ATP tournment
-
Tata Open Maharashtra: రామ్‌కుమార్ శుభారంభం
టాటా ఓపెన్ మహారాష్ట్ర ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో భారత ప్లేయర్లు యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్ రామనాథన్‌లు మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందడానికి విజయం దూరంలో నిలిచారు. పుణేలో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో యూకీ 6–2, 6–2తో డీగో హిడాల్గో (ఈక్వెడార్)పై గెలుపొందగా... రామ్‌కుమార్ 2–6, 7–5, 6–2తో ప్రపంచ 175వ ర్యాంకర్ ఒటో విర్టానెన్ (ఫిన్లాండ్)పై సంచలన విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నారు. -
ఏటీపీ కప్ విజేత సెర్బియా
సిడ్నీ: తొలి ఏటీపీ కప్ టీమ్ టెన్నిస్ టోర్నమెంట్ విజేతగా సెర్బియా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో నొవాక్ జొకోవిచ్ సారథ్యంలోని సెర్బియా 2–1తో రాఫెల్ నాదల్ నాయకత్వంలోని స్పెయిన్‌పై గెలుపొందింది. రెండో సింగిల్స్, డబుల్స్ మ్యాచ్‌లో బరిలో దిగిన జొకోవిచ్ రెండు మ్యాచ్‌లనూ గెలిచి జట్టుకు ఒంటి చేత్తో కప్‌ను అందించాడు. తొలి సింగిల్స్ మ్యాచ్‌లో బాటిస్టా అగుట్ (స్పెయిన్) 7–5, 6–1తో డుసాన్ లజోవిచ్ (సెర్బియా)పై గెలుపొంది స్పెయిన్‌కు 1–0 ఆధిక్యాన్నిచ్చాడు. నిలవాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో రెండో సింగిల్స్ మ్యాచ్ బరిలో దిగిన జొకోవిచ్ 6–2, 7–6 (7/4)తో ప్రపంచ నంబర్‌వన్ నాదల్‌పై నెగ్గడంతో స్కోరు 1–1తో సమమైంది. తొలి సెట్లో జోకర్ బలమైన సరీ్వస్‌లకు నాదల్ దగ్గర సమాధానమే లేకపోయింది. కానీ రెండో సెట్లో మాత్రం నాదల్ కాస్త ప్రతిఘటించాడు. దీంతో సెట్ టై బ్రేక్‌కు వెళ్లింది. అక్కడ మరోసారి విజృంభించిన జొకోవిచ్ టై బ్రేక్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకున్నాడు. 2013 నుంచి హార్డ్ కోర్టులపై నాదల్‌తో జరిగిన ప్రతీ మ్యాచ్‌లోనూ జొకోవిచ్ గెలవడం విశేషం. ఇక కప్ విజేతను నిర్ణయించే డబుల్స్ పోరులో జొకోవిచ్–విక్టర్ ట్రయెస్కీ ద్వయం 6–3, 6–4తో లోపెజ్–కరెనో బుస్టా జోడీ (స్పెయిన్)పై గెలిచింది. దాంతో ఏటీపీ కప్ సెర్బియా సొంతం అయింది. ఈ టోర్నీలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన జొకోవిచ్, బాటిస్టా అగుట్ ఖాతాలో 750 ఏటీపీ పాయింట్లు చేరాయి. -
సాకేత్ జోడి పరాజయం
చెన్నై: భారత్‌లో జరిగే ఏకైక ఏటీపీ టోర్నమెంట్ చెన్నై ఓపెన్‌లో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. డబుల్స్‌లో ఆంధ్రప్రదేశ్ యువతార సాకేత్ మైనేని జోడి సెమీఫైనల్లో... రామ్‌కుమార్-శ్రీరామ్ బాలాజీ (భారత్) జంట క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలయ్యాయి. సింగిల్స్‌లో యూకీ బాంబ్రీ క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించాడు. శుక్రవారం రాత్రి జరిగిన పురుషుల డబుల్స్ తొలి సెమీఫైనల్లో ‘వైల్డ్ కార్డు’ జోడి సాకేత్-కరెన్ ఖచనోవ్ (రష్యా) 4-6, 3-6తో నాలుగో సీడ్ బ్రన్స్ట్రోమ్ (స్వీడన్)-ఫ్రెడెరిక్ నీల్సన్ (డెన్మార్క్) జంట చేతిలో పరాజయం పాలైంది. గురువారం ఆలస్యంగా ముగిసిన క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ రోహన్ బోపన్న (భారత్)-ఐజామ్ ఖురేషీ (పాకిస్థాన్) జోడిని 7-5, 2-6, 12-10తో బోల్తా కొట్టించిన సాకేత్-ఖచనోవ్ సెమీఫైనల్లో అదే జోరును కనబర్చలేకపోయారు. అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో రామ్‌కుమార్-శ్రీరామ్ బాలాజీ జంట 3-6, 3-6తో ద్రగంజా-మేట్ పావిక్ (క్రొయేషియా) ద్వయం చేతిలో ఓడింది. వావ్రింకా 300వ విజయం పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ యూకీ బాంబ్రీ 3-6, 3-6తో ప్రపంచ 32వ ర్యాంకర్ పోస్పిసిల్ (కెనడా) చేతిలో ఓడాడు. 69 నిమిషాలు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీకి ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశం రాలేదు. మరో క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6-2, 6-1తో బెదెన్ (స్లొవేకియా)ను ఓడించి సెమీఫైనల్‌కు చేరుకోవడంతోపాటు కెరీర్లో 300వ విజయాన్ని నమోదు చేశాడు. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో వాసెలిన్ (ఫ్రాన్స్) 7-5, 6-7 (6/8), 6-0తో సెలా (ఇజ్రాయెల్)పై, గ్రానోలెర్స్ (స్పెయిన్) 6-2, 3-6, 7-6 (7/5)తో పెయిర్ (ఫ్రాన్స్)పై నెగ్గి సెమీస్‌కు చేరారు. -
సాకేత్ పరాజయం
చెన్నై: భారత్‌లో జరిగే ఏకైక ఏటీపీ టోర్నమెంట్ చెన్నై ఓపెన్‌లో ఆంధ్రప్రదేశ్ యువతార సాకేత్ మైనేని క్వాలిఫయింగ్ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. శనివారం జరిగిన పురుషుల క్వాలిఫయింగ్ సింగిల్స్ మొదటి రౌండ్లో సాకేత్ 3-6, 4-6తో ఫిలిప్ ఓస్వాల్డ్ (ఆస్ట్రియా) చేతిలో ఓటమి పాలయ్యాడు. 67 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ రెండు ఏస్‌లు సంధించి ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. మూడుసార్లు తన ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి తన సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయాడు. డబుల్స్‌లో మాత్రం సాకేత్-కరెన్ ఖచనోవ్ (రష్యా) జోడికి ‘వైల్డ్ కార్డు’ ద్వారా నేరుగా మెయిన్ ‘డ్రా’లో చోటు లభించింది. యూకీ ప్రత్యర్థి కరెనో సోమవారం మొదలయ్యే మెయిన్ ‘డ్రా’లో భారత్‌కు చెందిన సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, యూకీ బాంబ్రీ, జీవన్ నెదున్‌చెజియాన్ ఉన్నారు. తొలి రౌండ్లో ప్రపంచ 64వ ర్యాంకర్ పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్)తో యూకీ; క్వాలిఫయర్‌తో సోమ్‌దేవ్; ప్రపంచ 84వ ర్యాంకర్ జిరీ వాసిలీ (చెక్ రిపబ్లిక్)తో జీవన్ పోటీపడతారు. టాప్ సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్), రెండో సీడ్ యూజ్నీ (రష్యా), మూడో సీడ్ ఫాబియో ఫాగ్నిని (ఇటలీ), బెనోయిట్ పెయిర్ (ఫ్రాన్స్)లకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. డబుల్స్‌లో రోహన్ బోపన్న (భారత్)-ఐజామ్ ఖురేషీ (పాకిస్థాన్) జోడికి టాప్ సీడింగ్ లభించగా... లియాండర్ పేస్ (భారత్)-ఫాబియో ఫాగ్నిని (ఇటలీ) జంటకు రెండో సీడింగ్ కేటాయించారు. -
పేస్ జోడి శుభారంభం
లండన్: వరల్డ్ టూర్ ఫైనల్స్ ఏటీపీ టోర్నమెంట్లో భారత వెటరన్ స్టార్ లియాండర్ పేస్ జోడి శుభారంభం చేసింది. గ్రూప్-బిలో జరిగిన తొలి రౌండ్ పోరులో ఏడో సీడ్ పేస్-స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) జంట రెండో సీడ్ అలెగ్జాండర్ పెయా (ఆస్ట్రియా)- బ్రూనో సోరెస్ (బ్రెజిల్) జోడికి షాకిచ్చింది. హోరాహోరీగా జరిగిన ఈ సమరంలో భారత్-చెక్ ద్వయం 6-3, 5-7, 10-8తో పెయా-బ్రూనో జోడిని కంగుతినిపించింది. గంటా 42 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో పేస్ జోడి నాలుగు బ్రేక్ పాయింట్లు సాధించింది. క్వార్టర్స్‌లో దివిజ్-పురవ్ ఇటలీలో జరుగుతున్న ఒర్టిసెయి ఏటీపీ టెన్నిస్ చాలెంజర్ టోర్నీలో భారత యువ జోడి దివిజ్ శరణ్-పురవ్ రాజా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన తొలిరౌండ్ పోరులో టాప్‌సీడ్ దివిజ్-పురవ్ జంట 6-1, 6-3తో డేవిడ్ కోస్ట్నెర్-ప్యాట్రిక్ ప్రినోత్ (ఇటలీ) జోడిపై అలవోక విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో మార్టిన్ ఫిస్చెర్ (ఆస్ట్రియా)-పీటర్ గోజోజిక్ (జర్మనీ) ద్వయంతో భారత జంట తలపడుతుంది.