జైపూర్ : టీమిండియా కెప్టెన్‌గా ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందిస్తున్న విరాట్ కోహ్లికి.. ఐపీఎల్ టైటిల్ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. అతడి సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు గత సీజన్లలో పలు మార్లు ఫైనల్‌కు చేరినప్పటికీ కప్ మాత్రం చేజిక్కించుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 12 సీజన్‌లో కోహ్లి సేన పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో విఫలమైన ఆర్సీబీ.. మంగళవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. తద్వారా సీజన్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి అభిమానునలను నిరాశపరిచింది. కోహ్లి నాయకత్వం వహించిన 100వ ఐపీఎల్ మ్యాచ్‌లో ఘోర ఓటమి నమోదు కావడంతో ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ‘ఆర్సీబీ ఫ్యాన్స్ అని చెప్పులేకపోతున్నాం రా బాబూ’ అంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వరుసగా నాలుగు మ్యాచ్‌లు కోల్పోయినప్పటికీ కోహ్లి విశ్వాసం ఏమాత్రం చెక్కుచెదరలేదని అతడి మాటల ద్వారా అర్థమవుతోంది.(చదవండి : గోవిందా... గోపాలా! )
ఐపీఎల్- 12లో భాగంగా సవాయ్ మాన్‌సింగ్ మైదానంలో ఆతిథ్య జట్టు రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటి దాకా ఖాతా తెరవని ఏకైక జట్టుగా ఆర్సీబీ మిగిలింది. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన ఆర్సీబీ కెప్టెన్ కోహ్లి మాట్లాడుతూ.. ‘ ఈరోజు మేము గట్టి పోటీ ఇచ్చామనే భావిస్తున్నా. మరో 15- 20 పరుగులు చేసి ఉంటే బాగుండేది. మేము చేసిన కొన్ని తప్పుల వల్ల విజయం కోసం ఇంకా ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఐపీఎల్ లాంటి టోర్నమెంట్లలో ఇలాంటివి సర్వసాధారణం. ప్రారంభం బాగుండనంత మాత్రాన నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మాలో ఇంకా పోరాట పటిమ మిగిలే ఉంది. జట్టు సభ్యులమంతా కూర్చుని చర్చించుకుంటాం. విజయానికి కావాల్సిన వ్యూహాలు రచిస్తాం. మమ్మల్ని మేము మెరుగుపరచుకుని రానున్న మ్యాచ్‌లలో గెలుస్తామనే నమ్మకం ఉంది’ అని వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment