తొలి వన్డే దక్షిణాఫ్రికాదే
షార్జా: లక్ష్యం 184 పరుగులు... ఓ దశలో పాక్ స్కోరు 165/4... గెలవడానికి మరో 19 పరుగులు అవసరం... చేతిలో దాదాపు 9 ఓవర్లు ఉన్నాయి. ఇంకేముంది అందరూ మిస్బాసేన విజయం ఖాయమనుకున్నారు. అయితే ఇక్కడే సీన్ రివర్స్ అయ్యింది. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి పాక్ బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. 17 పరుగుల తేడాతో చివరి ఆరు వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. దీంతో బుధవారం షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా ఒక్క పరుగు తేడాతో పాక్‌పై విజయం సాధించింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు 49.5 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. పార్నెల్ (56), మిల్లర్ (37) రాణించగా, స్మిత్ (20), డుమిని (20) ఓ మోస్తరుగా ఆడారు. అజ్మల్ 4, ఆఫ్రిది 3, తన్వీర్ 2 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాక్ 46.3 ఓవర్లలో 182 పరుగులు చేసి ఓడింది. అహ్మద్ షెహజాద్ (58) టాప్ స్కోరర్. మిస్బా (31), హఫీజ్ (28) ఫర్వాలేదనిపించారు. షెహజాద్, మిస్బా రెండో వికెట్‌కు 71 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. కానీ మిడిలార్డర్, లోయర్ ఆర్డర్‌లో ఏ ఒక్కరు క్రీజులో నిలబడలేకపోయారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పార్నెల్, తాహిర్ చెరో మూడు, మోర్నీ మోర్కెల్, సొట్‌సోబ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఇరుజట్ల మధ్య రెండో వన్డే నేడు (శుక్రవారం) జరుగుతుంది.