ముందుంది అసలు పరీక్ష | Spin vital to India's early World Twenty20 success | Sakshi
Sakshi News home page

ముందుంది అసలు పరీక్ష

Published Thu, Mar 27 2014 12:49 AM | Last Updated on Sat, Sep 2 2017 5:12 AM

ముందుంది అసలు పరీక్ష

ముందుంది అసలు పరీక్ష

 మిడిలార్డర్ ఫామ్ ఏంటో తెలియదు
 ఛేజింగ్‌లో బౌలర్లు ఏం చేస్తారో!
 ధోనిసేన ముందు బోలెడు ప్రశ్నలు
 
 వరుసగా రెండు పెద్ద జట్లపై మ్యాచ్‌లు గెలిచాం. ఇక బంగ్లాదేశ్‌పై గెలిస్తే సెమీస్ బెర్త్ ఖాయమైనట్టే. కానీ ధోనిసేన పూర్తి సత్తాకు ఇప్పటిదాకా టి20 ప్రపంచకప్‌లో పరీక్ష ఎదురుకాలేదు. రాబోయే రెండు లీగ్ మ్యాచ్‌ల్లో సరిజేసుకోవాల్సిన అంశాలూ ఉన్నాయి.
 
 ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
 పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలిస్తున్నాయి. అమిత్ మిశ్రా, అశ్విన్, రవీంద్ర జడేజా సూపర్ ఫామ్‌లో ఉన్నారు. దీంతో తొలి రెండు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్, వెస్టిండీస్‌లపై భారత్ సులభంగా గెలిచింది.
 
 
  ప్రస్తుతం బంగ్లాదేశ్ ఫామ్‌ను పరిశీలిస్తే ఆ జట్టుపై గెలవడం కూడా సమస్య కాదు. ఈ అంశాలతో ధోనిసేన సంబరపడితే సరిపోదు. నిజానికి తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్‌కు ఎలాంటి పరీక్షా ఎదురు కాలేదు. బౌలర్లు రాణించి ప్రత్యర్థులను తక్కువ స్కోర్లకు పరిమితం చేయడంతో సమస్యలు బయటపడలేదు. కానీ రేపు సెమీస్ దశలో భారత్‌కు ఈ మ్యాచ్‌లకు భిన్నమైన పరిస్థితి ఎదురైతే ఎలా?
 
 టాస్ గెలిచిన జట్లన్నీ బౌలింగ్ ఎంచుకుంటున్నాయి. భారత్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో బౌలింగ్  ఎంచుకుంది. తర్వాతి దశలో రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయాల్సి వస్తే ఎలా? మంచు ప్రభావాన్ని బౌలర్లు ముఖ్యంగా స్పిన్నర్లు ఎలా అధిగమిస్తారు? దీనికి సమాధానం దొరకాలంటే రానున్న రెండు లీగ్ మ్యాచ్‌ల్లో ఒక్కసారైనా రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయాలి.
 మనం తొలుత బ్యాటింగ్ చేసి తక్కువ స్కోరుకే పరిమితమైతే బౌలర్లు ఎలా నిలువరిస్తారు? ఈ పిచ్‌ల మీద భారీ హిట్టర్లున్న జట్లను ఎలా నియంత్రిస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం ఆలోచించుకోవాలి.
 
 రెండు మ్యాచ్‌ల్లోనూ పెద్ద లక్ష్యాలు ఎదురుకాలేదు. కాబట్టి భారత బ్యాట్స్‌మెన్ పూర్తి సామర్థ్యం బయటకు తీయాల్సిన అవసరం రాలేదు. ఒకవేళ భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి వస్తే ఎలా?
 ఓపెనర్లలో ఒకరు హిట్టయితే రెండో వాళ్లు విఫలమవుతున్నారు. దీనినీ అధిగమించాలి.
 మిడిలార్డర్ పరిస్థితి ఏంటనేది ఇప్పటిదాకా తెలియదు. ఒక్క మ్యాచ్‌లోనూ ధోని, జడేజాలకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో చిన్న లక్ష్యాన్ని ఛేదించడానికి కూడా చివరి ఓవర్ వరకూ ఆపసోపాలు పడ్డారు.
 
 ఇక యువరాజ్ ఫామ్ సంగతి ఎవరికీ అంతు బట్టడం లేదు. ఒక్కసారి కుదురుకుంటే యువీ మ్యాచ్ విన్నర్ అంటూ ధోని మద్దతు ఇస్తున్నా... విండీస్‌తో మ్యాచ్‌లో అతని ఆట మరీ దారుణంగా ఉంది. ప్రాక్టీస్ సెషన్‌లోనూ తన బాడీ లాంగ్వేజ్ పాజిటివ్‌గా కనిపించడం లేదు. ముందు యువీని గాడిలో పెట్టాలి.
 
 క్యాచ్‌లు కూడా పెద్ద సమస్యగానే ఉంది. ఇది అన్ని జట్లకూ సమస్యగా కనిపిస్తున్నా... మనం దీనిని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బౌండరీ లైన్ల దగ్గర క్యాచ్‌లు పదే పదే వదిలేస్తున్నారు. లైటింగ్ సరిగా లేకపోవడం దీనికి ఓ కారణం అంటున్నారు. కాబట్టి ఒకరోజు సాయంత్రం లైట్ల వెలుతురులో ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేసుకుంటే మేలు.
 
 స్పిన్నర్లు రాణించడం వల్ల రెండు మ్యాచ్‌లు సులభంగా గెలిచాం. మిడిలార్డర్‌కు ఇంకా పూర్తి పరీక్ష ఎదురుకాలేదు. అయితే దీనిపై మాకు పెద్దగా ఆందోళన లేదు. అందరూ ఫామ్‌లోనే కనిపిస్తున్నారు.
 
 యువరాజ్ ఒక్కడూ గాడిలో పడాలని భావించినందునే తను వెస్టిండీస్‌పై ఎక్కువసేపు మైదానంలో గడిపాడు. క్యాచ్‌లు మాత్రం తీవ్రమైన సమస్య. ఇలా ఎందుకు జరుగుతుందనే విషయాన్ని విశ్లేషిస్తున్నాం. ముఖ్యంగా డీప్‌లో అందరూ మంచి ఫీల్డర్లే ఉంటున్నారు. కాబట్టి లైట్లో, మరేదైనా సమస్య ఉందో చూడాలి.    
 - ధోని
 
 పంజాబీ సంగీతం... యువీ హిట్టింగ్
 రెండు రోజుల విశ్రాంతి తర్వాత భారత క్రికెటర్లు బుధవారం ప్రాక్టీస్ సెషన్‌కు వచ్చారు. జట్టులోని ఆటగాళ్లంతా మూడు గంటల పాటు ఢాకా క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేశారు. మొత్తం జట్టు సభ్యులంతా ఉల్లాసంగా కనిపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రాక్టీస్‌కు మ్యూజిక్ సిస్టమ్ తెచ్చారు. ప్రాక్టీస్ న డుస్తున్నంతసేపు పంజాబీ పాటలు పెట్టారు. దలేర్ మెహందీ పాటలకు ఒకరిద్దరు స్టెప్పులేశారు.
 
 ఎప్పటిలాగే 40 నిమిషాల పాటు ఆటగాళ్లంతా ఫుట్‌బాల్ ఆడారు. ఆ తర్వాత నెట్స్‌కు వెళ్లారు.
 తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న యువరాజ్ సింగ్... గత సెషన్లతో పోలిస్తే ఈసారి సెషన్‌లో చాలా ఉల్లాసంగా కనిపించాడు. నెట్స్‌లో అన్నీ భారీ షాట్లు ఆడాడు. కొద్దిసేపు పేస్ బౌలర్ల బౌలింగ్‌లో ఆడాక... స్పిన్నర్ల నెట్స్‌లోకి వచ్చి భారీ హిట్టింగ్ చేశాడు.
 
 మిగతా అందరూ బాగా కనిపించినా... జడేజా మాత్రం బ్యాటింగ్ చేయడంలో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. దీంతో ఫ్లెచర్ కొద్దిసేపు జడేజాతో చర్చించాడు.
 
 భువనేశ్వర్, షమీలతో బౌలింగ్ కోచ్ డేవిస్ సుదీర్ఘంగా చర్చలు జరిపాడు. ఈ ఇదరూ ఎక్కువగా బంతిని స్వింగ్ చేయడం, యార్కర్లపై దృష్టి పెట్టారు.
 
 ఒక బ్యాట్స్‌మన్ బొమ్మ (డమ్మీ) ఒక నెట్‌లో పెట్టి బౌలింగ్ చేయించారు. అయితే రెగ్యులర్ బౌలర్లు దీనిని వాడలేదు. పార్ట్‌టైమ్ బౌలర్లు కోహ్లి, రైనా ఈ నెట్స్‌లో బౌలింగ్ చేయడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement