జపాన్ దేశాన్ని సునామీ విషాదం ముంచెత్తి అప్పటికి నాలుగు నెలలైంది. ఎంతటి విపత్తు నుంచైనా కోలుకునే సామర్థ్యం ఉన్న ఆ దేశం అదే ప్రయత్నంలో ఉంది. కానీ జపాన్ ప్రజలకు మాత్రం ఇంకా ఏదో కావాలి. దేశం మొత్తానికి బాధను మరచిపోయేలా చేసే, కాస్త ఆనందం పంచే ఒక మందు కావాలి. ఇలాంటి సమయంలో క్రీడా ప్రపంచంలో జరిగిన ఒక అద్భుతం ఆ దేశం మొత్తం గర్వపడేలా చేసింది. అంతటి విషాదాన్ని కూడా పక్కన పెట్టి జపాన్ జాతి యావత్తూ సంబరాల్లో మునిగిపోయింది. అలాంటి అపూర్వ విజయాన్ని జపాన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు అందించింది. 2011 ‘ఫిఫా’ ప్రపంచ కప్ విజేతగా నిలిచి సంచలనం సృష్టించింది.
మార్చి 11, 2011... జపాన్ దేశం అతి పెద్ద సునామీతో అతలాకుతలమైంది. సుమారు 16 వేల మంది చనిపోవడంతో పాటు తీవ్ర విధ్వంసం జరిగింది. ఆ వెంటనే ఫకుషిమా న్యూక్లియర్ ప్లాంట్‌లో పేలుడు కారణంగా తీవ్ర స్థాయిలో విష వాయువులు వ్యాపించాయి. దాదాపు లక్షన్నర మందిని వేరే చోటికి తరలించాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో ఒక మెగా క్రీడా ఈవెంట్‌లో తమ జట్టు ప్రదర్శన జపాన్ ప్రజలకు ఊరట కలిగించింది. ఆ దేశంలో అత్యంత ఆదరణ ఉన్న క్రీడ అయిన ఫుట్‌బాల్‌లో మహిళలు సాధించిన అతి పెద్ద విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే.
అదే స్ఫూర్తితో...
ఏడాది క్రితం దక్షిణాఫ్రికాలో జరిగిన పురుషుల 2010 ‘ఫిఫా’ ప్రపంచకప్‌లో జపాన్ జట్టు సెమీఫైనల్ వరకు చేరింది. అదే ఆ దేశపు పెద్ద ఘనత కావడంతో అభిమానులంతా సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు సంవత్సరం తర్వాత మహిళల టీమ్ ప్రపంచ కప్‌లో పాల్గొనేందుకు జర్మనీ పయనమైంది. అంతకుముందు జరిగిన ఐదు ప్రపంచకప్‌లలో నాలుగుసార్లు గ్రూప్ దశకే పరిమితమైన టీమ్ ఒక్కసారి మాత్రం క్వార్టర్ ఫైనల్ వరకు చేరగలిగింది. దాంతో పెద్దగా అంచనాలు కూడా లేవు. అయితే టీమ్ వెళ్లే ముందు ఆ దేశ ప్రజలు, అభిమానులు మాత్రం ఒకటే కోరిక కోరారు. పురుషుల టీమ్ తరహాలో కనీసం సెమీఫైనల్ వరకైనా వెళితే తాము సంతోషిస్తామని చెబుతూ సాగనంపారు.
సునామీ వీడియోతో...
లీగ్ దశలో తొలి రెండు మ్యాచ్‌లలో న్యూజిలాండ్‌పై 2–1తో, మెక్సికోపై 4–0తో జపాన్ నెగ్గింది. ఆ తర్వాత మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో 0–2తో పరాజయం ఎదురైంది. అయితే తొలి రెండు ఫలితాలతో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. నాకౌట్ పోరులో జర్మనీ రూపంలో పటిష్ట ప్రత్యర్థి ఎదురైంది. దేహదారుఢ్యంలో జపాన్‌కంటే ఎంతో బలమైన జట్టు (ఆటగాళ్ల సగటు ఎత్తు 6.2 అడుగులు), పైగా ఆతిథ్య టీమ్, డిఫెండింగ్ చాంపియన్ కూడా. దాంతో జపాన్ శిబిరంలో ఆందోళనే ఉంది. ఈ సమయంలో కోచ్ నోరియో ససాకీ ఒక పని చేశాడు.
మీలో స్ఫూర్తి నింపేందుకు ఇంతకంటే ఏమీ చేయలేను అంటూ కొద్ది రోజుల క్రితం జపాన్‌లో వచ్చిన సునామీ వీడియోను చూపిం చాడు. అది తారకమంత్రంలా పని చేసింది. అద నపు సమయంలో గోల్ చేసి 1–0తో జర్మనీని బోల్తా కొట్టించింది. మ్యాచ్‌లో నాలుగు ఎల్లో కార్డులు ఎదురైనా జపాన్ పట్టుదలతో పోరాడటం విశేషం. ఈ గెలుపుతో జపాన్ జనం మొత్తం తమ జట్టును అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ వారిలో ఉత్తేజం నింపారు. అదే జోరులో సెమీస్‌లో స్వీడన్‌ను 3–1తో ఓడించి ఫైనల్ చేరింది.
ఆఖరి పోరులో అద్భుతం...
మహిళల ఫుట్‌బాల్‌లో తిరుగులేని జట్టయిన అమెరికాతో తుది పోరుకు జపాన్ సిద్ధమైంది. అప్పటికే అమెరికా రెండుసార్లు వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది. పైగా ఇరు జట్ల మధ్య జరిగిన గత 25 మ్యాచ్‌లలో 22 సార్లు ఓడిపోయిన జపాన్... 3 సార్లు మాత్రం ‘డ్రా’తో గట్టెక్కగలిగింది. ఇలాంటి నేపథ్యంలో ఫుట్‌బాల్ ప్రపంచం ఏకపక్ష ఫలితం గురించే తప్ప ఊహామాత్రంగా కూడా సంచలనం గురించి ఆలోచించలేదు. గంటసేపు హోరాహోరీగా సమరం సాగిన తర్వాత 69వ నిమిషంలో అమెరికా గోల్‌తో శుభారంభం చేసింది. అయితే 81వ నిమిషంలో గోల్‌తో జపాన్ దానిని సమం చేయగలిగింది. కానీ అదనపు సమయంలోని 104వ నిమిషంలో అమెరికా 2–1తో మళ్లీ ఆధిక్యంలోకి దూసుకుపోయింది. కానీ జపాన్ మహిళలు పట్టుదలగా పోరాడారు.
అయితే కెప్టెన్ హŸమారే సవా 117వ నిమిషంలో చేసిన అద్భుత గోల్‌తో స్కోరు మళ్లీ 2–2తో సమమైంది. దాంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లింది. జపాన్ గోల్ కీపర్ అయుమి కై హోరి అమెరికాకు అడ్డు గోడగా నిలవగా... చివరకు 3–1తో గెలుపు జపాన్ సొంతమైంది. ‘ఫిఫా’ టోర్నీని గెలుచుకున్న తొలి ఆసియా జట్టుగా ఈ జపాన్ చరిత్ర సృష్టించింది. ఆనందభాష్పాలతో అమ్మాయిలు మైదానంలో చిందులేయగా... జపాన్ దేశం మొత్తం ఈ విజయంతో పులకించిపోయింది. నాలుగు నెలలుగా ఒక్క శుభవార్త కూడా వినని మా దేశంలో ఇదో పండగ రోజు అంటూ అక్కడి అభిమానులు వేడుకలు జరుపుకున్నారు. ప్రతీ క్రీడా విజయం ఆయా జట్టుకు ప్రత్యేకమైనదే కావచ్చు కానీ దేశంలో జోష్ పెంచిన జపాన్ మహిళల విజయం ఎప్పటికీ చిరస్మరణీయం.
Comments
Please login to add a commentAdd a comment