
కాసేపట్లో సాకర్ మహా సంగ్రామం
కోట్లాది అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సాకర్ ప్రపంచ కప్ 2014 ఫైనల్ సమరం కాసేపట్లో ఆరంభంకానుంది. భారత కాలమాన ప్రకారం ఆదివారం అర్ధరాత్రి 12:30 గంటల నుంచి రియో (బ్రెజిల్)లో జరగనుంది. దక్షిణ అమెరికా జట్టు అర్జెంటీనా, యూరప్ జట్టు జర్మనీ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
అమెరికా గడ్డపై ప్రపంచ కప్ గెలిచిన తొలి యూరప్ జట్టుగా చరిత్ర సృష్టించాలనే లక్ష్యంతో జర్మనీ బరిలోకి దిగుతుండగా, చివరి మూడుసార్లు తమ ప్రపంచ కప్ ఆశలకు గండికొట్టిన జర్మనీని ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో అర్జెంటీనా పట్టుదలతో ఉంది. అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ జర్మనీ జోరు మీదుండగా.. అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్పీపై ఎక్కువగా ఆధారపడుతోంది.
విశేషాలు..
-
అర్జెంటీనా, జర్మనీ జట్ల మధ్య ఇది మూడో ప్రపంచకప్ ఫైనల్. ఇప్పటిదాకా ఏ రెండు జట్లు మూడుసార్లు ప్రపంచకప్ టైటిల్‌పోరులో తలపడలేదు.
-
1986 ఫైనల్లో అర్జెంటీనా 3-2తో జర్మనీని ఓడించగా... 1990 ఫైనల్లో జర్మనీ 1-0తో అర్జెంటీనాపై గెలిచింది.
-
1986 ప్రపంచకప్ ఫైనల్లో విజయం తర్వాత ఇప్పటిదాకా అర్జెంటీనా ప్రపంచకప్ మ్యాచ్‌లో జర్మనీని ఓడించలేదు. 2006 క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా ‘పెనాల్టీ షూటౌట్’లో 2-4తో; 2010 క్వార్టర్ ఫైనల్లో 0-4తో జర్మనీ చేతిలోనే ఓడిపోయి టోర్నీ నుంచి నిష్ర్కమించింది. వరుసగా మూడు ప్రపంచకప్‌లలో నాకౌట్ దశలో ఒకే జట్టు చేతిలో ఓ జట్టు ఓడిపోలేదు.
-
ఏ జట్టుకూ సాధ్యంకాని విధంగా జర్మనీ ఎనిమిదోసారి ప్రపంచకప్ ఫైనల్లో ఆడుతోంది.
-
ఈసారి జర్మనీ గెలిస్తే నాలుగుసార్లు విశ్వవిజేతగా నిలిచి ఇటలీ సరసన నిలుస్తుంది. బ్రెజిల్ అత్యధికంగా ఐదుసార్లు ప్రపంచకప్ సాధించింది.
-
అత్యధికంగా నాలుగుసార్లు ప్రపంచకప్ ఫైనల్లో ఓడిపోయిన జట్టుగా జర్మనీకి గుర్తింపు ఉంది. కానీ చివరి 17 మ్యాచ్‌ల్లో జర్మనీకి ఓటమి ఎదురుకాలేదు.
-
నాకౌట్ దశలో మూడు మ్యాచ్‌ల్లో అర్జెంటీనా నిర్ణీత సమయంలో ప్రత్యర్థికి గోల్ ఇవ్వలేదు.
-
చివరి మూడు మ్యాచ్‌ల్లో మెస్సీ ఒక్క గోల్ (షూటౌట్ మినహాయింపు) కూడా చేయలేదు. 2011లో అలెజాంద్రో సాబెల్లా కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మెస్సీ ఇప్పటివరకు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గోల్ చేయకుండా ఉండటం జరుగలేదు.
- అర్జెంటీనా జట్టు సగటు వయసు 29. ఒకవేళ అర్జెంటీనా గెలిస్తే పెద్ద వయస్సు హోదాలో టైటిల్ నెగ్గిన జట్టుగా రికార్డు నెలకొల్పిన ఇటలీ (2006లో) స్థానాన్ని ఆక్రమిస్తుంది.