అతడు జట్టులోకి రావడంతో భారత పేస్ పదును పెరిగిందన్నారు.. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయడంతో స్వింగ్ సుల్తాన్ అన్నారు.. ఎవరూ ఊహించని విధంగా ఆస్ట్రేలియాను గజగజ వణికించడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు.. పాకిస్తాన్‌ను వారి గడ్డపై గడగడలాడించడంతో ఔరా అన్నారు.. అరవీర భయంకర బ్యాట్‌మెన్ సైతం భయపడే అక్తర్ బౌలింగ్‌లో వీర బాదుడు బాదడంతో సంభ్రమాశ్చర్యంలో మునిగిపోయారు.. కష్టకాలంలో, అవసరమైన సమయంలో ఓపెనర్‌గా వచ్చి ఆదుకోవడంతో సలాం చేశారు.. కపిల్ దేవ్ తర్వాత టీమిండియాకు దొరికిన ఆల్‌రౌండర్ అన్నారు. బౌలర్‌గా వచ్చి ఆల్‌రౌండర్‌గా ఎదిగి చివరికి టీమిండియాలో కనుమరుగయ్యాడు. అతడే టీమిండియా వెటరన్ క్రికెటర్, స్వింగ్ సుల్తాన్ ఇర్ఫాన్ పఠాన్..
‘చరిత్రలో నిలిచిపోవాలన్నా, చరిత్ర సృష్టించాలన్నా వందేళ్లు బతకాల్సిన అవసరం లేదు ఒక్క రోజు బతికినా చాలు’ అన్నట్లు ఇర్ఫాన్ పఠాన్ కెరీర్ సాగింది. అతడు క్రికెట్ ఆడింది కొన్నేళ్లే అయినా ప్రతి నిత్యం వార్తల్లో నిలిచేవాడు. ప్రతి మ్యాచ్‌లో అటు బంతితో.. లేకపోతే బ్యాట్‌తో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. టీమిండియా మాజీ సారథి కపిల్ దేవ్, శ్రీలంక దిగ్గజ బౌలర్ చమింద వాస్‌ల శైలి పోలి ఉండే అతడి బౌలింగ్ అందరినీ ఆకట్టుకునేది. ఇర్ఫాన్ లాంటి బౌలర్‌లు తమ గల్లీకొకడు ఉన్నాడన్న పాక్ క్రికెటర్ల వెకిలి చేష్టలకు తన ఆటతో దిమ్మతిరిగే సమాధానమిచ్చాడు. ఏకంగా టెస్టుల్లో తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్(సల్మాన్ భట్, యునిస్ ఖాన్, మహ్మద్ యూసఫ్) వికెట్ సాధించిన ఏకైక బౌలర్‌గా పఠాన్ నిలిచాడు. ఇప్పటికీ ఆ ఘనత చెక్కుచెదరకుండా ఉంది. (చదవండి: క్రికెట్‌కు పఠాన్ గుడ్‌బై )
Cricket Fan Never Forget This! 🔥👌
Hat trick Vs Pakistan, 2004 ❤
Happy Retirement @IrfanPathan ❤#irfanpathan pic.twitter.com/8rBECjGmd8
— S O B U J ❤ (@VKSobuj18) January 4, 2020
2004లో లైమ్‌లైట్‌లోకి ..
2003 చివర్లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈలెఫ్టార్మ్ పేసర్ ఆసీస్ బ్యాట్స్‌మన్ మాథ్యూ హెడెన్, రికీ పాంటింగ్‌ల పాలిట విలన్‌గా మారాడు. ముఖ్యంగా రికీ పాంటింగ్‌ను ఇబ్బందులకు గురిచేస్తూ సాగిన అతడి బౌలింగ్ క్రికెట్ అభిమానులకు ఇంకా గుర్తుండే ఉంటుంది. ఇక ఆతర్వాత ఆసీస్‌తోనే జరిగిన వన్డే సిరీస్‌లో ఓ మోస్తారుగా రాణించాడు. అయితే అనంతరం 2004లో పాకిస్తాన్ పర్యటనతో ఇర్ఫాన్ పఠాన్ పూర్తిగా లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. ఈ పర్యటనలో పాక్‌కు కొరకరాని కొయ్యగా మారాడు. ఈ సిరీస్ ఆసాంతం ఇర్ఫాన్‌తో పాటు లక్ష్మీపతి బాలాజీల పేర్లు క్రికెట్ ప్రపంచంలో మారుమోగాయి. అటు బంతితో.. ఇట్టు జట్టుకు అవసరమైనప్పుడల్లా బ్యాట్‌తో రాణించి అప్పట్లో సంచలనం సృష్టించారు. ఇదే జోరును పఠాన్ కొన్నేళ్లపాటు కొనసాగించాడు. అయితే బాలాజీ మాత్రం గాయం కారణంగా జట్టుకు దూరమై తిరిగి పూర్వపు లయను అందుకోవడంలో విఫలమై టీమిండియాలో పూర్తిగా చోటు కోల్పోయాడు.
చోటు కోల్పోయిన ప్రతీసారి..
టీమిండియాలో చోటు కోల్పోయిన ప్రతీ సారి గోడకు కొట్టిన బంతి వలే ఘనంగా పునరాగమనం చేసేవాడు. అతడు తిరిగొచ్చిన ప్రతీ మ్యాచ్‌లో అత్యద్భుతంగా రాణించేవాడు. 2005 తర్వాత పఠాన్ గడ్డుకాలాన్ని అనుభవించాడు. వన్డే, టెస్టుల్లో చోటు కోల్పోయాడు. అయితే తిరిగి ఫామ్‌ను అందుకుని జట్టులోకి వెంటనే తిరిగొచ్చేవాడు. ఇక కెరీర్ మొదట్లోనే అడపదడపా బ్యాటింగ్‌లో రాణించడం అలవాటు చేసుకున్న ఈ స్వింగ్ సుల్తాన్ అరంగేట్ర టెస్టు సిరీస్‌లోనే అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అనంతరం 2007లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సెంచరీతో చెలరేగిపోయాడు. ఇక బంతితో పాటు బ్యాట్‌తో కూడా పఠాన్ ఆకట్టుకోవడంతో అతడిని కొన్ని సిరీస్‌లలో ఓపెనర్‌గా కూడా ప్రయోగించారు. ముఖ్యంగా న్యూజిలాండ్ సిరీస్‌లో సచిన్‌కు గాయం, ఓపెనర్ల సమస్యతో టీమిండియా సతమతమవుతున్న సమయంలో ఇర్ఫాన్ కొన్ని మ్యాచ్‌లు ఓపెనర్‌గా దిగాడు.
చాపెల్ ఎంట్రీ.. పఠాన్ భవిత్యం అయోమయం
గ్రెగ్ చాపెల్ టీమిండియా కోచ్‌గా 2005లో బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియాలో విపత్కరమైన పరిణామాలు ఏర్పడ్డాయి. క్రికెటర్లకు మిలటరీ ట్రైనింగ్ క్యాంప్ పెట్టి రచ్చరచ్చ చేశాడు. ఇక ఇర్ఫాన్ పఠాన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన చాపెల్ అతడిని ఉత్తమమైన ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాడు. అయితే చాపెల్ సూచనలతో ఇర్ఫాన్ పూర్తిగా తన అసలు ఆట స్వభావాన్ని పూర్తిగా మర్చిపోయాడు. కెరీర్ ఆరంభంలో అతడిలో ఎలాంటి బౌలింగ్ చూశామో ఆ వేడి క్రమక్రమేనా తగ్గుతూ వచ్చింది. బౌలింగ్ కంటే బ్యాటింగ్‌పై పఠాన్ దృష్టి పెట్టేలా చేశాడు చాపెల్. దీంతో ఓ సమయంలో పఠాన్ బౌలర్ కంటే బ్యాట్స్‌మన్‌గా మారిపోయాడు. ఓ దశలో పఠాన్ బ్యాట్స్‌మనా లేక బౌలరా అనే సందిగ్దత నెలకొంది. అయితే చాపెల్ కోచ్‌గా తప్పుకున్న తర్వాత తిరిగి బౌలింగ్‌పై దృష్టి పెట్టిన ఈ బరోడా క్రికెటర్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు.
ఏదో అనుకుంటే.. ఇంకేదో అయింది..
అయితే అడపదడపా రాణిస్తూ జట్టులో కొనసాగినప్పటికీ ఎలాంటి మెరుపులు మెరిపించలేకపోయాడు. దీంతో కపిల్ దేవ్‌లా అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా, చరిత్రలో నిలిచిపోయే ప్రపంచస్థాయి దిగ్గజ బౌలర్‌గా క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని అందరూ భావించారు. కానీ యువ క్రికెటర్లతో పోటీ పడలేక, మునపటి ఫామ్‌ను అందుకోక జట్టులో చోటు కోల్పోయి, కనీసం వీడ్కోలు మ్యాచ్ కూడా అవకాశం లేక సింపుల్‌గా రిటైర్మైంట్ ప్రకటించాడు. ఏది ఏమైన కొందరి సూచనలతో తన సహజసిద్దమైన ఆటను కోల్పోయి ప్రపంచం మర్చిపోయిన ఓ సాదాసీదా బౌలర్‌గా క్రికెట్ నుంచి నిష్క్రమించాడు.
Comments
Please login to add a commentAdd a comment