
ముంబయి: దాయాది పాకిస్థాన్‌తో ఆ దేశంలో జరిగిన 2005–06 ద్వై పాక్షిక సిరీస్ సందర్భంగా అప్పటి పాక్ అధ్యక్షుడు ముషార్రఫ్‌కు తనకు మధ్య జరిగిన ఓ సరదా సంభాషణను భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘నాకు ఇప్పటికీ గుర్తుంది. 2006లో పాకిస్థాన్ టూర్ సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓ మ్యాచ్ తర్వాత ‘అతడిని ఎక్కడి నుంచి తీసుకువచ్చార’ని ధోనీ గురించి ముషారఫ్ అడిగాడు. దీంతో వాఘా సరిహద్దుల్లో నడిచి వెళ్తోన్న అతడిని మేం తెచ్చేసుకున్నాం’ అని తను సరదాగా సమాధాన మిచ్చినట్లు దాదా వెల్లడించారు.
అలాగే ధోనీ ప్రస్తుత ఫామ్ గురించి మాట్లాడుతూ ‘ధోనీ ఒక ఛాంపియన్. టీ20 ప్రపంచ కప్ గెలిచిన దగ్గరి నుంచి అతడి కెరీర్ అద్భుతంగా సాగింది. అయితే ఒకటి గుర్తు పెట్టుకోవాలి. మనం ఏం చేస్తున్నాం. ఎక్కడున్నాం. ఎంత వయసు, అనుభవం ఉంది.. అనేదాని కంటే మన ప్రదర్శనే కీలకం. లేకపోతే మన స్థానాన్ని ఇంకొకరు భర్తీ చేస్తారు’ అని గంగూలీ అన్నారు. అయితే 2019 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత బృందంలో ధోనీ పేరు ఉంటుందా అని ప్రశ్నించగా.. ‘నేను సెలెక్టర్‌ను కాను. కానీ ఇప్పుడున్న బృందంలో 85–90 శాతం ప్రపంచ కప్‌లో ఆడే అవకాశం ఉంది’ అభిప్రాయపడ్డాడు.