
ఫలితాన్ని ఒంటిచేత్తో మార్చేసే స్టార్లు లేరు...! ఒకరిద్దరు తప్ప మ్యాచ్‌ను తిప్పేసే వీరులు లేరు...! జట్టుగా, ఆటతీరుపరంగానూ పెద్దగా పేరు లేదు...! ...అయినా విదర్భ అద్భుతం చేసింది. రంజీ గెలిచింది..!
సాక్షి క్రీడా విభాగం: ముంబై, మహారాష్ట్ర వంటి జట్లున్న మహారాష్ట్రలో మూడో జట్టుగా విదర్భ అనామకమైనదే. దీనికి తగ్గట్లే ఈ ప్రాంతం నుంచి టీమిండియాకు ఆడింది ఇద్దరే. మొదటివాడు పేసర్ ఉమేశ్‌యాదవ్ కాగా రెండో వ్యక్తి ప్రస్తుత విదర్భ కెప్టెన్ ఫైజ్ ఫజల్. ఉమేశ్ గురించి చెప్పేదేమీ లేకున్నా... ఫజల్ ప్రాతినిధ్యం వహించింది మాత్రం ఒక్క వన్డేలోనే. అదీ జింబాబ్వేతో. వీరుకాక సగటు క్రికెట్ అభిమానికి చూచాయగా తెలిసిన జట్టు సభ్యుడి పేరే లేదు. కానీ సమష్టిగా ఆడిన విదర్భ పటిష్ఠ జట్లనూ మట్టి కరిపించింది. టైటిల్ ఫేవరేట్లలో ఒకటిగా కాదు కదా... కనీస పోటీదారుగానైనా పరిగణించని దశ నుంచి విజేతగా నిలిచింది.
పునాది అక్కడే...
దాదాపు పదేళ్ల నుంచి విదర్భ క్రమక్రమంగా ఎదుగుతోంది. ఇందుకు పునాది వేసింది బీసీసీఐ, ఐసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించిన శశాంక్ మనోహర్. ఈయన ఇక్కడివారే కావడంతో తమ ప్రధాన నగరమైన నాగ్‌పూర్‌లోని జామ్‌తాలో అత్యుత్తమ స్టేడియం నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు. 2008లో స్టేడియం నిర్మాణం తర్వాత విదర్భ జట్టులో ప్రొఫెషనలిజం మరింత పెరిగింది. జూనియర్ స్థాయి క్రికెటర్లకు మంచి అవకాశాలు వచ్చాయి. వారిలో ప్రతిభ గలవారంతా రంజీ స్థాయి వరకు దూసుకొచ్చారు. ఇది జట్టుగా విదర్భకు ఎంతో మేలు చేసింది.
రాతమార్చింది వారే...
చంద్రకాత్ పండిట్, వసీం జాఫర్... భారత జట్టు మాజీ ఆటగాళ్లైన ఈ ముంబైకర్లు విదర్భ తాజా ప్రదర్శనలో కీలక పాత్ర పోషించారు. ఆటగాడిగా, కోచ్‌గా ముంబై రంజీ ట్రోఫీలు గెలవడంలో కీలక పాత్ర పోషించిన చంద్రకాంత్‌ను కొన్ని కారణాలతో గత సీజన్ తర్వాత ముంబై తప్పించింది. ఆ కసి నంతా అతను విదర్భను తీర్చిదిద్దడంపై చూపాడు. ఆటగాళ్లను ప్రోత్సహించడం, జట్టులో స్ఫూర్తినింపడంతో పాటు టైటిల్ గెలవాలన్న కోరికను మొదటి రోజు నుంచే నూరిపోశాడు. ఫైనల్లో 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వాడ్కర్ అద్భుత శతకం చేయడం, తమకంటే మెరుగైన కర్ణాటకను తీవ్ర ఉత్కంఠ మధ్య సెమీఫైనల్లో ఓడించిన తీరే విదర్భ మనోస్థైర్యాన్ని చాటిచెబుతోంది. ఇక ఆటగాడు–ప్రేరకుడిగా జట్టులోకి వచ్చిన వసీం జాఫర్, అయిదు శతకాలు చేసిన కెప్టెన్ ఫజల్ కీలక సమయాల్లో రాణించి తమ అనుభవానికి సార్థకత చేకూర్చారు.
గెలుపు గుర్రం గుర్బానీ...
27... క్వార్టర్స్, సెమీస్, ఫైనల్స్‌లో పేసర్ రజనీష్ గుర్బానీ తీసిన వికెట్లు. ఇదే సమయంలో జట్టులోని మిగతా బౌలర్లు తీసిన వికెట్లు 32 కావడం గమనార్హం. ముఖ్యంగా సెమీస్, ఫైనల్స్‌లో అదరగొట్టి తురుపుముక్కగా నిలిచాడు. మూడు నాకౌట్ మ్యాచ్‌ల్లోనూ ఇతడే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ కావడం విశేషం. ఈ జోరు చూస్తే 24 ఏళ్ల గుర్బానీకి ముందుముందు మంచి అవకాశాలు తలుపుతట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
మేల్కొలుపు... ప్రేరణ
కలిసికట్టుగా ఆడితే ఏ జట్టైనా రంజీట్రోఫీని అందుకోవచ్చని విదర్భ విజయం నిరూపించింది. ఇదే సమయంలో అన్ని వనరులూ ఉండి ముందుకెళ్లలేకపోతున్న హైదరాబాద్, ఆంధ్రవంటి జట్లకు ఈ గెలుపు ఓ పాఠమే. మరోవైపు ట్రోఫీని పదులసార్లు సొంతం చేసుకుని రంజీ రారాజుగా పేరొందిన ముంబైని సవాల్ చేసే జట్లు క్రమంగా పెరుగుతున్నాయి. గత ఐదు సీజన్లలో ఒక్కసారి మాత్రమే ఆ జట్టు విజేతగా నిలవడమే ఇందుకు నిదర్శనం.
Comments
Please login to add a commentAdd a comment