
మాడ్రిడ్ (స్పెయిన్): నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గజేషన్ (నాటో) సభ్య దేశాల శాంతిభద్రతలకు రష్యా నేరుగా ముప్పుగా పరిణమించిందని అమెరికా సహా పలు దేశాలు ఆందోళన వెలిబుచ్చాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద భద్రతా ముప్పుని ఎదుర్కొంటున్నామన్నాయి. యూరప్‌లో ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత కుదుర్చుకున్న భద్రతాపరమైన ఒప్పందాలను రష్యా తుంగలోకి తొక్కి ఉక్రెయిన్‌పై దండెత్తిందని ధ్వజమెత్తాయి.
స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో బుధవారం నాటో సభ్య దేశాల వార్షిక సదస్సు జరిగింది. అనంతరం 30 దేశాల నాటో కూటమి ఒక ప్రకటన విడుదల చేసింది. రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు రాజకీయంగా, ఆచరణీయంగా మద్దతిస్తామని నాయకులు హామీ ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యూరప్‌లో శాంతిని విచ్ఛిన్నం చేశారని నాటో ప్రధాన కార్యదర్శి జెన్స్ స్టోటెన్‌బెర్గ్ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నాటో సభ్య దేశాలకు భద్రతాపరంగా పెను సవాళ్లు విసురుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
పోలండ్‌లో శాశ్వత సైనిక కేంద్రం
యూరప్‌కు మరిన్ని అమెరికా బలగాలను తరలిస్తామని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ప్రాంతీయ భద్రత కోసం పోలండ్‌లో తొలి శాశ్వత మిలటరీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అమెరికాకు చెందిన లక్ష బలగాలు నిరంతరం యూరప్‌లో ఉండేలా చూస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment