సఫారీ సవాల్‌! | special story to india - south africa tour | Sakshi

సఫారీ సవాల్‌!

Dec 27 2017 12:40 AM | Updated on Sep 18 2018 8:48 PM

special  story to  india - south africa tour - Sakshi

వ్యవధి 25 ఏళ్లు... ఆడింది 17 టెస్టులు... గెలిచింది రెండే... ‘డ్రా’ 7... సఫారీ గడ్డపై టెస్టుల్లో భారత క్రికెట్‌ జట్టు గణాంకాలివీ! మచ్చిక కాని పచ్చిక పిచ్‌లు... రివ్వున దూసుకొచ్చే  పేస్‌ బంతులు... స్వింగ్‌తో మింగేసే బౌలర్లు... ఓ పట్టాన కొరుకుడు పడని బ్యాట్స్‌మన్‌... గాల్లో తేలిపోతూ మరీ క్యాచ్‌లు అందుకునే ఫీల్డర్లు... వెరసి దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ విజయం మనకు తీరని కలే! రెండు జట్ల మధ్య ఆరు సిరీస్‌లు జరిగితే అన్నింట్లో టీమిండియాకు రిక్తహస్తమే. 

మొన్నటి కపిల్‌ దేవ్, అజహరుద్దీన్‌ నుంచి... నిన్నటి సచిన్‌ టెండూల్కర్, జహీర్‌ ఖాన్‌... ప్రస్తుత కోహ్లి, పుజారా వరకు ఎంతటి మేటి ఆటగాళ్లున్నా సఫారీ గడ్డపై వారి పోరాటం సరిపోవడంలేదు. ఇదంతా గతం. కొత్త ఏడాదిలో... నూతనోత్తేజంతో భారత్‌ ప్రొటీస్‌ను ఎదుర్కోనుంది. దాదాపు రెండు నెలలు కొనసాగే పర్యటన కోసం నేడు భారత జట్టు దక్షిణాఫ్రికాకు బయలుదేరనుంది. జనవరి 5న కేప్‌టౌన్‌లో మొదలయ్యే తొలి మ్యాచ్‌తో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభమవుతుంది.
–సాక్షి క్రీడావిభాగం


వర్ణ వివక్ష కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌లో పాల్గొనకుండా దక్షిణాఫ్రికాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన తర్వాత అక్కడ పర్యటించిన తొలి జట్టు భారతే. ఈ పాతికేళ్లలో నాలుగేళ్లకోటి చొప్పున ఆరు సిరీస్‌లు జరిగాయి. ప్రస్తుతం ఏడోది.  మూడు దశాబ్దాలు... మూడు దశలు: 1992–99, 2000–09, 2010.. రెండు జట్ల మధ్య మూడు దశాబ్దాల్లో ఆరు సిరీస్‌లు నిర్వహించారు. తొలి రెండు దశాబ్దాల్లో భారత్‌ రెండేసి సార్లు (1992–93, 1996–97, 2001–02, 2006–07) అక్కడ పర్యటించింది. ఈ దశాబ్దంలో మా త్రం మూడోసారి (2010–11, 2013–14, 2017–18) వెళ్తోంది. ఈ లెక్కన ఇది అరుదైన సందర్భమే. 
4, 3, 2, 3, 3, 2: మొత్తం సిరీస్‌లలో ఎక్కువ టెస్టులు ఆడింది 1992–93లోనే. మొదటిదైన ఆ సిరీస్‌లో మొత్తం 4 మ్యాచ్‌లు నిర్వహించారు. మూడు సార్లు 3, రెండుసార్లు 2 టెస్టుల షెడ్యూల్‌లో పాల్గొన్నారు. ఇప్పుడు కూడా మూడు టెస్టుల సిరీసే జరగనుంది. వాస్తవానికి ఈ పర్యటనలోనూ 4 టెస్టులనుకున్నారు. కానీ... వన్డేల సంఖ్య పెంచి ఒక టెస్టును తగ్గించారు.   గెలుపు బోణీ 15 ఏళ్లకు: కపిల్, రవిశాస్త్రి, అజహరుద్దీన్, సచిన్,  కుంబ్లే, శ్రీనాథ్, ద్రవిడ్, గంగూలీ, లక్ష్మణ్, హర్భజన్‌... ఇలా జట్టులో మహామహులున్నా సఫారీలను సొంతగడ్డపై ఓడించేందుకు మనకు దాదాపు 15 ఏళ్లు పట్టింది. 1992 నుంచి తొమ్మిది మ్యాచ్‌లాడి నాలుగు ఓడిన భారత్‌ 2006 పర్యటనలో కానీ గెలుపు రుచి చూడలేకపోయింది. ఈ పర్యటనలో తొలి టెస్టులోనే 123 పరుగులతో దక్షిణాఫ్రికాను ఓడించింది. అప్పటి జట్టు కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కావడం విశేషం.
 
సిరీస్‌ సిరీస్‌కు సారథి మారారు: తొలి పర్యటనలో అజహర్, రెండో దఫాలో సచిన్, మూడోసారి గంగూలీ, నాలుగో విడతలో ద్రవిడ్, తర్వాత రెండు పర్యటనలకు ధోని, ఇప్పుడు విరాట్‌ కోహ్లి... ఇలా ధోని మినహా సిరీస్, సిరీస్‌కు భారత సారథులు మారారు. అప్పట్లో మన కెప్టెన్ల మార్పు తరచూ జరుగుతుండటంతో పాటు నాలుగేళ్లకు పైగా విరామం అనంతరం సిరీస్‌లు ఉండటమూ ఇందుకు కారణమయ్యాయి. 
క్లీన్‌స్వీప్‌ల్లేవ్‌: దక్షిణాఫ్రికా సొంతగడ్డపై ఎంతటి గట్టి జట్టైనా... బలాబలాల్లో ఎంత తేడా ఉన్నా అక్కడ భారత్‌ ఎప్పుడూ క్లీన్‌స్వీప్‌ కాకపోవడం గమనార్హం. నాలుగు మ్యాచ్‌ల మొదటి సిరీస్‌లో ఏకంగా మూడు ‘డ్రా’ అయ్యాయి. ఒకసారి 0–2తో, మరోసారి 1–2తో, రెండు సార్లు 0–1తో సిరీస్‌లు కోల్పోయింది. 2010–11లో మాత్రం 1–1తో సిరీస్‌ సమమైంది. ప్రొటీస్‌పై భారత్‌ విజయం సాధించిన టెస్టుల్లో మొదటిది సిరీస్‌ తొలి మ్యాచ్‌లో కాగా... రెండోది రెండో మ్యాచ్‌లో కావడం విశేషం. అన్నిసార్లు  మొదట బ్యాటింగ్‌ చేయడం గమనార్హం. 

ఆ ఇద్దరు మినహా: 2013 డిసెంబరులో దక్షిణాఫ్రికాలో టెస్టు మ్యాచ్‌ ఆడిన వారిలో ధోని, జహీర్‌ ఖాన్‌ మినహా మిగతావారంతా ప్రస్తుత జట్టులో ఉన్నారు. ఆశ్చర్యకరంగా... దాదాపు నాటి బ్యాటింగ్‌ ఆర్డరే నేడూ కొనసాగనుంది. 

వన్డేల్లోనూ అంతంతే: సఫారీ గడ్డపై టెస్టు ఫార్మాట్‌తో పోలిస్తే వన్డేల్లో కూడా భారత ప్రదర్శన గొప్పగా లేదు. దక్షిణాఫ్రికాతో మొత్తం 28 వన్డేల్లో ఆడగా... కేవలం ఐదింటిలో భారత్‌ గెలిచింది. 21 పరాజయాలు ఎదురయ్యాయి. రెండు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. 1992 తొలి పర్యటనలో ఏడు వన్డేలు జరిగాయి. రెండింటిలో భారత్‌ నెగ్గి, ఐదింటిలో ఓడిపోయింది. 1997లో ఐదు మ్యాచ్‌లు జరగ్గా... భారత్‌ నాలుగింటిలో ఓటమి పాలైంది. మరో మ్యాచ్‌ రద్దయింది. 2001లో నాలుగు వన్డేలు జరిగితే... ఒక మ్యాచ్‌లో గెలిచి, మూడింటిని చేజార్చుకున్నాం. 2006లో నాలుగు మ్యాచ్‌లు జరగ్గా... నాలుగింటిలోనూ భారత్‌కు చుక్కెదురైంది. 2011లో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ రెండింటిలో నెగ్గి, మూడింటిలో ఓడింది. 2013లో మూడు వన్డేలు నిర్వహించగా... రెండింటిలో భారత్‌ ఓడింది. మరో మ్యాచ్‌ రద్దయింది.  టి20 మ్యాచ్‌ల విషయానికొస్తే రెండుజట్ల మధ్య మూడు మ్యాచ్‌లు జరిగాయి. రెండింటి లో భారత్, మరో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలిచాయి. 

 సిరీస్‌ షెడ్యూల్‌ 
తొలి టెస్టు: జనవరి 5–9 (కేప్‌టౌన్‌) 
రెండో టెస్టు: జనవరి 13–17 (సెంచూరియన్‌) 
మూడో టెస్టు: జనవరి 24–28 (జోహన్నెస్‌బర్గ్‌) 
తొలి వన్డే: ఫిబ్రవరి 1 (డర్బన్‌) 
రెండో వన్డే: ఫిబ్రవరి 4 (సెంచూరియన్‌) 
మూడో వన్డే: ఫిబ్రవరి 7 (కేప్‌టౌన్‌) 
నాలుగో వన్డే: ఫిబ్రవరి 10 (జోహన్నెస్‌బర్గ్‌) 
ఐదో వన్డే: ఫిబ్రవరి 13 (పోర్ట్‌ ఎలిజబెత్‌) 
ఆరో వన్డే: ఫిబ్రవరి 16 (సెంచూరియన్‌) 
తొలి టి20: ఫిబ్రవరి 18 (జోహన్నెస్‌బర్గ్‌) 
రెండో టి20: ఫిబ్రవరి 21 (సెంచూరియన్‌) 
మూడో టి20: ఫిబ్రవరి 24 (కేప్‌టౌన్‌)  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement