
హాంకాంగ్ ఓపెన్ కు సైనా దూరం
కౌలూన్(హాంకాంగ్): ఈ సీజన్ బ్యాడ్మింటన్ ముగింపు టోర్నీఅయిన హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ నుంచి భారత స్టార్ షట్లర్, ప్రపంచ రెండో ర్యాంక్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ వైదొలిగింది. కాలి గాయంతో బాధపడుతుండటంతో హాంకాంగ్ బ్యాడ్మింటన్ టోర్నీలో పాల్గొనడం లేదని సైనా స్పష్టం చేసింది. దీంతో భారత మహిళల టీమ్ కు పివి సింధు, పురుషుల టీమ్ కు కిదాంబి శ్రీకాంత్ లు సారథ్యం వహించనున్నారు. ఈ టోర్నీ నుంచి ముందుగానే సైనా వైదొలగడంతో భారత జట్టు ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాల్సిందే. చివరిసారి 2010 లో హాంకాంగ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను సైనా గెలిచింది.
బుధవారం నుంచి ఆరంభం కానున్న టోర్నీలో సింధు తన తొలి పోరులో టాప్ సీడ్, ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్(స్పెయిన్)తో తలపడనుంది. గత నెల్లో జరిగిన డెన్మార్ ఓపెన్ లో మారిన్ ను ఓడించిన సింధు అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. కాగా, ఓవరాల్ ముఖాముఖి రికార్డులో సింధు 2-3తో వెనుకంజలో ఉంది. కాగా, పురుషుల సింగిల్స్ లో కిదాంబి శ్రీకాంత్ తొలి రౌండ్ లో టియాన్ హౌయి(చైనా)తో తలపడనున్నాడు. గత సంవత్సరం హాంకాంగ్ ఓపెన్ లో శ్రీకాంత్ సెమీ ఫైనల్ వరకూ వెళ్లాడు.