
మెరుపు వీరులున్నా... ముందడుగేది!
నాకౌట్ చాంప్స్ దక్షిణాఫ్రికా, కివీస్ మళ్లీ గెలిచేనా?
దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్... పటిష్టమైన జట్లే. ప్రపంచాన్ని గెలిచే జట్లే... కానీ ప్రపంచ కప్‌లను గెలవలేకపోయాయి! ఇరు జట్ల ఆటగాళ్లు వ్యక్తిగతంగా ఘనమైన రికార్డులతో క్రికెట్ పుటలకెక్కారు. సమష్టిగా ముక్కోణపు సిరీస్, ముఖాముఖీ సిరీస్‌లలో లెక్కలేనన్ని టైటిల్స్ సాధించారు. అయితే చాంపియన్స్ ట్రోఫీ టోర్నీతో ఈ రెండు జట్లు ‘ఐసీసీ ట్రోఫీ’ ముచ్చట తీర్చుకున్నాయి. సుమారు 15 ఏళ్ల క్రిందటే విజేతగా మురిసినా... ఆ తర్వాత ఈ రెండు జట్ల ఖాతాలో మరో ఐసీసీ ట్రోఫీ చేరలేదు. మరో ముందడుగేదీ ఇరు జట్లలో కనిపించలేదు. –సాక్షి క్రీడావిభాగం
ఆల్‌రౌండ్ నైపుణ్యానికి కొదవేలేని ఈ జట్లు ఎందుకనో అటు వన్డే, ఇటు టి20 ప్రపంచకప్‌ల్లో ఇప్పటిదాకా విజేతగా నిలవలేకపోయాయి. విజేతగా నిలిపే అర్హతలన్నీ ఆటగాళ్ల చేతల్లో ఉన్నాయి. కడదాకా పోరాడే సామర్థ్యమూ ఉంది. కానీ ప్రపంచకప్ అందలమెక్కే అదృష్టమే జట్టు నొసటన లేనట్లుంది. అందుకే ప్రపంచకప్ విజయం వారి క్రికెట్ చరిత్రల్లో లేకపోయినా... ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీల్లో మాత్రం భళా అనిపించాయి. ఈ మినీ ప్రపంచకప్‌ను నాకౌట్ రూపంలో ప్రవేశపెట్టిన తొలినాళ్లలోనే ఈ రెండు జట్లూ టైటిల్స్ సాధించాయి. 1998 తొలి టోర్నీ దక్షిణాఫ్రికాదైతే... ఆ మరుసటి టోర్నీ (2000) న్యూజిలాండ్ వశమైంది. తదనంతరం ఐదు టోర్నీలు జరిగినా... టైటిల్ వేటలో ఈ రెండు జట్లు మరోసారి సఫలం కాలేకపోయాయి. ఇప్పుడు మాత్రం ఇరు జట్లు గర్జించే శక్తి సామర్థ్యాలతో ఉన్నాయి. బ్యాటింగ్‌లో ప్రత్యర్థి బౌలింగ్‌ను చీల్చి చెండాడే హిట్టర్లు... బౌలింగ్‌లో నిప్పులు చెరిగే బౌలర్లు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండో సారి టైటిల్ గెలిచేందుకు రెండు జట్లు సమరానికి సై అంటున్నాయి.
ఆల్‌రౌండ్ సఫారీ...
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మొదట 1998లో ‘విల్స్ ఇంటర్నేషనల్ కప్’గా జరిగింది. నాకౌట్ ఫార్మాట్‌లో బంగ్లాదేశ్‌లో నిర్వహించిన ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా విజేతగా నిలిచింది. హాన్సీ క్రానే సారథ్యంలో సఫారీ జట్టు సాధించిన అమోఘ విజయమది. క్వార్టర్స్‌లో ఇంగ్లండ్‌ను, సెమీస్‌లో శ్రీలంకను కంగుతినిపించిన క్రానే సేన... అంతిమ సమరంలో జోరుమీదున్న వెస్టిండీస్‌ను ఓడించి ఐసీసీ ట్రోఫీని సగర్వంగా అందుకుంది. ఈ టోర్నీ మొత్తంమీద సఫారీ జట్టు ఏ ఒక్కరి మీదో ఆధారపడి గెలవలేదు. సారథి క్రానే, ఆల్‌రౌండర్ కలిస్, జాంటీ రోడ్స్ ఓపెనర్లు కలినాన్, రిండెల్ ఇలా అందరి పోరాటంతో కప్ గెలిచింది.
