స్పందించాల్సిన పని లేదు
న్యూఢిల్లీ: నిషేధిత భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు అభయ్ సింగ్ చౌతాలా తనపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని ప్రఖ్యాత షూటర్ అభినవ్ బింద్రా స్పష్టం చేశాడు. ఐఓఏలో అవినీతిపరులకు చోటుండకూడదనే ఐఓసీ ప్రయత్నాలకు మద్దతుగా బింద్రా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ షూటర్ చొరవపై ఆగ్రహంగా ఉన్న చౌతాలా వ్యక్తిగత దూషణకు దిగారు. చార్జిషీట్ దాఖలైన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయరాదనుకుంటే ముందుగా 2009లో చెక్ బౌన్సింగ్ కేసులో అరెస్టయిన తన తండ్రిని ఇంటి నుంచి వెళ్లగొట్టాలని పరుషంగా వ్యాఖ్యానించారు.
‘చౌతాలా చేసిన వ్యాఖ్యలపై మీడియా నా ప్రతిస్పందన కోసం వేచి చూస్తోంది. అయితే వీటిపై నేను స్పందించాల్సిన అవసరం లేదు. భారత క్రీడల్లో అవినీతిని పారద్రోలేందుకు నాతోపాటు మిగిలిన అథ్లెట్లు చేస్తున్న ప్రయత్నాలకు వీరు ఎలాంటి అడ్డంకులు సృష్టించలేరు. ఈ అంశంలో మరింతగా దూసుకెళతాం’ అని బింద్రా తేల్చాడు. మరోవైపు దేశానికి కీర్తిప్రతిష్టలు తీసుకొచ్చిన ఆటగాళ్లను వ్యక్తిగతంగా దూషించడం సరికాదని కేంద్ర క్రీడాశాఖ పేర్కొంది. జాతీయ రైఫిల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రణీందర్ సింగ్, మాజీ అథ్లెట్ అశ్వనీ నాచప్ప కూడా బింద్రాకు మద్దతు పలికారు.