వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్ బెర్తల్లో ఓ బెర్త్ ఆస్ట్రేలియా ఇదివరకే ఖరారు చేసుకోగా మరో బెర్త్ కోసం భారత్, శ్రీలంక జట్ల మధ్య ఒకింత లేని పోటీ నెలకొన్న విషయం విధితమే. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే.. ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో గెలిస్తే సరిపోతుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయి.. మరోపక్క కివీస్‌తో జరుగుతున్న 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో శ్రీలంక 2-0 తేడాతో గెలిస్తే, డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్‌ను వెనక్కు నెట్టి ద్వీప దేశం ఫైనల్‌కు చేరుకుంటుంది.
ఈ ఆసక్తికర పరిస్థితుల నడుమ కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో శ్రీలంక అద్భుత ప్రదర్శన కనబరుస్తూ, టీమిండియా అభిమానులకు భయం పుట్టిస్తుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. కెప్టెన్ దిముత్ కరుణరత్నే (50), కుశాల్ మెండిస్ (87) అర్ధసెంచరీలతో రాణించగా.. ఏంజెలో మాథ్యూస్ (47), దినేశ్ చండీమాల్ (39) పర్వాలేదనిపించారు. ఓపెనర్ ఒషాడో ఫెర్నాండో (13), నిరోషన్ డిక్వెల్లా (7) నిరాశపర్చగా.. ధనంజయ డిసిల్వ (39), కసున్ రజిత (16) క్రీజ్‌లో ఉన్నారు.
కివీస్ బౌలర్లలో సౌథీ 3, మ్యాట్ హెన్రీ 2, బ్రేస్‌వెల్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, తొలి రోజు ఆటలో శ్రీలంక బ్యాటర్లు ఓ మోస్తరుగా రాణించడంతో భారత అభిమానుల్లో కలవరం మొదలైంది. ఒకవేళ లంక ఆటగాళ్లు ఇదే జోరును కొనసాగించి రెండో టెస్ట్‌ల్లో గెలిస్తే టీమిండియా ఫైనల్ అవకాశాలు గల్లంతవుతాయని కొందరు అభిమానులు బెంగపెట్టుకున్నారు. ఆసీస్‌పై నాలుగో టెస్ట్‌లో టీమిండియా గెలిస్తే ఈ సమస్య ఉండదు కాబట్టి, అహ్మదాబాద్ టెస్ట్‌లో ఎలాగైనా గెలవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment