బోర్డర్–గావస్కర్ ట్రోఫీ తొలి రెండు టెస్టుల్లో భారత జట్టు ఆటను చూస్తే 4–0 ఖాయమనిపించింది. అయితే ఒక్కసారిగా పుంజుకున్న ఆ్రస్టేలియా మూడో టెస్టు గెలవడంతో పాటు చివరి మ్యాచ్‌ను కూడా ఆసక్తికరంగా మార్చేసింది. అన్ని రంగాల్లో ప్రత్యర్థికంటే పైచేయిగానే కనిపిస్తున్నా నాలుగో టెస్టులో రోహిత్ సేన విజయం సాధిస్తుందని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. గత మ్యాచ్ గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో స్మిత్ బృందం సానుకూల దృక్పథంతో పోరుకు సై అంటోంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని అతి పెద్ద క్రికెట్ స్టేడియంలో సిరీస్‌కు ఆసక్తికర ముగింపు ఖాయం. ఇరు దేశాల ప్రధానమంత్రులు హాజరు కానుండటం కూడా తొలి రోజు ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.
అహ్మదాబాద్: టెస్టు క్రికెట్‌లో అత్యంత హోరాహోరీ సమరాల్లో ఒకటైన భారత్, ఆ్రస్టేలియా పోరు చివరి అంకానికి చేరింది. సిరీస్‌లో ఇప్పటికే ఆధిక్యంలో ఉన్న భారత్ మరో మ్యాచ్ గెలిచి వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించాలని పట్టుదలగా ఉండగా... గత కొన్నేళ్లలో ఏ పర్యాటక జట్టుకూ సాధ్యంకాని రీతిలో సిరీస్‌లో రెండు టెస్టులు నెగ్గిన ఘనతను సొంతం చేసుకోవాలని ఆసీస్ భావిస్తోంది. ఇండోర్ టెస్టు అనుభవం దృష్ట్యా టీమిండియా పూర్తిగా స్పిన్ పిచ్ వైపు మొగ్గు చూపకపోవచ్చు. కాబట్టి ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు సమాన అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు.
భరత్ చోటు పదిలం!
ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు చూస్తే భారత బ్యాటర్లకు బాగానే పరీక్ష పెట్టింది. రోహిత్ మినహా మరెవరూ సెంచరీ సాధించలేకపోగా, పుజారా ఒకే ఒక అర్ధ సెంచరీ చేశాడు. కోహ్లి అయితే అది కూడా లేదు. బౌలర్ల చలవతో రెండు టెస్టుల్లోనూ భారత్ విజయాన్ని అందుకోగలిగింది. ఇంకా చెప్పాలంటే అక్షర్ పటేల్ చేసిన రెండు అర్ధసెంచరీలు, జడేజా హాఫ్ సెంచరీ జట్టును ఆదుకున్నాయి.
లోయర్ ఆర్డర్ భాగస్వామ్యం లేకపోతే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో. ఈ నేపథ్యంలో ప్రధాన బ్యాటర్లంతా ఈ మ్యాచ్‌లోనైనా తమ స్థాయికి తగిన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. చాలా కాలంగా టెస్టుల్లో విఫలమవుతున్న కోహ్లి తన సత్తా చాటేందుకు ఇదే సరైన అవకాశం. గిల్ కూడా తనకు దక్కిన అవకాశాన్ని వాడుకోవాల్సి ఉంది. మరోవైపు వికెట్ కీపర్‌గా ఆంధ్ర ఆటగాడు కోన శ్రీకర్ భరత్‌ను తప్పించి ఇషాన్ కిషన్‌ను ఆడించే అవకాశాలు ఉన్నాయని వినిపించింది.
అయితే మీడియా సమావేశంలో రోహిత్ చెప్పినదాన్ని బట్టి చూస్తే భరత్ కొనసాగడం ఖాయం. భరత్ బ్యాటింగ్ సంతృప్తికరంగా లేకపోయినా... బ్యాటింగ్‌లో సమష్టి వైఫల్యం కనిపిస్తున్నప్పుడు ఒక్క భరత్‌నే నిందించడంలో అర్థం లేదనే కారణంతో పాటు కీపర్‌గా మెరుగైన నైపుణ్యం ఉండటం భరత్‌కు కలిసి రానుంది. బౌలింగ్‌లో జట్టులో ఒక మార్పు చోటు చేసుకోవచ్చు.
గత టెస్టులో విశ్రాంతి తీసుకున్న షమీ నేరుగా రానుండగా... అతని కోసం సిరాజ్‌ను పక్కన పెట్టే అవకాశం ఉంది. ఉమేశ్ ఇండోర్ టెస్టులో చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ మైదానంలో ఆడిన రెండు టెస్టుల్లోనే 20 వికెట్లు తీసిన అక్షర్ పటేల్‌పై అందరి దృష్టీ నిలిచింది. ఈ మైదానం అతనికి సొంత గ్రౌండ్ కూడా కావడం విశేషం.
మార్పుల్లేకుండా...
గెలిచిన జట్టులో మార్పులు చేయకూడదనేది సహజ సూత్రం. అరుదైన విజయం సాధించిన ఆస్ట్రేలియా కూడా అందుకు మినహాయింపేమీ కాదు. స్పిన్‌కు మరీ అనుకూలించే పిచ్ కాకపోయినా ముగ్గురు స్పిన్నర్లు లయన్, మర్ఫి, కునెమన్‌లను కంగారూ టీమ్ మేనేజ్‌మెంట్ నమ్ముకుంది. అదనపు బ్యాటర్ కోసం ప్రధాన పేసర్ స్టార్క్‌ను పక్కన పెట్టే ప్రతిపాదన వచ్చినా... మరీ ఒక్క పేసర్ కూడా లేకుండా ఆడటం జట్టును లోపంగా మారవచ్చు.
స్టార్క్‌తో పాటు గ్రీన్‌లాంటి మీడియం పేస్ ఆల్‌రౌండర్ ఉండటంతో రెండో రెగ్యులర్ పేసర్ అవసరం లేదు. బ్యాటింగ్‌లోనైతే ఆసీస్ నిశ్చింతగా ఉంది. 1–8 స్థానాల వరకు ఎలాంటి మార్పు అవసరం లేకుండా ఆ జట్టు బ్యాటింగ్ బృందం నిలదొక్కుకుంది. ఉస్మాన్ ఖాజా ఈ సిరీస్‌లో అందరికంటే మెరుగైన ప్రదర్శన కనబర్చగా... హెడ్, హ్యాండ్స్‌కాంబ్ రాణించారు.
ఎన్నో అంచనాలతో భారత్‌లో అడుగు పెట్టిన లబుషేన్ ఒక భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. 2017 తరహాలో అద్భుతమైన బ్యాటింగ్‌ను ప్రదర్శించకపోయినా స్మిత్ అందరికంటే కీలకం అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా అతని నాయకత్వం కారణంగానే ఆసీస్ గత మ్యాచ్ గెలిచింది. ఈ సారి అతను టీమ్‌ను ఎలా నడపిస్తాడనేది ఆసక్తికరం.
ఆ ఇద్దరు అతిథులుగా...
భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆ్రస్టేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ కలిసి నాలుగో టెస్టు తొలి రోజు ఆటను మైదానంలో వీక్షించనున్నారు. ఇందుకోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొదటి సెషన్ సమయంలోనే వీరిద్దరు అక్కడ ఉంటారు. మరోవైపు ఈ మ్యాచ్ ప్రేక్షకుల హాజరులో కూడా కొత్త రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది.
ఒకరోజు ఆటకు హాజరైన ప్రేక్షకుల సంఖ్య 91,112 ప్రస్తుతం రికార్డుగా ఉంది (2013 మెల్‌బోర్న్‌లో యాషెస్ టెస్టు). అయితే ఇప్పటి వరకు టికెట్ల అమ్మకాలను బట్టి చూస్తే మోదీ స్టేడియంలో కొత్త రికార్డు నమోదు కావచ్చు.
పిచ్, వాతావరణం
గత మూడు టెస్టులతో పోలిస్తే ఇది బ్యాటింగ్‌కు కాస్త అనుకూలమైన పిచ్. స్పిన్ ప్రభావం ఉన్నా... మరీ మొదటి రోజునుంచే టర్న్ కాకపోవచ్చు. భారత్‌లో చాలా మైదానాల తరహాలో ఆట సాగుతున్నకొద్దీ నెమ్మదిస్తుంది. టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ చేసుకోవడం సురక్షితం.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, పుజారా, కోహ్లి, శ్రేయస్, జడేజా, శ్రీకర్ భరత్, అశ్విన్, అక్షర్ పటేల్, షమీ, ఉమేశ్ యాదవ్.
ఆ్రస్టేలియా: స్మిత్ (కెప్టెన్), హెడ్, ఖాజా, లబుషేన్, హ్యాండ్స్‌కాంబ్, గ్రీన్, క్యారీ, స్టార్క్, మర్ఫి, నాథన్ లయన్, కునెమన్.
Comments
Please login to add a commentAdd a comment