గోవిందా... గోపాలా!  | Rajasthan beat Royal Challengers Bangalore by 7 wkts | Sakshi
Sakshi News home page

గోవిందా... గోపాలా! 

Published Wed, Apr 3 2019 2:50 AM | Last Updated on Wed, Apr 3 2019 4:33 PM

Rajasthan beat Royal Challengers Bangalore by 7 wkts - Sakshi

బ్యాటింగ్‌లో పరుగులు చేయలేకపోతున్నారు... బౌలింగ్‌ చేయడం చేత కావడం లేదు...ఫీల్డింగ్‌లో క్యాచ్‌లు పట్టడం అసలే సాధ్యం కావడం లేదు... ఇక గెలుపు గురించి బెంగళూరు ఏం ఆలోచిస్తుంది!  కోహ్లి సేన పరిస్థితి ఎలా ఉందో మరో సారి చూపించేలా వరుసగా నాలుగో పరాజయం ఆ జట్టును పలకరించింది.

పట్టికలో అట్టడుగున ఉన్న రెండు ‘రాయల్‌’ జట్ల మధ్య పోరులో చివరకు పైచేయి సాధించి రాజస్తాన్‌ ఖాతా తెరిస్తే ఆర్‌సీబీ మాత్రం ఇంకా శూన్యం దగ్గరే ఆగిపోయింది. అద్భుత బౌలింగ్‌తో మూడు కీలక వికెట్లు తీసిన శ్రేయస్‌ గోపాల్‌ దెబ్బకు బెంగళూరు ముందే చేతులెత్తేయగా... బ్యాటింగ్‌లో సమష్టి ప్రదర్శనతో రహానే బృందం మ్యాచ్‌ గెలుచుకుంది.   

జైపూర్‌: ఐపీఎల్‌–12 సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు రాత మారలేదు. విజయం దక్కలేదు. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ పరాజయాన్నే చవిచూసింది. ఇప్పటి దాకా ఖాతా తెరవని ఏకైక జట్టుగా మిగిలింది. మరోవైపు రాజస్తాన్‌ రాయల్స్‌ బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో కోహ్లి సేనపై గెలుపొందింది. 100వ ఐపీఎల్‌ మ్యాచ్‌కు నాయకత్వం వహించిన కోహ్లిని ఫలితం నిరాశపరిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 158 పరుగులు చేసింది. పార్థివ్‌ పటేల్‌ (41 బంతుల్లో 67; 9 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకం సాధించాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శ్రేయస్‌ గోపాల్‌ (3/12) కీలక వికెట్లతో బెంగళూరును దెబ్బతీశాడు. తర్వాత రాజస్తాన్‌ రాయల్స్‌ 19.5 ఓవర్లలో 3 వికెట్లకు 164 పరుగులు చేసి గెలిచింది. బట్లర్‌ (43 బంతుల్లో 59; 8 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. 

కోహ్లి... మళ్లీ... 
టాస్‌ నెగ్గిన రాజస్తాన్‌ ఫీల్డింగ్‌కు మొగ్గుచూపింది. దీంతో బెంగళూరు బ్యాటింగ్‌ను మొదలుపెట్టింది. పార్థివ్‌ పటేల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన కోహ్లి (25 బంతుల్లో 23; 3 ఫోర్లు) ఓ సాధారణ స్కోరుకే పరిమితమయ్యాడు. మరోవైపు పార్థివ్‌ మాత్రం ధాటిగా ఆడాడు. ఆర్చర్‌ వేసిన ఐదో ఓవర్లో మూడు బౌండరీలతో 14 పరుగులు చేశాడు. 

గోపాల్‌ దెబ్బ! 
బెంగళూరుకు పవర్‌ ప్లే ముగిసింది. మరోవైపు ప్రత్యర్థి బౌలర్‌ శ్రేయస్‌ గోపాల్‌ ‘పవర్‌’ మొదలైంది. ఈ లెగ్‌స్పిన్నర్‌ తన తొలి ఓవర్‌ (ఇన్నింగ్స్‌ 7)తోనే బెంగళూరు భరతం పట్టేశాడు. ఓవర్‌కు ఒకరిని చొప్పున మూడు కీలక వికెట్లను పడేశాడు. ముందుగా కోహ్లిని క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. డివిలియర్స్‌ క్రీజులోకి రాగానే 2 పరుగులు ఆ తర్వాత ఫోర్‌తో టచ్‌లోకి వచ్చాడు. ఇక బెంగళూరు జోరు మొదలైందనుకునేలోపే గోపాల్‌ చావుదెబ్బ తీశాడు. ఇన్నింగ్స్‌ 9వ ఓవర్లో డివిలియర్స్‌ (13; 2 ఫోర్లు)ను రిటర్న్‌ క్యాచ్‌తో పెవిలియన్‌ చేర్చాడు. తర్వాత 11వ ఓవర్‌ తొలి బంతికే హెట్‌మైర్‌ (1)ను ఔట్‌ చేశాడు. 

వికెట్లున్నా... ‘స్కోరు’ హోరెత్తలేదు. 
 11 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 74/3. తర్వాత స్టొయినిస్‌ జతయినా... మరో 7 ఓవర్ల వరకు (17.2) వికెట్‌ పడకపోయినా... బెంగళూరు మాత్రం ఆశించినన్ని ఎక్కువ పరుగులు చేయలేకపోయింది. పిచ్‌ పరిస్థితుల్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న రాజస్తాన్‌ బౌలర్లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను సమర్థంగా కట్టడి చేశారు. పార్థివ్‌ 29 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. క్రీజ్‌లోకి దిగిన వారిలో ఉత్తమంగా రాణించిన అతని ఆటకు ఆర్చర్‌ 18 ఓవర్‌లో తెరదించాడు. డెత్‌ ఓవర్లలోనూ బెంగళూరు చేసింది తక్కువే.  చివరి ఓవర్లో మొయిన్‌ అలీ సిక్స్, ఫోర్‌ కొట్టడంతో స్కోరు 150కి చేరింది.   

రాణించిన బట్లర్‌ 
లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌కు రహానే–బట్లర్‌ ఓపెనింగ్‌ జోడీ గెలుపుబాట వేసింది. నవదీప్‌ సైని వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ మూడో బంతికి కోహ్లి క్యాచ్‌ జారవిడవడంతో బతికి పోయిన రహానే... బట్లర్‌తో కలిసి తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించాడు. 60 పరుగుల వద్ద రహానే (20 బంతుల్లో 22; 4 ఫోర్లు) ఔట్‌కాగా... స్మిత్, బట్లర్‌ కలిసి జట్టు స్కోరును వంద పరుగులను దాటించా రు. ఈ క్రమంలో బట్లర్‌ 38 బంతుల్లో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. తర్వాత కాసేపటికే భారీషాట్‌కు ప్రయత్నించిన బట్లర్‌... చహల్‌ బౌలింగ్‌లో స్టొయినిస్‌కు చిక్కాడు. చేయాల్సిన రన్‌రేట్‌ మోస్తరుగానే ఉండటంతో రాయల్స్‌ బ్యాట్స్‌మెన్‌ స్మిత్‌ (31 బంతుల్లో 38; 2 ఫోర్లు, 1 సిక్స్‌), రాహుల్‌ త్రిపాఠి (23 బంతుల్లో 34 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఒత్తిడి లేకుండా ఆడారు. స్మిత్‌ ఔటైనా స్టోక్స్‌ (1 నాటౌట్‌)తో కలిసి త్రిపాఠి మ్యాచ్‌ ముగించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement