విశాఖ: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా పరుగుల మోత మోగించింది. మయాంక్ అగర్వాల్(215) డబుల్ సెంచరీకి తోడు రోహిత్ శర్మ(176) భారీ సెంచరీ జత కావడంతో భారత్ జట్టు 502/7 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. అయితే గురువారం రెండో రోజు ఆటలో ఫన్నీ సన్నివేశం చోటు చేసుకుంది. భారత్ ఇన్నింగ్స్‌లో భాగంగా 129 ఓవర్‌లో వికెట్ కీపర్ క్వింటాన్ డీకాక్ బంతిని అందుకోవడంలో విఫలం కావడంతో అది బౌండరీకి వెళ్లింది. అయితే బంతి ఎక్కడుందో దాన్ని అనుసరించిన ఫీల్డర్ ఫిలిండర్‌కు కనబడలేదు.
బౌండరీ రోప్ వెనకాల ఉన్న కవర్లు ఎత్తి చూసినా అది తారసపడలేదు. ఆ క్రమంలోనే సఫారీ రిజర్వ్ ఆటగాళ్లు వచ్చి వెతికినా ఆ బంతి జాడ మాత్రం కనిపెట్టలేకపోయారు. కాసేపు అభిమానులు కూడా బంతిని పట్టుకోవడంలో విఫలమయ్యారు. కాకపోతే టీవీ కెమెరాలు బంతిని ఎక్కడుందనే విషయాన్ని జూమ్ చేయడంతో వీక్షకులకు అది కనిపించింది. అయితే ఫిలిండర్‌తో పాటు రిజర్వ్ ఆటగాళ్లు బౌండరీ రోప్‌ను దాటి వెతకడాన్ని మాత్రం ఆపలేదు. ఈ క్రమంలోనే ఆ టీవీ ఫుటేజ్‌ని చూసిన దక్షిణాఫ్రికా ఆటగాడు మార్కరమ్ బంతి జాడను కనిపెట్టేశాడు. దాంతో బంతి దగ్గరకు వెళ్లి దాన్ని బయటకు తీశాడు. దాంతో ఫిలిండర్‌తో పాటు మిగతా ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. మరి మార్కరమ్ అయతే బంతి జాడను కనిపెట్టేశాను చూశారా అనేంతగా నవ్వుతూ ఫోజిచ్చాడు. ఇంతకీ బంతి ఎక్కడుందో తెలుసా.. బౌండరీ లైన్ వద్ద రెండు అడ్వర్‌టైజ్‌మెంట్ కుషన్స్ మధ్య ఇరుక్కుపోయింది. ఇలా కాసేపు బంతి దోబుచులాట మాత్రం అభిమానుల్లో సరదా వాతావరణాన్ని తీసుకొచ్చింది.(ఇక్కడ చదవండి: ఐదు వందలు... మూడు వికెట్లు...)
Comments
Please login to add a commentAdd a comment