ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు, బిగ్‌బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ ఓపెనర్ షాన్ మార్ష్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫామ్‌లో (బిగ్‌బాష్ లీగ్) ఉండగానే ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మార్ష్ తాజాగా అన్ని రకాల క్రికెట్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. బీబీఎల్‌లో జనవరి 16న సిడ్నీ థండర్స్‌తో జరిగే మ్యాచ్ తనకు చివరిదని స్పష్టం చేశాడు.
మంచి ఫామ్‌లో ఉండటంతో పాటు తన చివరి మ్యాచ్‌లో (బిగ్‌బాష్ లీగ్) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన షాన్ ఈ అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో అందరూ షాకయ్యారు. మార్ష్.. తన చివరి మ్యాచ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్‌పై 49 బంతుల్లో 10 బౌండరీల సాయంతో 64 పరుగులతో అజేయంగా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. మార్ష్ తన రెనెగేడ్స్ సహచరుడు, ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే తాను కూడా ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
2008-19 మధ్యలో షాన్ మార్ష్ ఆస్ట్రేలియా తరఫున 38 టెస్ట్‌లు, 73 వన్డేలు, 15 టీ20లు ఆడాడు. ఇందులో అతను 13 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీల సాయంతో 5000 పైచిలుకు పరుగులు చేశాడు. ఐపీఎల్‌లోనూ అదరగొట్టిన మార్ష్ 2008-17 మధ్యలో వివిధ ఫ్రాంచైజీల తరఫున 71 మ్యాచ్‌లు ఆడి సెంచరీ, 20 హాఫ్ సెంచరీల సాయంతో 132 స్ట్రయిక్‌రేట్‌తో 2477 పరుగులు చేశాడు.
ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన మార్ష్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్).. ఆ సీజన్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా (616 పరుగులు) నిలిచాడు. ఆసీస్ దిగ్గజ ఆటగాడు జెఫ్ మార్ష్ పెద్ద కొడుకైన 40 ఏళ్ల షాన్ మార్ష్.. ప్రస్తుత ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌కు స్వయానా అన్న అవుతాడు.
Comments
Please login to add a commentAdd a comment