శుబ్‌మన్‌ అజేయ సెంచరీ | Shubman Gill slams century to guide India C to Deodhar Trophy final | Sakshi
Sakshi News home page

శుబ్‌మన్‌ అజేయ సెంచరీ

Published Fri, Oct 26 2018 4:47 AM | Last Updated on Fri, Oct 26 2018 4:47 AM

Shubman Gill slams century to guide India C to Deodhar Trophy final - Sakshi

న్యూఢిల్లీ: అండర్‌–19 వరల్డ్‌ కప్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచిన యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ (111 బంతుల్లో 106 నాటౌట్‌; ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ శతకంతో చెలరేగడంతో భారత్‌ ‘సి’ జట్టు దేవధర్‌ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ టోర్నీలో నమోదైన తొలి సెంచరీ ఇదే కావడం విశేషం. గురువారం ఇక్కడ జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ ‘ఎ’పై 6 వికెట్ల తేడాతో ‘సి’ జట్టు విజయం సాధించింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ ‘ఎ’ జట్టు అభిమన్యు ఈశ్వరన్‌ (69; 5 ఫోర్లు), నితీశ్‌ రాణా (68; 6 ఫోర్లు, 1 సిక్స్‌), అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌ (59; 9 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకాలతో ఆకట్టుకోవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది. కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (23 బంతుల్లో 32; 4 ఫోర్లు), కేదార్‌ జాదవ్‌ (25 బంతుల్లో 41 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా పరుగులు రాబట్టడంతో చివరి 10 ఓవర్లలో 92 పరుగులు వచ్చాయి. ప్రత్యర్థి బౌలర్లలో విజయ్‌ శంకర్‌ 3, చహర్‌ 2, గుర్బాని ఓ వికెట్‌ పడగొట్టారు.

అనంతరం భారత్‌ ‘సి’ 47 ఓవర్లలో 4 వికెట్లకు 296 పరుగులు చేసి విజయాన్నందుకుంది. లక్ష్యఛేదనలో 85 పరుగులకే కెప్టెన్‌ రహానే (14), అభినవ్‌ ముకుంద్‌ (37; 6 ఫోర్లు), సురేశ్‌ రైనా (2)  వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ‘సి’ జట్టును శుబ్‌మన్‌ గిల్‌ ఆదుకున్నాడు. ఇషాన్‌ కిషన్‌ (60 బంతుల్లో 69; 11 ఫోర్లు)తో కలిసి నాలుగో వికెట్‌కు 121, సూర్యకుమార్‌ యాదవ్‌ (36 బంతుల్లో 56 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో కలిసి అభేద్యమైన ఐదో వికెట్‌కు 90 పరుగులు జోడించి జట్టును గెలిపించాడు. విజయానికి 5 ఓవర్లలో 27 పరుగులు అవసరమైన దశలో శుబ్‌మన్, సూర్యకుమార్‌ యాదవ్‌ ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడటంతో మరో మూడు ఓవర్లు మిగిలుండగానే ‘సి’ జట్టు గెలుపొందింది. అశ్విన్, ధవల్‌ కులకర్ణి, ములాని తలా ఓ వికెట్‌ పడగొట్టారు. సిరాజ్‌ నిరాశ పరిచాడు. మూడు ఓవర్లు వేసి 32 పరుగులిచ్చాడు. శనివారం జరిగే ఫైనల్లో భారత్‌ ‘బి’తో ‘సి’ జట్టు తలపడనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement