
ఆటైనా, జీవితమైనా ఊహించని మలుపులు సహజం. ఇపుడు అలాంటిదే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు స్పెయిన్ జట్టులో జరిగింది. మెగా ఈవెంట్‌కు కేవలం ఒక్క రోజు ముందు స్పెయిన్ జట్టు తమ కోచ్ లొపెటెగోను తప్పించింది. నాకు తెలిసి టోర్నీకి ముందు ఇలాంటి నిర్ణయం ఏ జట్టు తీసుకోదు. ఇది సమీకరణాలను మార్చ గలదు. అర్జెంటీనా, ఐస్‌లాండ్ జట్ల మధ్య జరిగే ప్రారంభ మ్యాచ్ కంటే ముందు స్పెయిన్, పోర్చుగల్ మ్యాచ్‌పై నేను దృష్టి పెట్టాను. అసలు ఈ మ్యాచ్ ఎలా సాగుతుందో అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నాను.
కొత్త కోచ్ ఫెర్నాండో హియెర్రో, స్పెయిన్ ఆటగాళ్లు తమ తొలి మ్యాచ్‌లో ఏ మేరకు రాణిస్తారో చూడాలి. నా వరకైతే ఇది క్లిష్టమైందే కానీ... ఫుట్‌బాల్‌లో అసాధ్యమైంది మాత్రం కాదు. ఎందుకంటే స్పెయిన్ ఆటగాళ్లంతా ప్రొఫెషనల్సే. వాళ్లకు వాళ్లమీదున్న బాధ్యతలేంటో బాగా తెలుసు. ఇతరత్రా (కోచ్‌కు ఉద్వాసన) ఆఫ్ ది ఫీల్డ్ వ్యవహారాలేవీ ఆన్ ద ఫీల్డ్‌లో కనిపించకుండా జాగ్రత్తగా ఆడగలరు. సాధారణ పరిస్థితుల్లో అయితే అటాకింగ్ స్పెయిన్‌కు, రక్షణాత్మక పోర్చుగల్ మధ్య రసవత్తర పోరు తప్పదు.
స్పెయిన్ కొత్త కోచ్ ఫెర్నాండో కూడా ప్రత్యర్థి జట్టులో క్రిస్టియానో రొనాల్డో ఉన్నప్పటికీ తమ అటాకింగ్‌నే నమ్ముకుంటాడనిపిస్తుంది. రెండేళ్ల క్రితం యూరో (2016) సమరంలో ఎదురైన పోటీనే ఇక్కడ ఉంటుందని నేను ఆశిస్తున్నా. అయితే పోర్చుగల్ ఆరంభంలో ఎదురుదాడికి దిగి గోల్స్ సాధించడం ద్వారా మ్యాచ్‌పై పట్టు సాధించాలని చూడొచ్చు. రొనాల్డో ఎంతటి ప్రమాదకారో స్పెయిన్‌కు బాగా తెలుసు. ఫీల్డ్‌లో అతనికి ఏ మాత్రం చాన్స్ ఇచ్చినా... స్పెయిన్ మిడ్‌ఫీల్డ్, డిఫెన్స్‌లపై ఒత్తిడి పెరగడం ఖాయం. కాబట్టి స్పెయిన్ ఇక్కడ క్రమశిక్షణతో అడుగేయాల్సి ఉంటుంది
Comments
Please login to add a commentAdd a comment