సెంచరీతో చెలరేగిన హనుమ విహారి | Hanuma Vihari Century But India Bundle Out For 263 Against New Zealand | Sakshi
Sakshi News home page

శతక విహారం

Published Sat, Feb 15 2020 4:56 AM | Last Updated on Sat, Feb 15 2020 5:05 AM

Hanuma Vihari Century But India Bundle Out For 263 Against New Zealand - Sakshi

హనుమ విహారి

0, 1, 0... న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఓపెనర్లుగా బరిలోకి దిగేందుకు అవకాశం ఉన్న ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో చేసిన స్కోర్లు ఇవి. నిజానికి కివీస్‌ ఎలెవన్‌తో ఈ మ్యాచ్‌ను ఓపెనర్ల సామర్థ్యానికి పరీక్షగా భావించగా... కాస్త పచ్చిక ఉన్న పిచ్‌పై ముగ్గురూ అందులో విఫలమయ్యారు. అసలు టీమిండియా తుది జట్టులో ఉంటాడా లేదా అనే సందేహమున్న మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ హనుమ విహారి మాత్రం సెంచరీతో సత్తా చాటాడు. విహారికి తోడుగా సీనియర్‌ పుజారా కూడా తన స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు మోస్తరు స్కోరు సాధించింది. కెప్టెన్‌ కోహ్లి మాత్రం బ్యాటింగ్‌కు దూరంగా ఉండిపోవడమే శుక్రవారం ఆటలో విశేషం.  

హామిల్టన్‌: పిచ్‌పై కాస్త బౌన్స్, మరికాస్త స్వింగ్‌ కలగలిస్తే భారత బ్యాట్స్‌మెన్‌ తడబడతారనేది గతంలో చాలా సార్లు రుజువైంది. అయితే కోహ్లి సారథ్యంలోని ప్రస్తుత జట్టు వాటికి అతీతమని, ఎక్కడైనా రాణించగలదని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు న్యూజిలాండ్‌ గడ్డపై మాత్రం పెను సవాల్‌ ఎదురు కానుందని ప్రాక్టీస్‌ మ్యాచ్‌లోనే తేలిపోయింది. కివీస్‌ ద్వితీయ శ్రేణి బౌలర్లను కూడా సమర్థంగా మన బ్యాట్స్‌మెన్‌ ఎదుర్కోలేకపోయారు. ఫలితంగా న్యూజిలాండ్‌ ఎలెవన్‌తో శుక్రవారం ప్రారంభమైన ప్రాక్టీస్‌ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 78.5 ఓవర్లలో 263 పరుగులకే ఆలౌటైంది. ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి (182 బంతుల్లో 101 రిటైర్డ్‌ అవుట్‌; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో అజేయంగా నిలిచాడు. పుజారా (211 బంతుల్లో 93; 11 ఫోర్లు, 1 సిక్స్‌) మాత్రం త్రుటిలో ఆ అవకాశం చేజార్చుకోగా... ఇతర బ్యాట్స్‌మెన్‌లో ఎవరూ కనీసం 20 పరుగులు కూడా దాటలేకపోయారు. విహారి, పుజారా ఐదో వికెట్‌కు 195 పరుగులు జోడించారు.

టపటపా...
టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. కుగ్‌లీన్‌ వేసిన తొలి ఓవర్లోనే అనూహ్యంగా పైకి లేచిన బంతిని ఆడలేక పృథ్వీ షా (0) షార్ట్‌లెగ్‌లో దొరికిపోయాడు. ఆ తర్వాత కుగ్‌లీన్‌ బౌలింగ్‌లోనే ఆఫ్‌స్టంప్‌పై దూసుకొచ్చిన బంతిని ఆడి మయాంక్‌ (1) కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. కివీస్‌ బౌలర్లు షార్ట్‌ పిచ్‌ బంతులతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారని, వాటిని జాగ్రత్తగా ఆడాలంటూ వ్యాఖ్యానించిన శుబ్‌మన్‌ గిల్‌ (0) ఈ ఇన్నింగ్స్‌లో షార్ట్‌ పిచ్‌ బంతినే ఆడలేక గల్లీలో క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అనుభవజ్ఞుడైన రహానే (18) కూడా నీషమ్‌ వేసిన స్వింగ్‌ బంతికి స్లిప్‌లో క్యాచ్‌ ఇవ్వడం ఆశ్చర్యపరచింది.  

భారీ భాగస్వామ్యం...
భారత్‌ స్కోరు 38/4గా నిలిచిన దశలో పుజారా, విహారి ఆదుకున్నారు. ప్రత్యర్థి బౌలర్లు షార్ట్‌ పిచ్‌ బంతులు వేసినా వాటిని సమర్థంగా ఎదుర్కొన్నారు. తాను ఆడిన తొలి 80 బంతుల్లో పుజారా ఒకే ఫోర్‌ కొట్టాడు. పిచ్‌ సాధారణంగా మారిపోయిన తర్వాత ఇద్దరూ చక్కటి షాట్లు ఆడారు. ముఖ్యంగా లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ రచిన్‌ రవీంద్ర బౌలింగ్‌లో విహారి కొట్టిన మూడు సిక్సర్లు హైలైట్‌గా నిలిచాయి. అర్ధసెంచరీ చేసేందుకు పుజారాకు 153 బంతులు, విహారికి 132 బంతులు పట్టాయి. అయితే ఆ తర్వాత సెంచరీ అందుకునేందుకు విహారి మరో 48 బంతులు మాత్రమే తీసుకోవడం విశేషం. మరో వైపు పుజారా మాత్రం సెంచరీకి చేరువలో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ కాగా... శతకం పూర్తి కాగానే విహారి రిటైర్డ్‌ అవుట్‌గా తప్పుకున్నాడు. ఆ తర్వాత తొలి రోజు మిగిలిన సమయంలో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసే ప్రయత్నంలో భారత బ్యాట్స్‌మన్‌ వెంటవెంటనే అవుటయ్యారు. 18 పరుగుల వ్యవధిలో చివరి నలుగురు బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ చేరారు.

స్కోరు వివరాలు  
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) రవీంద్ర (బి) కుగ్‌లీన్‌ 0; మయాంక్‌ (సి) క్లీవర్‌ (బి) కుగ్‌లీన్‌ 1; పుజారా (సి) క్లీవర్‌ (బి) గిబ్సన్‌ 93; గిల్‌ (సి) సీఫెర్ట్‌ (బి) కుగ్‌లీన్‌ 0; రహానే (సి) బ్రూస్‌ (బి) నీషమ్‌ 18; విహారి (రిటైర్డ్‌ అవుట్‌) 101; పంత్‌ (సి) కుగ్‌లీన్‌ (బి) సోధి 7; సాహా (సి) క్లీవర్‌ (బి) గిబ్సన్‌ 0; అశ్విన్‌ (ఎల్బీ) (బి) సోధి 0; ఉమేశ్‌ (నాటౌట్‌) 9; జడేజా (సి) అలెన్‌ (బి) సోధి 8; ఎక్స్‌ట్రాలు 26; మొత్తం (78.5 ఓవర్లలో ఆలౌట్‌) 263.  

వికెట్ల పతనం: 1–0; 2–5; 3–5; 4–38; 5–233; 6–245; 7–246; 8–246; 9–250; 10–263.

బౌలింగ్‌: కుగ్‌లీన్‌ 14–2–40–3; టిక్‌నర్‌ 15–3–37–0; మిషెల్‌ 7–1–15–0; నీషమ్‌ 13–3–29–1; గిబ్సన్‌ 10–1–26–2; సోధి 14.5–0–72–3; రవీంద్ర 5–1–30–0.   

ఓపెనింగ్‌ చేసేందుకు సిద్ధం!
హామిల్టన్‌: విహారి కెరీర్‌ 7 టెస్టు మ్యాచ్‌లే కావచ్చు. కానీ తనకు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఎప్పుడు అవకాశం ఇచ్చినా దానిని వృథా చేయలేదు. ఎక్కడైనా, ఏ స్థానంలోనైనా ఆడగలనని ఈ ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్‌ నిరూపించాడు. ఏడాది క్రితం మెల్‌బోర్న్‌ టెస్టులో అనూహ్యంగా అతడిని ఓపెనర్‌గా పంపారు. 8, 13 పరుగులే చేసినా... తొలి ఇన్నింగ్స్‌లో దాదాపు 80 నిమిషాల పట్టుదలగా క్రీజ్‌లో నిలిచి బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడం జట్టుకు పనికొచ్చింది. అతని ఈ ప్రదర్శనను కెప్టెన్‌ కోహ్లి స్వయంగా ప్రశంసించాడు. ఇప్పుడు అలాంటిదే మరో అవకాశం అతని కోసం ఎదురు చూస్తోంది. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ముగ్గురు ఓపెనర్లూ విఫలం కాగా, ఓపెనర్లకు ఉండే సమర్థవంతమైన టెక్నిక్‌తో విహారి సెంచరీ చేయడం అతనికి కొత్త అవకాశాన్ని సృష్టించింది.

దీనిపై స్పందించిన విహారి ఏ స్థానంలోనైనా ఆడేందుకు తాను సిద్ధమని ప్రకటించాడు. ‘ఒక ఆటగాడిగా ఏ స్థానంలోనైనా ఆడేందుకు నేను సన్నద్ధమయ్యాను. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఇప్పటి వరకు నాతో ఏమీ చెప్పలేదు. ఎవరూ మాట్లాడలేదు. అయితే గతంలో చెప్పినట్లు జట్టు అవసరాల దృష్ట్యా ఎక్కడైనా బ్యాటింగ్‌ చేసేందుకు నేను సిద్ధం. కొన్ని సార్లు జట్టు కూర్పు గురించి కూడా ఆలోచించాల్సి వస్తుంది. దాని వల్ల బాధ పడకూడదు. స్వదేశంలో ఆడినప్పుడు మన జట్టు ఐదుగురు బౌలర్లతో దిగుతుంది కాబట్టి ఒక బ్యాట్స్‌మన్‌ను తప్పించాల్సిందే. నాకు తుది జట్టులో చోటు దక్కకపోవడానికి అదే కారణమని భావిస్తున్నా’ అని శుక్రవారం మీడియా సమావేశంలో విహారి వ్యాఖ్యానించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement