దక్షిణాఫ్రికా-భారత్ ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు డ్రా దిశగా పయనిస్తోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 68 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. చివరి రోజు ఆటలో అద్భుతం జరిగితే తప్ప ఫలితం వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.ప్రస్తుతం చటేశ్వరా పూజారా(32), కోహ్లి(11) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
299/5 ఓవర్నైట్ స్కోరుతో మ్యాచ్ నాలుగో రోజు ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన సఫారీలు 500 పరుగులకు ఆలౌటయ్యారు. తొలి ఇన్నింగ్స్లో 166 పరుగుల ఆధిక్యం సాధించారు. వీడ్కోలు టెస్టు ఆడుతున్న జాక్వెస్ కలిస్ టెస్టు కెరీర్లో 45వ సెంచరీ నమోదు చేశాడు. భారత్తో రెండో టెస్టులో దిగ్గజ ఆల్రౌండర్ కలిస్ (115) సెంచరీతో కదంతొక్కడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు సాధించింది.
ఓవర్నైట్ బ్యాట్స్మెన్ కలిస్, స్టెయిన్ బాధ్యాతాయుత బ్యాటింగ్తో సౌతాఫ్రికాకు ఆధిక్యం అందించారు. కాగా తొలి సెషన్ చివర్లో వీరిద్దరూ అవుటయ్యారు. కలిస్ను జడేజా, స్టెయిన్ (44)ను జహీర్ పెవిలియన్ చేర్చారు. అనంతరం రాబిన్ పీటర్సన్ (52 బంతుల్లో 61) మెరుపు హాఫ్ సెంచరీ చేయగా, డుప్లెసిస్ (43) రాణించాడు. వీరిద్దరూ స్కోరును 500 మార్క్కు చేర్చారు. ఈ జోడీతో పాటు మోర్కెల్ వెంటవెంటనే అవుటవడంతో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. జడేజా ఆరు వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ కడపటి సమాచారం అందేసరికి వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 334 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.