అతడి ఆట ఆసాంతం దూకుడు... నడవడిక మాత్రం నిండుకుండ... క్రీజులో ఉంటే బౌలర్లకు దడదడ... అభిమానులకు కనుల పండుగ... క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, రగ్బీ, టెన్నిస్, స్విమ్మింగ్... ఇలా అనేక క్రీడల్లో ప్రవేశం... ‘ఆల్‌రౌండ్’ ఆటగాడికి నిదర్శనం...! అతడే ఏబీ డివిలియర్స్.
ఆధునిక క్రికెట్‌ను మరింత జనరంజకంగా మార్చిన ఆటగాళ్లెవరంటే మొదటి వరుసలో ఉండే పేరు డివిలియర్స్. వికెట్‌కు ఇరువైపులా అన్ని కోణాల్లో అతను కొట్టే షాట్లు ప్రేక్షకులతో ఔరా అనిపించినట్లే... రిటైర్మెంట్‌పై అతడి అనూహ్య నిర్ణయమూ ఆశ్చర్యపర్చింది. సరిగ్గా వారం క్రితం ఐపీఎల్‌లో హైదరాబాద్‌పై బౌండరీ లైన్ వద్ద అత్యద్భుత క్యాచ్ అందుకుని అహో అనిపించుకున్న ఏబీ... ఇంతలోనే విరమణ ప్రకటిస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. దాదాపు రెండేళ్లుగా రిటైర్మెంట్‌పై వార్తలు వస్తున్నా స్పష్టంగా ఖండించని డివిలియర్స్... బుధవారం తనదైన శైలిలో అరంగేట్ర మైదానంలో వీడ్కోలు వీడియో సందేశంతో క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశాడు.
ఆస్ట్రేలియాతో వివాదాస్పదంగా సాగిన తాజా టెస్టు సిరీస్‌లోనూ 71 పైగా సగటుతో 427 పరుగులు చేసిన డివిలియర్స్ మూడు ఫార్మాట్లలోనూ కొనసాగేలా కనిపించాడు. పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్న అతడు 2019 వన్డే ప్రపంచకప్ వరకైనా దక్షిణాఫ్రికా జట్టుకు సేవలందిస్తాడని అంతా భావిస్తుంటే... ఏడాది ముందే పరుగు ఆపేశాడు. టెస్టులు, వన్డేల్లో 50కి పైగా, టి20ల్లోనూ 30కి దగ్గరగా సగటున్న ఈ సూపర్ మ్యాన్ స్థానాన్ని భర్తీ చేయడం... ప్రస్తుతం సంధి దశలో ఉన్న ప్రొటీస్ జట్టుకు అంత సులువేం కాదు.
అనేక క్రీడల్లో అదరగొట్టాడు...
ఏబీ తొలి టెస్టులో ఓపెనింగ్‌కు దిగాడు. తర్వాత స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. వికెట్ కీపర్‌గానూ సేవలందించాడు. విధ్వంసక ఆటతో మనకు ఎక్కువగా దగ్గరయ్యాడు. కానీ అతడికి క్రికెట్‌తో పాటు హాకీ, ఫుట్‌బాల్, రగ్బీ, టెన్నిస్, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్‌లో చెప్పుకోదగ్గ రికార్డులున్నాయి. గోల్ఫ్‌లోనూ ఏబీకి ప్రవేశం ఉండటం విశేషం. 14 ఏళ్ల కెరీర్‌లో డివిలియర్స్ ఏనాడూ వివాదాల జోలికి పోలేదు. ఆటలో ఎంత దూకుడు చూపినా, చిరునవ్వుతో హుషారుగా ఉండటం తన పద్ధతి. అందుకే అందరి అభిమానాన్ని పొందాడు. ఐపీఎల్‌లోనూ ఇదే తరహాలో మనసులు చూరగొన్న ఏబీ... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున అనేక అద్భుత ఇన్నింగ్స్‌లతో అలరించాడు.
రికార్డులు... రివార్డులు...
►వన్డేల్లో వేగవంతమైన అర్ధ శతకం (16 బం తుల్లో); శతకం (31 బంతుల్లో; 2015లో వెస్టిండీస్‌పై); 150 (64 బంతులు); రికార్డులు ఏబీ పేరిటే ఉన్నాయి.
►వన్డేల్లో 50 పైగా ఇన్నింగ్స్‌లాడి 50పైగా సగటు, 100 స్ట్రయిక్ రేట్ ఉన్న బ్యాట్స్‌మన్ డివిలియర్స్ ఒక్కడే.
►వన్డేల్లో 25వ ఓవర్ తర్వాత వచ్చి 5 శతకాలు చేసిన ఏకైక క్రికెటర్.
►వన్డేలు, టెస్టుల్లో 5 వేల పైగా పరుగులు చేసి 50పైగా సగటున్న ఇద్దరు క్రికెటర్లలో ఏబీ ఒకడు. మరొకరు విరాట్ కోహ్లి.
► ఒకే టెస్టులో సెంచరీతో పాటు పది మంది పైగా ఆటగాళ్లను ఔట్ చేసిన ఏకైక వికెట్ కీపర్ డివిలియర్స్.
– సాక్షి క్రీడా విభాగం
Comments
Please login to add a commentAdd a comment