క్లాసెన్‌ కొట్టేశాడు | South Africa won the second T20 | Sakshi
Sakshi News home page

క్లాసెన్‌ కొట్టేశాడు

Published Thu, Feb 22 2018 1:19 AM | Last Updated on Thu, Feb 22 2018 9:16 AM

South Africa won the second T20 - Sakshi

క్లాసెన్‌

వన్డే సిరీస్‌లో భారత్‌ ఏకైక ఓటమికి కారణమైన హెన్రిక్‌ క్లాసెన్‌ టి20 మ్యాచ్‌లో మరోసారి విశ్వరూపం చూపించాడు. భారీ స్కోరు చేసిన తర్వాత గెలుపుపై భారత్‌ ఆశలు పెంచుకున్న మ్యాచ్‌ను ఒంటి చేత్తో లాగేశాడు. సప్త సిక్సర్లతో చెలరేగి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. క్లాసెన్‌ జోరుకు చేతులెత్తేసిన యజువేంద్ర చహల్‌ రికార్డు స్థాయిలో పరుగులిచ్చి పరాభవంలో కీలక పాత్రగా మారాడు. క్లాసెన్‌కు తోడుగా కెప్టెన్‌ డుమిని కూడా జోరు ప్రదర్శించడంతో మిగతా భారత బౌలర్లూ అసహాయంగా ఉండిపోయారు. అంతకుముందు పాండే చక్కటి బ్యాటింగ్, ధోని మెరుపు ప్రదర్శన కూడా తుది ఫలితం తర్వాత వెనక్కి వెళ్లిపోయాయి. ఇక పర్యటనలో ఆఖరి వేదికలాంటి చివరి టి20తోనే సిరీస్‌ విజేత ఎవరో తేలనుంది.    

సెంచూరియన్‌: టి20 సిరీస్‌లో దక్షిణాఫ్రికా కోలుకొని కీలక గెలుపును అందుకుంది. బుధవారం ఇక్కడ జరిగిన రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. మనీశ్‌ పాండే (48 బంతుల్లో 79 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), మహేంద్ర సింగ్‌ ధోని (28 బంతుల్లో 52 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 56 బంతుల్లోనే అభేద్యంగా 98 పరుగులు జోడించడం విశేషం. అనంతరం దక్షిణాఫ్రికా 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసింది. వికెట్‌ కీపర్‌ హెన్రిక్‌ క్లాసెన్‌ (30 బంతుల్లో 69; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడగా... జేపీ డుమిని (40 బంతుల్లో 64 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగాడు. తాజా ఫలితంతో సిరీస్‌ ప్రస్తుతం 1–1తో సమమైంది. చివరిదైన మూడో టి20 ఈ నెల 24న కేప్‌టౌన్‌లో జరుగుతుంది.  

మెరుపు భాగస్వామ్యం... 
రెండు మెయిడిన్‌ ఓవర్లు... మూడు వికెట్లు... అద్భుతమైన స్వింగ్‌ బౌలింగ్‌... బౌండరీల జోరు... ఇవన్నీ భారత ఇన్నింగ్స్‌ పవర్‌ప్లేలో విశేషాలు. మోరిస్‌ వేసిన తొలి ఓవర్‌లో ధావన్‌ పరుగులేమీ చేయకపోగా, డాలా వేసిన రెండో ఓవర్‌ తొలి బంతికే రోహిత్‌ శర్మ (0) గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. అయితే తర్వాతి రెండు ఓవర్లలో భారత్‌ చెలరేగి 32 పరుగులు చేసింది. మోరిస్‌ వేసిన మూడో ఓవర్లో ధావన్‌ 2 సిక్సర్లు, 2 ఫోర్లతో 20 పరుగులు రాబట్టి లెక్క సరి చేయగా... తర్వాతి ఓవర్లో రైనా మూడు ఫోర్లు బాదాడు. కానీ ఎనిమిది బంతుల వ్యవధిలో ధావన్‌ (14 బంతుల్లో 24; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కోహ్లి (1) వికెట్లు కోల్పోయి భారత్‌ ఇన్నింగ్స్‌ తడబాటుకు గురైంది. కోహ్లి వెనుదిరిగాక తర్వాతి 18 బంతుల్లో భారత్‌ ఒక ఫోర్‌ మాత్రమే కొట్టగలిగింది. ఈ దశలో షమ్సీ ఓవర్లో పాండే 2 భారీ సిక్సర్లు, ఫోర్‌ కొట్టి మళ్లీ ఊపు తెచ్చాడు. రైనా (24 బంతుల్లో 31; 5 ఫోర్లు)ను ఫెలుక్‌వాయో అవుట్‌ చేయడంతో 45 పరుగుల (31 బంతుల్లో) నాలుగో వికెట్‌ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడిన పాండే 33 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అనంతరం మరో ఎండ్‌లో ధోని తనదైన శైలిలో చెలరేగాడు. చాలా కాలంగా దూకుడుకు దూరమైన ఈ మాజీ కెప్టెన్‌ చివరి రెండు ఓవర్లలో తన ప్రతాపం చూపించాడు. 19వ ఓవర్లో ఒక ఫోర్, సిక్సర్‌ కొట్టిన అతను... ప్యాటర్సన్‌ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా 6, 4, 4తో విరుచుకు పడ్డాడు. ఈ క్రమంలో 27 బంతుల్లోనే కెరీర్‌లో రెండో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి 10 ఓవర్లలో 85 పరుగులు చేసిన భారత్‌... తర్వాతి పది ఓవర్లలో ఏకంగా 103 పరుగులు సాధించడం విశేషం. అనారోగ్యానికి గురైన బుమ్రా స్థానంలో భారత్‌ ఈ మ్యాచ్‌లో శార్దుల్‌ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకుంది.   

క్లాసిక్‌ ఇన్నింగ్స్‌... 
ఛేదనలో దక్షిణాఫ్రికాకు కూడా సరైన ఆరంభం లభించలేదు. తొలి రెండు ఓవర్లలో ఆ జట్టు 3 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత హెన్‌డ్రిక్స్‌ (17 బంతుల్లో 26; 5 ఫోర్లు) తాను ఆడిన ఆరు బంతుల్లో నాలుగు ఫోర్లు బాది జోరు పెంచే ప్రయత్నం చేశాడు. అయితే స్మట్స్‌ (2), హెన్‌డ్రిక్స్‌ తక్కువ వ్యవధిలోనే వెనుదిరగడంతో భారత్‌ ఊపిరి పీల్చుకుంది. ఈ దశలో డుమిని, క్లాసెన్‌ భాగస్వామ్యం సఫారీని ముందంజలో నిలిపింది. ముఖ్యంగా క్లాసెన్‌ అద్భుతమైన షాట్లతో చెలరేగాడు. ఉనాద్కట్‌ వేసిన ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టిన అతను, చహల్‌ బౌలింగ్‌లో విరుచుకు పడ్డాడు. చహల్‌ తొలి ఓవర్లో సిక్సర్‌ కొట్టిన క్లాసెన్, అతని రెండో ఓవర్లో మరో రెండు సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలోనే 22 బంతుల్లోనే క్లాసెన్‌ అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత కూడా చహల్‌ను వదలకుండా మరుసటి ఓవర్లో వరుసగా 6, 6, 4తో బెంబేలెత్తించాడు. అదే ఓవర్లో డుమిని కూడా మరో సిక్సర్‌ కొట్టడంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి. అయితే తర్వాతి ఓవర్‌ తొలి బంతికే క్లాసెన్‌ను అవుట్‌ చేసిన జైదేవ్‌ ఉనాద్కట్‌ భారత్‌కు కీలక వికెట్‌ అందించాడు. అయితే డుమిని, బెహర్దీన్‌ (16 నాటౌట్‌) ఐదో వికెట్‌కు 48 పరుగులు జత చేసి మరో 8 బంతులు మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికాను గెలిపించారు.  

►64 చహల్‌ 4 ఓవర్లలో ఇచ్చిన పరుగులు. అంతర్జాతీయ టి20ల్లో భారత్‌ తరఫున ఇదే అత్యంత చెత్త ప్రదర్శన. గతంలో జోగిందర్‌ శర్మ (57) పేరిట ఉన్న రికార్డును చహల్‌ సవరించాడు. 

►73 పేసర్‌ శార్దుల్‌ ఠాకూర్‌ ఈ మ్యాచ్‌తో టి20ల్లో అరంగేట్రం చేశాడు. భారత్‌ తరఫున అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ ఆడిన 73వ ఆటగాడు శార్దుల్‌.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement