పరుగుల వేటలో పల్టీ | Skipper MS Dhoni praises bowlers, rues unlucky dismissals in second innings | Sakshi
Sakshi News home page

పరుగుల వేటలో పల్టీ

Published Mon, Feb 10 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 3:31 AM

పరుగుల వేటలో పల్టీ

పరుగుల వేటలో పల్టీ

తొలి టెస్టులో భారత్ ఓటమి
 శిఖర్ ధావన్ సెంచరీ వృథా
 వాగ్నేర్‌కు నాలుగు వికెట్లు
 
 బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో భారత్ పరుగుల వేటలో బోల్తా కొట్టింది. ధావన్, కోహ్లి మినహా మిగతా వారు నిరాశపర్చడంతో తొలి టెస్టులో ఓ అద్భుతమైన విజయాన్ని అందుకునే అవకాశాన్ని చేజార్చుకుంది. కీలక సమయంలో బౌలర్లు రాణించడంతో న్యూజిలాండ్ చక్కని గెలుపుతో సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

 
 ఆక్లాండ్: భారీ లక్ష్యం కళ్ల ముందు కదలాడుతున్నా.... కుర్రాళ్ల పోరాటం చూసి గెలుపు మనదే అనుకున్నాం. శిఖర్ ధావన్ (211 బంతుల్లో 115; 12 ఫోర్లు, 1 సిక్సర్) దూకుడు... విరాట్ కోహ్లి (102 బంతుల్లో 67; 12 ఫోర్లు) నిలకడను చూశాక విజయంపై ఆశలు రెట్టింపు అయ్యాయి. కానీ రెండో సెషన్‌లో కొత్త బంతిని తీసుకున్న కివీస్... నిలకడగా సాగుతున్న భారత్ ఇన్నింగ్స్‌ను నిట్ట నిలువునా ముంచింది. ఫలితంగా రికార్డు లక్ష్య ఛేదన దిశగా సాగిపోతున్న టీమిండియాను ఒక్కసారిగా కుప్పకూల్చింది. దీంతో చిరస్మరణీయ విజయాన్ని సాధించే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్న ధోని సేన తొలి టెస్టులో 40 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడింది.
 
  దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. 407 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు... 87/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం నాలుగో రోజు బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 96.3 ఓవర్లలో 366 పరుగులకు ఆలౌటైంది. చివర్లో ధోని (41 బంతుల్లో 39; 6 ఫోర్లు), జడేజా (21 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్సర్) కాసేపు పోరాడారు. మెకల్లమ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు ఈనెల 14 నుంచి వెల్లింగ్టన్‌లో జరుగుతుంది.
 
 సెషన్-1     ఓవర్లు: 29; పరుగులు: 93; వికెట్లు: 1
 
 కోహ్లి నిలకడ
 ప్రత్యర్థులు పదేపదే ఎల్బీడబ్ల్యు అప్పీల్ చేసినా ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ ధావన్‌పై ప్రభావం చూపలేదు. దూకుడుగా ఆడుతూ తొలి ఓవర్‌లోనే అర్ధసెంచరీ (75 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. అయితే రెండో ఎండ్‌లో పుజారా (23) ఆకట్టుకోలేకపోయాడు. సౌతీ వేసిన ఓ చక్కటి అవుట్ స్వింగర్‌కు వెనుదిరిగాడు.
 
 దీంతో రెండో వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన కోహ్లి, ధావన్‌తో కలిసి ఓపికగా బ్యాటింగ్ చేశాడు. కివీస్ బౌలర్లు ఒత్తిడి పెంచినా తడబాటు లేకుండా ఆడాడు. వాగ్నేర్, సోధి బౌలింగ్‌లో వరుస బౌండరీలతో వేగంగా పరుగులు రాబట్టాడు. లంచ్‌కు ముందు ఓవర్‌లో బౌండరీ సాధించిన కోహ్లి 80 బంతుల్లో అర్ధ శతకాన్ని అందుకున్నాడు. ధావన్ కూడా నిలకడగా ఆడటంతో మరో వికెట్ పోకుండా భారత్ 180/2 స్కోరుతో లంచ్‌కు వెళ్లింది.
 
 సెషన్-2  ఓవర్లు: 27; పరుగులు: 90; వికెట్లు: 3
 వాగ్నేర్ విజృంభణ
 లంచ్ తర్వాత ధావన్ వేగం పెంచాడు. సోధి వేసిన ఇన్నింగ్స్ 59వ ఓవర్‌లో ఓ సిక్సర్, రెండు ఫోర్లు కొట్టి కెరీర్‌లో రెండో సెంచరీ పూర్తి చేశాడు. కానీ వాగ్నేర్ కట్టుదిట్టమైన బంతులతో కోహ్లిని కట్టడి చేశాడు. ఓ షార్ట్ బంతిని అనవసరంగా ఆడి వాట్లింగ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ జోడి మూడో వికెట్‌కు 126 పరుగులు జోడించింది. ధావన్‌కు జత కలిసిన రహానే (18) కుదురుకునేందుకు ప్రాధాన్యమిచ్చాడు.
 
 దీంతో స్కోరు మందగించడంతో ధావన్ ఒత్తిడికి లోనయ్యాడు. వాగ్నేర్ బౌలింగ్‌లో ఓ బౌన్సర్‌ను తప్పించుకునే యత్నంలో అవుటయ్యాడు. 80 ఓవర్ల తర్వాత కొత్త బంతిని తీసుకోవడం భారత్‌ను దెబ్బ తీసింది. తొలి బంతికే రహానే కూడా వెనుదిరిగాడు. ఈ సెషన్‌లో బౌలింగ్ హవా నడవడంతో భారత్ 268 పరుగులకే సగం భారత జట్టు పెవిలియన్ చేరింది.
 
 సెషన్-3 ఓవర్లు: 15.3; పరుగులు: 96; వికెట్లు: 5
 17 బంతుల్లో 3 వికెట్లు
 టీ తర్వాత తొలి బంతికే రోహిత్ అవుట్ కావడంతో జట్టును ఆదుకునే భారం ధోని, జడేజాలపై పడింది. బౌల్ట్ బౌలింగ్‌లో ధోని నాలుగు, సౌతీ బౌలింగ్‌లో జడేజా రెండు ఫోర్లు కొట్టి జోరు పెంచారు. 5.4 ఓవర్లలోనే 54 పరుగులు జతచేసి విజయంపై ఆశలు పెంచారు. ఈ దశలో కివీస్ బౌలర్ బౌల్ట్ కొత్త బంతితో నిప్పులు చెరిగాడు. తన బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టిన జడేజాను మరో షాట్‌కు ఉసిగొల్పాడు.
 
 దీంతో రెచ్చిపోయిన జడేజా బంతిని మిడాన్‌లోకి లేపడంతో సోధి చక్కటి క్యాచ్ అందుకున్నాడు. అనవసరపు షాట్‌తో జడేజా అవుట్ కావడంతో భారత్ ఆశలు మరింత సన్నగిల్లాయి. చివర్లో 17 బంతుల వ్యవధిలో జహీర్ (17), ధోని, ఇషాంత్ (4)లు అవుట్ కావడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. వాగ్నేర్ 4, బౌల్ట్, సౌతీ చెరో మూడు వికెట్లు తీశారు.
 
 స్కోరు వివరాలు
 న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 503 ఆలౌట్
 భారత్ తొలి ఇన్నింగ్స్: 202 ఆలౌట్
 న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 105 ఆలౌట్
 భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ (సి) వాట్లింగ్ (బి) సౌతీ 13; ధావన్ (సి) వాట్లింగ్ (బి) వాగ్నేర్ 115; పుజారా (సి) వాట్లింగ్ (బి) సౌతీ 23; కోహ్లి (సి) వాట్లింగ్ (బి) వాగ్నేర్ 67; రోహిత్ (సి) వాట్లింగ్ (బి) సౌతీ 19; రహానే ఎల్బీడబ్ల్యు (బి) బౌల్ట్ 18; ధోని (బి) వాగ్నేర్ 39; జడేజా (సి) సోధి (బి) బౌల్ట్ 26; జహీర్ (సి) టేలర్ (బి) వాగ్నేర్ 17; ఇషాంత్ (సి) వాట్లింగ్ (బి) బౌల్ట్ 4; షమీ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 25; మొత్తం: (96.3 ఓవర్లలో ఆలౌట్) 366.
 
 వికెట్ల పతనం: 1-36; 2-96; 3-222; 4-248; 5-268; 6-270; 7-324; 8-349; 9-362; 10-366
 
 బౌలింగ్: బౌల్ట్ 23.3-2-86-3; సౌతీ 23-4-81-3; వాగ్నేర్ 25-8-62-4; అండర్సన్ 7-1-22-0; సోధి 15-2-78-0; విలియమ్సన్ 3-0-18-0.
 
 1 2002 తర్వాత భారత్‌పై న్యూజిలాండ్ టెస్టు నెగ్గడం ఇదే మొదటిసారి. మొత్తంగా కివీస్‌కు ఇది పదో విజయం.
 
 4 మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన నాలుగో భారత ఓపెనర్ ధావన్. ముస్తాక్ అలీ, గవాస్కర్, వసీమ్ జాఫర్ ముందున్నారు. 1979 (గవాస్కర్) తర్వాత విదేశీ గడ్డపై ఈ ఘనత సాధించిన ఆటగాడు ధావన్.
 
 11 విదేశీ గడ్డపై అత్యధిక టెస్టులు (11) ఓడిన భారత కెప్టెన్ ధోని.
 
 10 విదేశాల్లో గత 11 టెస్టుల్లో భారత్ పదింటిలో ఓడింది.
 
 తొలి టెస్టును కివీస్ నెగ్గడంలో ఆ జట్టు పేస్ బౌలర్లు కీలక పాత్ర పోషించారు. భారత్ కోల్పోయిన 20 వికెట్లు ఆ జట్టు పేసర్లే పడగొట్టారు. కివీస్ టెస్టు చరిత్రలో ఇలా జరగడం ఇది 12వ సారి. గత మూడు టెస్టుల్లో (విండీస్‌తో కలిపి) న్యూజిలాండ్ తీసిన 60 వికెట్లలో 59 పేస్ బౌలర్లే పడగొట్టారు.
 
 100... కాదు కాదు 99!
 ముందుగా హెల్మెట్ తీయడం... శరీరానికి దూరంగా రెండు చేతులను వెడల్పుగా చాస్తూ ఆకాశం వైపు చూడటం... దాదాపు ఏడాది కాలంగా సెంచరీ పూర్తి చేయగానే అందరికీ గుర్తొచ్చే శిఖర్ ధావన్ ‘సిగ్నేచర్ స్టైల్’ ఇదే. అంతర్జాతీయ కెరీర్‌లో ఆరు శతకాలు చేసిన సందర్భాల్లోనూ ధావన్ ఇదే పోజిచ్చాడు.
 
 ఆదివారం కూడా అతను సరిగ్గా అదే చేశాడు. అయితే కాస్త తొందర పడ్డాడు. సోధి బౌలింగ్‌లో ముందుకొచ్చి వైడ్ లాంగాన్ దిశగా శిఖర్ సిక్సర్ బాదాడు. ఆ వెంటనే సెంచరీగా భావించి తనకు అలవాటైన తరహాలో నిలబడ్డాడు. అయితే అప్పటికి అతని స్కోరు 99 మాత్రమే! బాబూ...ఇంకా పని కాలేదు అన్నట్లుగా కోహ్లి నవ్వుతూ సైగ చేశాడు. మ్యాచ్ సీరియస్‌గా సాగుతున్న వేళ ఈ ఘటన మైదానమంతా వినోదాన్ని పంచింది. అయితే తర్వాతి బంతికే ఫోర్‌తో శతకం అందుకున్న ధావన్ మరోసారి తనదైన శైలిలో అదే పోజుతో ‘రీప్లే’ ఇవ్వడం విశేషం.
 
 ఇంకా నేర్చుకోవాలి
 ఈ టెస్టు గురించి నాలో మిశ్రమ స్పందనలున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో మేం సరిగా బౌలింగ్ వేయలేకపోయాం. అయితే రెండో ఇన్నింగ్స్‌లో ఈ లోపాన్ని అధిగమించాం. అటు బ్యాటింగ్‌లోనూ 85 ఓవర్ల వరకు మేం పటిష్టంగానే ఉన్నాం. ఆ తర్వాత కొద్ది వ్యవధిలోనే పలు వికెట్లను కోల్పోయాం. దీనికి తోడు రహానే వికెట్‌పై మాకు కఠిన నిర్ణయం ఎదురైంది. అప్పటికే 30-35 పరుగులు వెనుకబడి ఉన్నాం. ఇదే చివర్లో దెబ్బతీసింది. రెండో కొత్త బంతితో ఇబ్బంది ఎదుర్కొన్నాం.
 
 అక్కడ మా వికెట్లను కాపాడుకున్నట్టయితే మిగతా పరుగులు సాధించేవాళ్లం.  అంపైర్ తప్పుడు నిర్ణయాలు కూడా దెబ్బతీశాయి. ఇలాంటి ఉత్కంఠభరిత మ్యాచ్‌లతో మూడు, నాలుగు టెస్టు మ్యాచ్‌ల అనుభవం లభిస్తుంది. సెషన్ల వారీగా లక్ష్యాన్ని ఛేదించే విధానం నేర్చుకోవాల్సి ఉంది. నాణ్యమైన ఆటగాళ్లు ఇప్పటికే ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారనుకుంటున్నాను. వన్డే సిరీస్‌తో పాటు ఈ మ్యాచ్‌లోనూ మేం మంచి స్థానంలోనే ఉన్నాం. కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం. మేం ఇంకా నేర్చుకోవాలేమో. రెండో టెస్టులోనూ ఇవే పరిస్థితులు ఎదురైతే సత్తా
 చూపుతాం.
 - ఎంఎస్ ధోని (భారత కెప్టెన్)
 
 ఆ నిర్ణయంపై విచారం లేదు
 మేం భారీ స్కోరు చేశామని తెలుసు. ఒకవేళ మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తే మంచి ఆధిక్యం లభిస్తుందని అనుకున్నాం. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ శక్తిసామర్థ్యాల గురించి పూర్తి అవగాహన ఉంది. 220 పరుగులకు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఓ దశలో భారత్ అత్యంత పటిష్టంగా ఉంది.
 
 ఈ సమయంలో మా బౌలర్లు మ్యాచ్‌ను మలుపు తిప్పారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ స్థానమేమిటో మాకు తెలుసు కాబట్టి ఈ విజయం అత్యంత చిరస్మరణీయం. ఫాలోఆన్ ఆడించకుండా తీసుకున్న నిర్ణయంపై నాకెలాంటి పశ్చాత్తాపం లేదు. 400కు పైగా టార్గెట్ చిన్న మొత్తం కాదు. ప్రపంచ క్రికెట్‌లో కేవలం మూడు జట్లు మాత్రమే ఈ లక్ష్యాన్ని ఛేదించాయి. అయినా చివరి రోజు 150-200 పరుగుల లక్ష్యం కోసం మేం బరిలోకి దిగడం నాకు నచ్చదు.
 - బ్రెండన్ మెకల్లమ్ (కివీస్ కెప్టెన్)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement