
సాకర్ ప్రపంచ కప్.. చరిత్ర సృష్టించిన జర్మనీ
జర్మనీ చరిత్ర సృష్టించింది. లాటిన్ అమెరికాలో ప్రపంచ కప్ సాధించిన తొలి యూరప్ జట్టుగా ఘనత సాధించింది. ఉత్కంఠగా సాగిన సాకర్ ప్రపంచ కప్ 2014 ఫైనల్ సమరంలో జర్మనీ 1-0తో అర్జెంటీనాపై విజయం సాధించింది. మ్యాచ్ అదనపు సమయంలో మరియా గోయెట్జ్ ఏకైక గోల్ కొట్టి జర్మనీకి కప్ అందించాడు. జర్మనీ ప్రపంచ కప్ సాధించడమిది నాలుగోసారి కావడం విశేషం.
అర్జెంటీనా, జర్మనీ నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయి. నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. దీంతో ఫలితం కోసం మ్యాచ్ ను అదనపు సమయం నిర్వహించారు. ఆట తొలిసగం మాదిరే ద్వితీయార్ధంలోనూ ఇరు జట్లు గోల్ కోసం చెమటోడ్చినా ఫలితం లేకపోయింది.
మ్యాచ్ ఆరంభంలో జర్మనీ దూకుడుగా ఆడగా ఆనక అర్జెంటీనా దూకుడు పెంచింది. జర్మనీ గోల్ పోస్ట్పై దాడికి దిగారు. కాగా అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 30 వ నిమిషంలో అర్జెంటీనా గోల్ చేసినా ఆఫ్ సైడ్ కావడంతో రిఫరీ నిరాకరించాడు. జర్మనీ కూడా గోల్ చేసే అవకాశాల్ని చేజార్చుకుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసిన సాకర్ ఫైనల్ పోరు భారత కాలమాన ప్రకారం ఆదివారం అర్ధరాత్రి 12:30 గంటలకు బ్రెజిల్లోని రియోలో మొదలైంది.