‘ ఆ క్షణం లక్కీగా ఫీలయ్యా. కోహ్లి, ఏబీ వరల్డ్ క్లాస్ ఆటగాళ్లన్న విషయం అందరికీ తెలిసిందే. నాలాంటి యువ ఆటగాళ్లకు అలాంటి లెజెండ్ల వికెట్లు తీసిన సందర్భం చిరస్మరణీయంగా గుర్తుండిపోతుంది. నా ప్రయాణంలో ఇది చాలా ప్రత్యేకమైన విజయం’ అంటూ రాజస్తాన్ రాయల్స్ బౌలర్ శ్రేయస్ గోపాల్ ఆనందం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ సీజన్ 12లో భాగంగా.. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో కోహ్లి సేనపై గెలుపొంది.. రాజస్తాన్ బోణీ కొట్టిన సంగతి తెలిసిందే. సవాయ్ సింగ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు కీలక ఆటగాళ్లు కెప్టెన్ కోహ్లి, ఏబీ డివిల్లియర్స్‌లను పెవిలియన్‌కు చేర్చిన లెగ్ స్పిన్నర్ శ్రేయస్ గోపాల్(3/12) ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ గా నిలిచాడు.(చదవండి : గోవిందా... గోపాలా!)
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం శ్రేయస్ గోపాల్ మాట్లాడుతూ.. ‘ఈనాటి మ్యాచ్‌లో గూగ్లీలు సంధించి సాహసం చేశానని అనుకుంటున్నా. స్టంప్ టు స్టంప్ బౌల్ చేసి బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయడానికి ప్రయత్నించా. ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో రాణించిన అనుభవం నాలో విశ్వాసాన్ని నింపింది. అక్కడి కంటే కూడా ఐపీఎల్‌లోనే బాగా ఆడుతున్నానని భావిస్తున్నా. నాలాంటి రిస్ట్ స్పిన్నర్లు బంతిని రెండు వైపులా స్పిన్ చేయగలరు. బహుశా అదే ఈ మ్యాచ్‌లో నాకు అడ్వాంటేజ్ అయ్యిందేమో.కోహ్లి, ఏబీ వికెట్లు తీయడం నా క్రీడా ప్రయాణంలో మర్చిపోలేని రోజు’ అని పేర్కొన్నాడు.
కాగా మంగళవారం నాటి మ్యాచ్‌లో.. ఈ కర్ణాటక లెగ్‌స్పిన్నర్ తన తొలి ఓవర్ (ఇన్నింగ్స్ 7)తోనే బెంగళూరు భరతం పట్టేశాడు. ఓవర్‌కు ఒకరిని చొప్పున మూడు కీలక వికెట్లను కూల్చి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు. తన టెక్నిక్‌తో ముందుగా కోహ్లిని క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలోనే డివిలియర్స్ క్రీజులోకి రాగానే 2 పరుగులు ఆ తర్వాత ఫోర్‌తో టచ్‌లోకి వచ్చాడు. ఇక బెంగళూరు జోరు మొదలైందనుకునేలోపే గోపాల్ చావుదెబ్బ తీశాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో డివిలియర్స్ (13; 2 ఫోర్లు)ను రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. తర్వాత 11వ ఓవర్ తొలి బంతికే హెట్‌మైర్ (1)ను ఔట్ చేసి.. రాజస్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.(చదవండి : కూర్చుని మాట్లాడుకుంటాం : కోహ్లి)
Comments
Please login to add a commentAdd a comment