తొలి టెస్టు కివీస్ వశం
భారత జట్టుతో జరిగిన తొలిటెస్టులో న్యూజిలాండ్ విజయం సాధించింది. అందినట్టే అందిన మ్యాచ్ కాస్తా చేజారడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. ఒక దశలో ఎలాగైనా భారత జట్టు గెలుస్తుందనే భావించినా, వరుసగా మిడిలార్డర్ విఫలం కావడంతో మ్యాచ్ కివీస్ వశమైంది. విజయం సాధించాలంటే రెండో ఇన్నింగ్స్ లో 407 పరుగులు చేయాల్సి ఉండగా, 366 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ ధోనీ 39 పరుగులకే ఔటవ్వడం టీమిండియా వెన్ను విరిచింది. రవీంద్ర జడేజా బ్యాట్ తో కూడా మెరుపులు మెరిపించినా, 21 బంతుల్లో 26 పరుగులే చేసి పెవిలియన్ దారి పట్టాడు. జడేజా, ధోనీ క్రీజులో ఉన్నంతసేపూ మ్యాచ్ తప్పకుండా భారత వశం అవుతున్నట్లే అనిపించింది. వీళ్లిద్దరూ ఔట్వవగానే ఇక టీమిండియా ఆశలు అడియాసలయ్యాయి. 40 పరుగుల తేడాతో న్యూజిలాండ్ తొలి టెస్టును వశం చేసుకుని సిరీస్ లో 1-0 తేడాతో ముందంజలో నిలిచింది.
అంతకుముందు నాలుగో రోజు ఆటలో టీ విరామం తర్వాత భారత జట్టు ఆరు వికెట్లు నష్టపోయి 290 పరుగులు చేసింది. 211 బంతుల్లో 12 ఫోర్లు ఒక సిక్సు సాయంతో 115 పరుగులు చేసిన శిఖర్ ధావన్, వాగ్నర్ బౌలింగ్లో వాట్లింగ్ క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. చిట్ట చివరి వన్డేలో తప్ప ఏ మ్యాచ్లోనూ తగిన స్కోరు చేయలేక, విమర్శల పాలవుతున్న విరాట్ కోహ్లీ తొలి ఇన్నింగ్స్లో నాలుగు పరుగులకే వెనుదిరిగినా, రెండో ఇన్నింగ్స్లో మాత్రం 102 బంతులను ఎదుర్కొని 12 ఫోర్లతో 67 పరుగులు చేశాడు. అచ్చం శిఖర్ ధావన్ లాగే, వాగ్నర్ బౌలింగ్లో వాట్లింగ్ క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. వీళ్లిద్దరి పుణ్యమాని భారత్ కాస్త నిలదొక్కుకుంది. టీ విరామం తర్వాత రోహిత్ శర్మ ఔటవ్వడంతో రవీంద్ర జడేజా బరిలోకి దిగాడు. వేగంగా పరుగులు తీస్తూ కెప్టెన్ ధోనికి సహకారం అందించాడు. కానీ, చివరకు ధోనీ 39 పరుగుల వద్ద, జడేజా 26 పరుగుల వద్ద ఔటయ్యారు. దీంతో మ్యాచ్ చేజారిపోయింది.
స్కోరు వివరాలు:
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 503; భారత్ తొలి ఇన్నింగ్స్ 202; న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 105, భారత్ రెండో ఇన్నింగ్స్: 366