మోగా: ఆసియా క్రీడల్లో తన కొడుకు సాధించిన బంగారు పతకాన్ని చూడకుండానే కన్నుమూశాడు షాట్ పుట్టర్ తేజిందర్ పాల్ సింగ్ తండ్రి. షాట్ పుట్‌లో బంగారు పతకం సాధించి చరిత్రలో నిలిచిన తేజిందర్.. తన తండ్రికి తాను సాధించిన పతకాన్ని చూపించాలని ఎంతో ఆశపడ్డాడు. బంగారు పతకం సాధించిన విజయంతో, ఎంతో సంతోషంగా దానిని తండ్రికి చూపిద్దామని ఆశతో విమానశ్రయంలో దిగిన తేజిందర్ పాల్‌కు చేదు వార్త స్వాగతం పలికింది.
తేజిందర్ తండ్రి కరమ్ సింగ్ రెండు సంవత్సరాలుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. అయినప్పటికీ కొడుకుని ఆసియా క్రీడలకు పంపడం కోసం ఆయన ఎన్నో త్యాగాలను చేశారు. ప్రతి విజయంలో తోడుగా ఉన్న తండ్రికి తాను సాధించిన బంగారు పతకాన్ని చూపిద్దామని ఎన్నో ఆశలతో జకార్తా నుంచి ఢిల్లీ విమానాశ్రయంలో దిగగానే తండ్రి పరిస్థితి విషమంగా ఉందన్న వార్త తెలిసింది.
తేజిందర్ పంజాబ్‌లోని మోగాకు ఢిల్లీ నుంచి రోడ్డు మార్గం ద్వారా పయనమయ్యాడు. కానీ, ఇంకా ఇంటికి కొద్ది దూరంలో ఉండగానే తండ్రి చనిపోయిన విషయం తెలిసింది. ‘తాను బంగారు పతకం సాధించలన్నది నా తండ్రి చివరి కోరిక. కానీ ఇప్పుడు పతకాన్ని తండ్రికి చూపించి ఆ కోరిక తీర్చాలనుకుంటే, దేవుడు ఆ కోరిక తీరకుండా చేశాడు' అని తేజిందర్ కన్నీరుమున్నీరవుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment