స్పెయిన్‌ ఊపిరి పీల్చుకుంది | Spain running scared at Russia 2018 | Sakshi
Sakshi News home page

స్పెయిన్‌ ఊపిరి పీల్చుకుంది

Published Fri, Jun 22 2018 1:27 AM | Last Updated on Fri, Jun 22 2018 1:27 AM

Spain running scared at Russia 2018 - Sakshi

బలమైన స్పెయిన్‌... పసికూన ఇరాన్‌...! బలాబలాల రీత్యా మాజీ చాంపియన్‌దే పూర్తిగా పైచేయి కావాలి...! కానీ, ఆసియా జట్టు పట్టుదల చూపింది...! మ్యాచ్‌ ఆసాంతం వెనుకంజలోనే ఉన్నా... విపరీతంగా దాడులు ఎదుర్కొన్నా... గోల్‌ కోసం ప్రత్యర్థి చెమటలు కక్కేలా చేసింది... చివరకు ఓడిపోయినా అంతరం భారీగా లేకుండా చూసుకుంది...!

కజన్‌: ప్రపంచ కప్‌లో స్పెయిన్‌కు తొలి గెలుపు. పోర్చుగల్‌తో మొదటి మ్యాచ్‌ను డ్రా చేసుకున్న ఆ జట్టు... రెండో మ్యాచ్‌లో అతి కష్టం మీద ఇరాన్‌ను ఓడించగలిగింది. గ్రూప్‌ ‘బి’లో భాగంగా బుధవారం అర్ధరాత్రి రెండు జట్ల మధ్య ఇక్కడ జరిగిన పోటీలో స్పెయిన్‌ 1–0తో నెగ్గింది. ఈ ఏకైక గోల్‌ను ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ డిగో కోస్టా 54వ నిమిషంలో చేశాడు. బంతిపై నియంత్రణ, గోల్‌పోస్ట్‌పై దాడులు, పాస్‌లు అందిపుచ్చుకోవడం ఇలా మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో స్పెయిన్‌ ఆధిపత్యమే సాగినా... ర్యాంకు, ఆటతీరులో తమకంటే ఎంతో మెరుగైన ఆ జట్టును ఇరాన్‌ విసిగించింది. డ్రా చేసుకున్నా చాలన్నట్లుగా ముప్పుతిప్పలు పెట్టింది. ఓపికగా ఆడిన మాజీ చాంపియన్‌ గట్టెక్కింది. ఈ గెలుపుతో పోర్చుగల్, స్పెయిన్‌ నాలుగేసి పాయింట్లతో గ్రూపులో టాప్‌లో ఉన్నాయి. మొరాకోపై విజయంతో ఇరాన్‌ ఖాతాలో మూడు పాయింట్లున్నాయి. ఈ నెల 25న మొరాకోతో స్పెయిన్, పోర్చుగల్‌తో ఇరాన్‌ తదుపరి మ్యాచ్‌లు ఆడనున్నాయి. 

కష్టమ్మీదనే... 
చురుకైన ఆటకు పేరుగాంచిన స్పెయిన్‌ మ్యాచ్‌ను అందుకుతగ్గట్లే ప్రారంభించింది. ఇనెస్టా దూకుడుతో ఆధిపత్యం చాటింది. ఇరాన్‌ దీటుగా స్పందించి అడ్డుకుంది. అయితే, బంతి మాత్రం ఆ జట్టు ఆధీనంలోకి రాలేదు. కీలకమైన కోస్టాను ఇరాన్‌ డిఫెండర్లు నిలువరించారు. దీంతో అటాకింగ్‌ బాధ్యతలను కెప్టెన్‌ సెర్గియో తీసుకున్నాడు. ఒత్తిడిలో పడినా... తలొగ్గని ఇరాన్‌ కొంతసేపటికి దాడులు మొదలుపెట్టింది. సిల్వా, పిక్యూ, బస్క్వెట్స్‌లు గోల్‌ పోస్ట్‌కు సమీపంగా వచ్చినా కట్టుతప్పని ఆ జట్టు రక్షణ శ్రేణిని ఛేదించలేకపోయారు. తొలి భాగం ముగిసేసరికి 27 శాతం మాత్రమే బంతి ఇరాన్‌ ఆధీనంలో ఉన్నా ప్రత్యర్థికి ఆధిక్యం మాత్రం దక్కనివ్వలేదు. 

రెండో భాగం 9వ నిమిషంలోనే... 
రక్షణ శ్రేణి, స్ట్రయికర్ల పోరాటంలా సాగుతోన్న మ్యాచ్‌లో ఎట్టకేలకు 54వ నిమిషంలో అనూహ్యం అనదగ్గ రీతిలో స్కోరు నమోదైంది. డి బాక్స్‌ లోపల ఇరాన్‌ ఆటగాడు రామిన్‌... కోస్టాను నిలువరించే ప్రయత్నం చేశాడు. బంతిని తమ ఆటగాడికి పాస్‌ చేసే క్రమంలో అది అనుకోకుండా కోస్టాకు తగిలి గోల్‌ పోస్ట్‌లోకి వెళ్లింది. మరోవైపు 62వ నిమిషంలో ఇరాన్‌ గోల్‌ చేసినా, అది ఆఫ్‌సైడ్‌గా తేలింది. ఇక్కడినుంచి రెండు జట్లు పైచేయి కోసం పోరాటం సాగిస్తూ వరుసగా సబ్‌స్టిట్యూట్‌లను దించాయి. ఈ క్రమంలో ఎల్లో కార్డ్‌లు చూపాల్సి వచ్చింది. ఇరాన్‌ ఆటగాళ్లు కొన్ని చక్కటి క్రాస్‌లు కొట్టినా అవి సఫలం కాలేదు. గోల్‌ కోసం ఆ జట్టు నుంచి ఇంతకుమించి ప్రయత్నాలు సాధ్యం కాకపోవడంతో విజయం స్పెయిన్‌ను వరించింది. మ్యాచ్‌లో 17 సార్లు దాడులకు దిగిన స్పెయిన్‌... బంతిని 70 శాతం తన ఆధీనంలోనే ఉంచుకోవడ విశేషం.

కావాలని తొక్కలేదు!
మ్యాచ్‌ మొదటి అర్ధభాగంలో జరిగిన ఘటన చర్చనీయాంశమైంది. ఊహించని ప్రతిఘటనతో స్పెయిన్‌ ఆటగాళ్లు అప్పటికే అసహనానికి గురయ్యారు. ఇదే సందర్భంలో స్పెయిన్‌ స్ట్రయికర్‌ డిగో కోస్టా... ఇరాన్‌ గోల్‌ కీపర్‌ అలి బిరాన్‌వాండ్‌ కాలును గట్టిగా తొక్కాడు. అలి నొప్పితో మైదానాన్ని వీడాడు. కోస్టాకు దీనిపై రిఫరీ ఆండ్రెన్‌ కున్హా ఎటువంటి హెచ్చరిక చేయలేదు. తర్వాత కొద్దిసేపటికే అతడు గోల్‌ చేశాడు. ఇరాన్‌ కీపర్‌ కాలు కావాలని తొక్కలేదని చెప్పిన కోస్టా... రీ బౌండ్‌ గోల్‌ అదృష్టవశాత్తు  వచ్చిందేనని అంగీకరించాడు. అయితే, కోస్టా చేసిన పని కచ్చితంగా హెచ్చరిక జారీ చేయదగినదేనని, అదే జరిగితే ఫలితం మారేదని ఇరాన్‌ జట్టు పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement