
లక్నో: దేశవాళీ ఫస్ట్‌క్లాస్ టోర్నీ రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర అద్భుతం చేసింది. ఉత్తరప్రదేశ్‌తో ఇక్కడ జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఏకంగా 372 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి సెమీఫైనల్ చేరింది. తద్వారా 2008–09 సీజన్‌లో సర్వీసెస్‌పై అసోం నెలకొల్పిన అత్యధిక పరుగుల ఛేదన రికార్డు (371 పరుగులు)ను బద్దలు కొట్టింది. బ్యాటింగ్ వైఫల్యంతో తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులు వెనుకబడినా... రెండో ఇన్నింగ్స్‌లో తేరుకుని సెమీస్ గడపతొక్కింది. లక్ష్యాన్ని అందుకునే క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 195/2తో శనివారం చివరి రోజు ఆట కొనసాగించిన సౌరాష్ట్రను ఓపెనర్ హార్విక్ దేశాయ్ (259 బంతుల్లో 116; 16 ఫోర్లు) కెరీర్‌లో తొలి శతకంతో ముందుకు నడిపించాడు. అయితే, అతడితో పాటు మక్వానా (7) వెంటవెంటనే ఔటయ్యారు. ఈ దశలో టీమిండియా బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా (110 బంతుల్లో 67 నాటౌట్; 9 ఫోర్లు), షెల్డన్ జాక్సన్ (109 బంతుల్లో 73 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) సంయమనం చూపారు. రెండుసార్లు ఔటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్న వీరు ఐదో వికెట్‌కు అజేయంగా 136 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. దీంతో ఆరు వికెట్ల తేడాతో సౌరాష్ట్ర విజయం సాధించింది. కనీసం ‘డ్రా’ చేసుకున్నా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ద్వారా సెమీస్ చేరే అవకాశాన్ని కోల్పోయిన ఉత్తరప్రదేశ్ ఉసూరుమంటూ వెనుదిరిగింది.
విదర్భ మరోసారి...
సొంతగడ్డ నాగ్‌పూర్‌లో ముగిసిన మరో క్వార్టర్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ విదర్భ ఇన్నింగ్స్ 115 పరుగులతో ఉత్తరాఖండ్‌పై గెలుపొంది సెమీస్ చేరింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (274 పరుగులు)తో విదర్భ సెమీస్ బెర్త్ ముందే ఖాయమైంది. నామమాత్రమైన రెండో ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్ స్కోరు 152/5తో శనివారం ఆట కొనసాగించిన ఉత్తరాఖండ్... టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ (5/23), ఎడంచేతి వాటం స్పిన్నర్ ఆదిత్య సర్వాతె (5/55) ధాటికి ఏడు పరుగులకే మిగతా ఐదు వికెట్లూ కోల్పోయి 159 పరుగులకే ఆలౌటైంది. ఈనెల 24న మొదలయ్యే సెమీఫైనల్స్‌లో కేరళతో విదర్భ; కర్ణాటకతో సౌరాష్ట్ర తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment