బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌లో కరోనా తగ్గుముఖం పట్టడంతో వివిధ బహిరంగ కార్యక్రమాల్లో నెమ్మదిగా సాధారణ స్థితి చోటు చేసుకుంటోంది. ఇలాంటి సమయంలో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడే అవకాశం ఉన్న చోట ఎలాంటి కరోనా ఆంక్షలు పెట్టకుండా ఎక్కువ మందిని అనుమతిస్తే ఎలా ఉంటుంది? అసలు కరోనా తీవ్రత ఏమిటో, తాజా స్థితి ఏమిటో తెలిసిపోతుంది కదా! బ్రిటన్ ప్రభుత్వం ఇదే ఆలోచనతో కొన్ని పైలట్ కార్యక్రమాలు తీసుకొని అమలు చేస్తోంది.
ఇందులో భాగంగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జూన్ 10 నుంచి జరిగే రెండో టెస్టులో స్టేడియం సామర్థ్యం లో 70 శాతాన్ని అనుమతించాలని నిర్ణయించింది. దీని ప్రకారం ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరిగే ఈ టెస్టుకు ప్రతీరోజు కనీసం 18 వేల మంది వరకు హాజరు కావచ్చు. మ్యాచ్‌కు వచ్చే వారంతా 16 ఏళ్లకంటే ఎక్కువ వారై ఉండి, కరోనా నెగెటివ్ రిపోర్టు ఉంటే చాలు. మ్యాచ్ జరిగే సమయంలో మాస్క్‌లు వేసుకోవడం మినహా మరే ఇతర ఆంక్షలు ఉండవు.
2020 సీజన్ మొత్తం ప్రేక్షకులు లేకుండానే ఆడిన ఇంగ్లండ్ క్రికెటర్లకు కూడా ఇది కొత్త ఉత్సాహం ఇస్తుందనడంలో సందేహం లేదు. అయితే ఏర్పాట్లకు తగినంత సమయం లేకపోవడంతో లార్డ్స్‌లో జరిగే తొలి టెస్టులో మాత్రం ఇప్పటికే అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం 25 శాతం మందినే అనుమతిస్తారు. గత కొద్ది రోజుల్లో బ్రిటన్ ప్రభుత్వం ఎఫ్‌ఏ కప్ ఫైనల్ (20 వేలు), స్నూకర్ ఫైనల్ (ఇండోర్‌లో వేయి మంది), కొన్ని మ్యూజిక్ కన్‌సర్ట్‌లు కలిపి మొత్తం 58 వేల మంది వరకు అనుమతించగా... చివరకు 15 మంది మాత్రమే ఇందులో కోవిడ్–19 పాజిటివ్‌గా తేలారు.
Comments
Please login to add a commentAdd a comment