ఇక ఇప్పటి జట్టు కూడా ఇంచుమించు అలాంటి ఆల్‌రౌండ్ సమతూకంతోనే ఉంది. డివిలియర్స్ నేతృత్వంలో దక్షిణాఫ్రికా అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. ఓపెనింగ్‌లో హషీమ్ ఆమ్లా టాపార్డర్‌లో డికాక్, డుమిని, డుప్లెసిస్, మిడిలార్డర్‌లో డేవిడ్ మిల్లర్, ఆల్‌రౌండర్లు బెహర్డీన్, క్రిస్ మోరిస్ జట్టుకు భారీస్కోర్లు సాధించిపెట్టే సమర్థులు. ఇక బౌలింగ్‌లో రబడ పేస్‌కు, ఇమ్రాన్ తాహిర్ స్పిన్‌కు తిరుగే లేదు. పార్నెల్, ప్రిటోరియస్‌లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను వణికించగలరు.
ఎవరు కీలకమంటే...
బ్యాటింగ్ బలం: ఆమ్లా, డివిలియర్స్, డుప్లెసిస్
బౌలింగ్ దళం: రబడ, తాహిర్, పార్నెల్
అంచనా: ఆల్‌రౌండ్ షోతో సెమీస్ చేరొచ్చు.
బంగ్లాదేశ్‌లో జరిగిన ఆరంభ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌తోనే సరిపెట్టుకుంది న్యూజిలాండ్. ఆ తర్వాత 2000లో కెన్యాలో జరిగిన నాకౌట్ టోర్నీలో ఐసీసీ ట్రోఫీ సాధించింది. అది కూడా జోరు మీదున్న భారత్‌ను ఫైనల్లో బోల్తా కొట్టించి మరీ చాంపియన్‌గా నిలవడం విశేషం. క్వార్టర్స్‌లో ఆసీస్‌ను, సెమీస్‌లో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత్... కివీస్‌తో టైటిల్ పోరుకు సిద్ధమైంది. అప్పటికే మేటి జట్లను ఓడించిన భారత్‌దే టైటిల్ అని విశ్లేషకులు భావించగా... అంచనాలను తారుమారు చేస్తూ క్రిస్ కెయిన్స్ సూపర్ సెంచరీతో కివీస్ టైటిల్ గెలిచింది.
ట్రోఫీ గెలిచిన అప్పటి జట్టుతో పోల్చితే ప్రస్తుత జట్టే పటిష్టంగా ఉంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ సహా, బ్రూమ్, గప్టిల్, లాథమ్, రాస్ టేలర్ ఇలా బ్యాటింగ్ ఆర్డర్‌లో ఏడో వరుస వరకు బ్యాట్లు ఝుళిపించేవారే. ఆల్‌రౌండర్లు గ్రాండ్‌హోమ్, కొరే అండర్సన్‌లతో పాటు బౌలర్లు మిల్నే, మెక్లీనగన్, సాన్‌ట్నర్‌లు ఇటీవలి కాలంలో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. బుధవారం ఐర్లాండ్‌లో ముగిసిన ముక్కోణపు సిరీస్‌లో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది.
ఎవరు కీలకమంటే... బ్యాటింగ్ బలం: విలియమ్సన్, గ్రాండ్‌హోమ్, టేలర్. బౌలింగ్ దళం: మెక్లీనగన్, మిల్నే, సాన్‌ట్నర్
అంచనా: అంతా సజావుగా సాగితే సెమీస్ చేరొచ్చు.