సినిమా ఇప్పట్లో కాదు! | special chit chat with indian women cricketer mithaliraj | Sakshi
Sakshi News home page

సినిమా ఇప్పట్లో కాదు!

Published Thu, Mar 2 2017 12:46 AM | Last Updated on Tue, Sep 5 2017 4:56 AM

సినిమా ఇప్పట్లో కాదు!

సినిమా ఇప్పట్లో కాదు!

బయోగ్రఫీ ఆలోచన మాత్రం ఉంది
►  వరల్డ్‌ కప్‌లోనూ సత్తా చూపిస్తాం
‘సాక్షి’ ఇంటర్వ్యూలో మిథాలీ రాజ్‌

 
హైదరాబాద్‌: అంతర్జాతీయ క్రికెటర్‌గా 18 ఏళ్ల కెరీర్‌... దాదాపు 8 వేల పరుగులు... 133 మ్యాచ్‌లలో భారత జట్టుకు సారథ్యం... ప్రపంచ క్రికెట్‌పై హైదరాబాద్‌ అమ్మాయి మిథాలీ రాజ్‌ ముద్ర ప్రత్యేకం. ఇప్పటికీ వన్నె తగ్గని ఆటతో ఆమె తనదైన శైలిలో సత్తా చాటుతోంది.  కెప్టెన్‌గా, అత్యుత్తమ బ్యాట్స్‌విమన్‌గా ముందుండి జట్టును నడిపిస్తున్న మిథాలీ నాయకత్వంలో ఇటీవలే భారత జట్టు వన్డే ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. టోర్నీలో మూడు అర్ధ సెంచరీలతో ఆమె ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది. బుధవారం బీసీసీఐ ప్రకటించిన వార్షిక పురస్కారాల్లో 34 ఏళ్ల మిథాలీ రాజ్‌ ‘ఉత్తమ మహిళా క్రికెటర్‌’గా అవార్డును సొంతం చేసుకుంది. మూడోసారి ఈ అవార్డును అందుకోనున్న నేపథ్యంలో మిథాలీ రాజ్‌ను ‘సాక్షి’ పలకరించింది. ఈ సందర్భంగా ఆమె వరల్డ్‌ కప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ, ప్రధాన టోర్నీ కోసం జట్టు సన్నాహాలు, ఇతర అంశాలపై వెల్లడించిన అభిప్రాయాలు ఆమె మాటల్లోనే...

వరల్డ్‌ కప్‌కు అర్హత సాధించడంపై...
చాలా సంతోషంగా ఉంది. పాకిస్తాన్‌తో మూడు వన్డేల సిరీస్‌ ఆడకపోవడం వల్ల క్వాలిఫయింగ్‌లో మేం తలపడాల్సి వచ్చింది. అయితే అది బోర్డు నిర్ణయం కాబట్టి మేమేం చేయలేం. మొదటి నుంచి టోర్నీలో మా స్థాయికి తగినట్లు ఆడి ఆధిక్యం ప్రదర్శించి అజేయంగా నిలవగలిగాం. అయితే క్వాలిఫయింగ్‌ టోర్నీ కూడా మంచే చేసింది. యువ క్రీడాకారిణులకు అవకాశమిచ్చేందుకు, వారిని పరీక్షించి అసలు ప్రపంచకప్‌ కోసం జట్టు కూర్పు గురించి ఒక అవగాహనకు వచ్చేందుకు ఇది ఉపయోగపడింది. మా అంచనాలకు తగినట్లుగా మోనా, దీప్తి, దేవిక, మాన్సి రాణించారు. నేను కూడా వేగంగా పరుగులు చేసేందుకు స్టాన్స్‌ మార్చి... కొత్తగా ప్రయత్నించి మంచి ఫలితాలు కూడా సాధించాను.

ఉత్కంఠ భరిత ఫైనల్‌ గురించి...
నిజానికి మేం ఆఖరి బంతి దాకా మ్యాచ్‌ను తీసుకు రాకుండా ఉండాల్సింది! వరుస ఓవర్లలో ముగ్గురు బ్యాట్స్‌విమన్‌ అవుట్‌ కావడం ఒక్కసారిగా దెబ్బ తీసింది. అయితే ప్రధాన ప్లేయర్‌ హర్మన్‌ప్రీత్‌ ఉంది కాబట్టి కాస్త ధైర్యంగా ఉన్నాం. అలాంటి స్థితిలో టెయిలెండర్లు ఇచ్చిన మద్దతు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐదో బంతికి హర్మన్‌ కొట్టిన సిక్సర్‌ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. దురదృష్టవశాత్తూ పాక్‌తో మ్యాచ్‌లో గాయపడటం వల్ల నేను ఫైనల్‌ ఆడలేకపోయినా, విజయం చాలా ఆనందాన్నిచ్చింది.

ప్రపంచ కప్‌లో అవకాశాలపై...
మా సన్నాహాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. స్వదేశంలో విండీస్‌పై సిరీస్‌ విజయం, ఆసియా కప్, ఇప్పుడు క్వాలిఫయర్స్‌లో జట్టు విజయాలు సాధించింది. ఇప్పుడు నేరుగా ప్రపంచ కప్‌ బరిలోకే దిగుతాం కాబట్టి ఈ జోరును కొనసాగించడం ముఖ్యం. ఈ టీమ్‌లో ఆత్మవిశ్వాసం పెరిగింది.  కొత్త అమ్మాయిలు బౌలింగ్‌లో మంచి ప్రదర్శన ఇచ్చారు. ప్రపంచకప్‌ కోసం జులన్‌ గోస్వామి, స్మృతి మంథన తిరిగొస్తారు కాబట్టి టీమ్‌ ఇంకా పటిష్టంగా మారుతుంది. పవర్‌ప్లేలో ఎక్కువ పరుగులు చేయడం, మంచి ఓపెనింగ్‌ భాగస్వామ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. వచ్చే మూడు నెలలు తీవ్రంగా సాధన చేయాలని పట్టుదలగా ఉన్నాం.

మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో పాల్గొనడంపై...
తొలిసారి బిగ్‌బాష్‌ టి20 లీగ్‌ ప్రకటించినప్పుడు నాకు కూడా ఆహ్వానం వచ్చింది. అయితే అప్పుడు ఈ విషయంపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఆడలేకపోయాను. అయితే ఈసారి అవకాశం దక్కించుకున్న హర్మన్‌ప్రీత్, స్మృతి దానిని చక్కగా ఉపయోగించుకున్నారు. క్వాలిఫయర్‌లో ధాటిగా ఆడేందుకు హర్మన్‌ప్రీత్‌కు బిగ్‌బాష్‌ అనుభవం ఉపయోగపడిందని చెప్పగలను. వీరిద్దరిని జాతీయ శిక్షణ శిబిరం కోసం  బోర్డు వెనక్కి పిలిపించడంలో తప్పు లేదు. అన్నింటికంటే భారత జట్టుకు ఆడటమే ముఖ్యం. మున్ముందు నేనూ ఆడతానా లేదా చెప్పలేను.

బోర్డు ప్రయోజనాలు అందించే విషయంపై...
గతంతో పోలిస్తే బీసీసీఐ నుంచి మాకు మంచి మద్దతు లభిస్తోంది. గెలిచినప్పుడు ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నారు. అయితే ఇటీవలే పెన్షన్, ఏక మొత్తపు ప్రయోజనం గురించి చర్చ జరిగినట్లుంది. దీని కోసం కనీసం ఐదు టెస్టులు ఆడాలనే నిబంధన పెట్టారని తెలుస్తోంది. అయితే దీని వల్ల ఎక్కువ భాగం మందికి ప్రయోజనం దక్కదు. 2002 నుంచి గత పదిహేనేళ్లలో నేను కేవలం 10 టెస్టులే ఆడగలిగానంటే ఇక మిగతా వారి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు! మాకు సంబంధించి టెస్టు మ్యాచ్‌లు దాదాపు అంతర్ధానమైపోయాయి. కాబట్టి ఐదు వన్డేలను ఒక టెస్టు మ్యాచ్‌గా గుర్తిస్తే బాగుంటుందని నా సూచన. అప్పుడు 30 వన్డేలు ఆడినవారు కనీసం ఆరు టెస్టుల అర్హత మార్క్‌ను అందుకుంటే వారికి మేలు జరుగుతుంది. సీఓఏలో డయానా ఎడుల్జీ భాగమే అయినా ఆమె ప్రత్యేకంగా మహిళల క్రికెట్‌ను పర్యవేక్షించడం లేదు కాబట్టి ఆమె రాక వల్ల అదనపు లాభం ఉంటుందని భావించడం లేదు.

సుదీర్ఘ కెరీర్‌పై...
ఇంత కాలంగా ఆడటం చాలా సంతృప్తినిచ్చింది. వ్యక్తిగతంగా నా బ్యాటింగ్‌ ఫామ్‌ను ప్రపంచ కప్‌లోనూ కొనసాగించాలని కోరుకుంటున్నా. ప్రస్తుతం నా ఆటను ఆస్వాదిస్తున్నాను. వీలైనంత కాలం ఆడుతూనే ఉంటాను. ఈ విషయంలో రెండో ఆలోచనకు తావు లేదు.

బయోగ్రఫీ, సినిమాపై...
కొన్నాళ్ల క్రితమే నా బయోగ్రఫీ రాయడం గురించి కొంత మంది నన్ను సంప్రదించారు. అయితే నేను ఎలాంటి హామీ ఇవ్వలేదు. నా బిజీ షెడ్యూల్‌లో దానికి సమయం కేటాయించలేకపోవడం కూడా ఒక కారణం. ఎప్పుడో చెప్పలేను కానీ కెరీర్‌ ముగించే సమయంలో ఆత్మకథ మాత్రం వస్తుంది. క్రికెట్‌ను ఎంచుకున్న నాటినుంచి కెరీర్‌లో ఈ స్థాయికి చేరే వరకు నా జీవితంలో కూడా ఎన్నో మలుపులు, విశేషాలు ఉన్నాయి. స్పోర్ట్స్‌మన్‌ బయోపిక్‌లు అందరినీ ఆకట్టుకుంటున్న మాట వాస్తవం. కానీ నాకు సంబంధించి అయితే ప్రస్తుతానికి సినిమాపరంగా ఎలాంటి ఆలోచన లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement