‘ఆ పది మంది’ లేకుండా... | Six Pakistan Cricket Players Cancelled For England Tour | Sakshi
Sakshi News home page

‘ఆ పది మంది’ లేకుండా...

Published Sun, Jun 28 2020 12:03 AM | Last Updated on Sun, Jun 28 2020 4:29 AM

Six Pakistan Cricket Players Cancelled For England Tour - Sakshi

కరాచీ: ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లే పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుపై స్పష్టత వచ్చింది. తొలిసారి నిర్వహించిన కరోనా టెస్టులో పాజిటివ్‌గా తేలిన 10 మంది క్రికెటర్లను పక్కన పెట్టి మిగతా 18 మంది ఆటగాళ్లు, 11 మంది సహాయక సిబ్బందితో పాక్‌ జట్టు నేడు ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్‌ వెళ్లనుంది. వీరితో పాటు రిజర్వ్‌గా ఎంపిక చేసిన ఇద్దరు ఆటగాళ్లు కూడా అదనం. ఈ సిరీస్‌ కోసం పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) 28 మంది ఆటగాళ్లతో జట్టును ఎంపిక చేసింది. వీరిలో పది మంది కరోనా పాజిటివ్‌గా తేలారు. వీరికి శనివారం మరో సారి కోవిడ్‌–19 పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఆరుగురు ఆటగాళ్లు మొహమ్మద్‌ హఫీజ్, వహాబ్‌ రియాజ్, ఫఖర్‌ జమాన్, షాదాబ్‌ ఖాన్, మొహమ్మద్‌ రిజ్వాన్, మొహమ్మద్‌ హస్‌నైన్‌ ‘నెగెటివ్‌’గా తేలారు. అయినా సరే వీరిని మాత్రం అప్పుడే ఇంగ్లండ్‌కు పంపరాదని పీసీబీ నిర్ణయించింది.
‘నిబంధనల ప్రకారం వరుసగా రెండోసారి వారి టెస్టులు నెగెటివ్‌గా రావాలి. అప్పుడే ఆ ఆరుగురికి ఇంగ్లండ్‌ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తాం. 18 మంది రెగ్యులర్‌ ఆటగాళ్లతో పాటు రిజర్వ్‌గా ఎంపికై నెగెటివ్‌ వచ్చిన మూసా ఖాన్, రొహైల్‌ నజీర్‌ కూడా జట్టుతో పాటు వెళుతున్నారు’ అని పీసీబీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ వసీం ఖాన్‌ వెల్లడించారు. మరో నలుగురు క్రికెటర్లు హైదర్‌ అలీ, హారిస్‌ రవూఫ్, కాశిఫ్‌ భట్టీ, ఇమ్రాన్‌ ఖాన్‌ మాత్రం వరుసగా రెండోసారి కరోనా పాజిటివ్‌గా బయట పడ్డారు. ఈ టూర్‌లో భాగంగా ఇంగ్లండ్, పాకిస్తాన్‌ మధ్య 3 టెస్టులు, 3 టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. పాక్‌ జట్టు ముందుగా మాంచెస్టర్‌ చేరుకొని అక్కడి నుంచి వస్టర్‌షైర్‌కు వెళుతుంది. అక్కడ ఇంగ్లండ్‌ దేశపు నిబంధనల ప్రకారం కరోనా టెస్టులు జరుగుతాయి. ఆపై 14 రోజుల క్వారంటైన్‌ మొదలవుతుంది. జూలై 30 నుంచి ఇరు జట్ల మధ్య లార్డ్స్‌లో తొలి టెస్టు జరుగుతుంది. పాక్‌ జట్టు ప్రయాణం కోసం ఇంగ్లండ్‌ బోర్డే ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడం విశేషం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement