
క్రైస్ట్‌చర్చ్: టెయిలెండర్ల అసాధారణ పోరాటంతో ఇంగ్లండ్‌తో జరిగిన చివరిదైన రెండో టెస్టును న్యూజిలాండ్ ‘డ్రా’ చేసుకుంది. చుట్టూ ఎనిమిది మంది ఫీల్డర్లను మోహరించినా ఐష్ సోధీ (168 బంతుల్లో 56 నాటౌట్; 9 ఫోర్లు), వాగ్నర్ (103 బంతుల్లో 7) తుదికంటా పోరాడటంతో కివీస్ 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసి ‘డ్రా’తో గట్టెక్కింది. దీంతో తొలి టెస్టులో విజయం సాధించిన న్యూజిలాండ్ 1–0తో సిరీస్ చేజిక్కించుకుంది. స్వదేశంలో ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ టెస్టు సిరీస్ నెగ్గడం 34 ఏళ్ల (1984) తర్వాత ఇదే తొలిసారి.
మరోవైపు 1999 తర్వాత ఇంగ్లండ్‌పై ఓ టెస్టు సిరీస్ నెగ్గడం కివీస్‌కిదే ప్రథమం. ఓవర్‌నైట్ స్కోరు 42/0తో మంగళవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కివీస్ ఒకదశలో 162/6తో కష్టాల్లో పడింది. ఈ దశలో గ్రాండ్‌హోమ్ (45; 6 ఫోర్లు), సోధీ ఆదుకున్నారు. అనంతరం గ్రాండ్‌హోమ్ వెనుదిరిగినా వాగ్నర్‌తో కలిసి సోధీ మొండిగా పోరాడాడు. ఈ జోడీ ఎనిమిదో వికెట్‌కు 188 బంతులు ఎదుర్కొని 37 పరుగులు చేయడంతో ‘డ్రా’ ఖాయమైంది.