ట్రోఫీని ఆవిష్కరిస్తున్న సోమ్‌దేవ్, పెయిర్
చెన్నై: భారత్‌లో జరిగే ఏకైక ఏటీపీ టోర్నమెంట్ చెన్నై ఓపెన్‌లో ఆంధ్రప్రదేశ్ యువతార సాకేత్ మైనేని క్వాలిఫయింగ్ తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. శనివారం జరిగిన పురుషుల క్వాలిఫయింగ్ సింగిల్స్ మొదటి రౌండ్‌లో సాకేత్ 3-6, 4-6తో ఫిలిప్ ఓస్వాల్డ్ (ఆస్ట్రియా) చేతిలో ఓటమి పాలయ్యాడు. 67 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ రెండు ఏస్‌లు సంధించి ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. మూడుసార్లు తన ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి తన సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయాడు. డబుల్స్‌లో మాత్రం సాకేత్-కరెన్ ఖచనోవ్ (రష్యా) జోడికి ‘వైల్డ్ కార్డు’ ద్వారా నేరుగా మెయిన్ ‘డ్రా’లో చోటు లభించింది.
యూకీ ప్రత్యర్థి కరెనో
సోమవారం మొదలయ్యే మెయిన్ ‘డ్రా’లో భారత్‌కు చెందిన సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, యూకీ బాంబ్రీ, జీవన్ నెదున్‌చెజియాన్ ఉన్నారు. తొలి రౌండ్‌లో ప్రపంచ 64వ ర్యాంకర్ పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్)తో యూకీ; క్వాలిఫయర్‌తో సోమ్‌దేవ్; ప్రపంచ 84వ ర్యాంకర్ జిరీ వాసిలీ (చెక్ రిపబ్లిక్)తో జీవన్ పోటీపడతారు. టాప్ సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్), రెండో సీడ్ యూజ్నీ (రష్యా), మూడో సీడ్ ఫాబియో ఫాగ్‌నిని (ఇటలీ), బెనోయిట్ పెయిర్ (ఫ్రాన్స్)లకు తొలి రౌండ్‌లో ‘బై’ లభించింది. డబుల్స్‌లో రోహన్ బోపన్న (భారత్)-ఐజామ్ ఖురేషీ (పాకిస్థాన్) జోడికి టాప్ సీడింగ్ లభించగా... లియాండర్ పేస్ (భారత్)-ఫాబియో ఫాగ్‌నిని (ఇటలీ) జంటకు రెండో సీడింగ్ కేటాయించారు.