాన్‌మార్ష్ స్థానంలో హ్యాండ్స్‌కోంబ్‌ను ఎంపిక చేయడం గురించి మాట్లాడుతూ..‘ పీటర్‌పై నమ్మకం ఉంది. మిడిల్ ఆర్డర్‌లో రాణించగలడనే భావిస్తున్నాం. ఇండియా, యూఏఈ టూర్లలో అతడు గొప్ప ప్రదర్శన కనబరిచాడు’ అని లాంగర్ పేర్కొన్నాడు. కాగా హ్యాండ్స్‌కోంబ్ ఆస్ట్రేలియా తరఫున ఇప్పటివరకు 21 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు అర్ధసెంచరీలు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment