అథ్లెట్ జైషా ఆరోపణలపై విచారణ కమిటీ
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో మారథాన్ అథ్లెట్ ఓపీ జైషాకు రేసులో కనీసం మంచి నీళ్లు కూడా దొరకని ఘటనపై కేంద్ర క్రీడా శాఖ విచారణకు ఆదేశించింది. ఇందుకోసం క్రీడా శాఖ సంయుక్త కార్యదర్శి ఓంకార్ కేడియా, డెరైక్టర్ వివేక్ నారాయణ్‌లతో కూడిన ఇద్దరు సభ్యుల కమిటీని నియమించింది. వారం రోజుల్లో వీరు నివేదిక అందించాల్సి ఉంది. ఒలింపిక్స్‌లో జరిగిన మహిళల మారథాన్ పోటీలో పాల్గొన్న ఓపీ జైషాకు కనీసం మంచినీళ్లను కూడా అందుబాటులో ఉంచలేదు. సుదీర్ఘమైన ఈ పోటీ సందర్భంగా అథ్లెట్ల కోసం ప్రతీ 2.5 కి.మీ దూరంలో ఆయా దేశాలు ఆహారం, నీళ్లు, ఎనర్జీ డ్రింక్స్‌తో కూడిన స్టాళ్లను ఏర్పాటు చేస్తుంటాయి.
కానీ భారత్ స్టాల్స్ అన్నీ ఖాళీగా దర్శనమివ్వడంతో జైషా పరిస్థితి దారుణంగా తయారయ్యింది. ఓ వైపు విపరీతమైన ఎండ కాస్తుండగా, ఆమె దాహంతో అలమటించాల్సి వచ్చింది. చివరికి రేసు పూర్తి చేసినా డీహైడ్రేషన్‌కు గురై అపస్మారక స్థితిలో కుప్పకూలింది. అయితే జైషా ఆరోపణలను భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) ఖండించింది. రేసుకు ముందురోజే ఆమెను కలిసి నీటి ఏర్పాట్లు చేస్తామని చెప్పగా ఆమె తిరస్కరించిందని తెలిపారు. వాస్తవాలు తెలుసుకునేందుకు కమిటీని ఏర్పాటు చేశారు.