ఎవరైతే మాకేంటి! | sports review of 2015 sakshi special | Sakshi
Sakshi News home page

ఎవరైతే మాకేంటి!

Published Wed, Dec 30 2015 12:16 AM | Last Updated on Sat, Sep 29 2018 5:29 PM

ఎవరైతే మాకేంటి! - Sakshi

ఎవరైతే మాకేంటి!

ఆద్యంతం అద్వితీయ ప్రదర్శన
2015లో తమ ముద్రను  చాటుకున్న
అగ్రశ్రేణి క్రీడాకారులు

వేదికలు మారినా... ప్రత్యర్థులు మారినా... కొత్త సవాళ్లు ఎదురైనా... తమదైన శైలిలో ముందుకు దూసుకుపోతూ... అందరిలో ప్రత్యేకంగా నిలుస్తూ... ఈ ఏడాదీ పలువురు అగ్రశ్రేణి క్రీడాకారులు తమ జైత్రయాత్రను కొనసాగించారు. వచ్చే సంవత్సరంలో కూడా మెరుపులు మెరిపించేందుకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఇచ్చారు. టీం ఈవెంట్లతో పోలిస్తే వ్యక్తిగత క్రీడాంశాలకు చెందిన వారే ఈసారి తళుక్కుమనిపించారు.
                                                                                      -సాక్షి క్రీడావిభాగం

 

‘రాకెట్’తో రఫ్ ఆడించారు...
ఉత్సాహం ఉండాలేకాని విజయాలు సాధించేందుకు వయసు అడ్డంకి కాదని అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ మళ్లీ నిరూపించింది. మహిళల టెన్నిస్‌లో ఈ ఏడాది సెరెనా తన హవా కొనసాగించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఈ నల్లకలువ యూఎస్ ఓపెన్‌లో మాత్రం ఒత్తిడికి తలవంచింది. సెమీఫైనల్లో రొబెర్టా విన్సీ (ఇటలీ) చేతిలో ఓడిపోయింది. తద్వారా 1988లో స్టెఫీ గ్రాఫ్ తర్వాత ఒకే ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించే అవకాశాన్ని చేజార్చుకుంది.

ఈ ఏడాది మొత్తం ఐదు టైటిల్స్‌ను సాధించిన సెరెనా 53 మ్యాచ్‌ల్లో గెలిచి, కేవలం మూడింటిలో మాత్రమే ఓడిపోయింది. ఏడాది మొత్తంలో కోటీ ఐదు లక్షల 82 వేల 642 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 70 కోట్ల 19 లక్షలు) సొంతం చేసుకుంది. పురుషుల విభాగంలో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ జోరు కొనసాగింది. నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో వావ్రింకా (స్విట్జర్లాండ్) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచినా జొకోవిచ్... ఆస్ట్రేలియన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్‌లలో విజేతగా నిలిచాడు. సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో వరుసగా నాలుగో ఏడాది చాంపియన్‌గా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఏడాది మొత్తంలో 82 మ్యాచ్‌ల్లో గెలిచి, 6 మ్యాచ్‌ల్లో ఓడిన జొకోవిచ్ 11 టైటిల్స్‌ను దక్కించుకున్నాడు. 2 కోట్ల 15 లక్షల 92 వేల 125 డాలర్ల (రూ. 143 కోట్లు) ప్రైజ్‌మనీని గెల్చుకున్నాడు.


 
 ‘బోల్ట్’ బిగించాడు...
 ఈ ఏడాది తాను బరిలోకి దిగిన అన్ని రేసుల్లో ఉసేన్ బోల్ట్ అజేయంగా నిలిచాడు. బీజింగ్ వేదికగా జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బోల్ట్ 100 మీటర్లు, 200 మీటర్లతోపాటు 4్ఠ100 మీటర్ల రిలేలోనూ స్వర్ణ పతకాలు సొంతం చేసుకొని తనకు తిరుగులేదని చాటుకున్నాడు. అయితే కొత్తగా ప్రపంచ రికార్డులు నమోదు చేయలేకపోయాడు. అమెరికా స్ప్రింటర్ జస్టిన్ గాట్లిన్ నుంచి గట్టిపోటీ తప్పదనుకున్నా... బోల్ట్ వేగం ముందు గాట్లిన్‌తోపాటు ఇతర అథ్లెట్స్ కూడా వెనుకబడిపోయారు. వచ్చే ఏడాది రియో ఒలింపిక్స్ ఉండటంతో ఈ సంవత్సరం బోల్ట్ ఎంపిక చేసుకున్న కొన్ని ఈవెంట్స్‌లోనే పాల్గొన్నాడు.
 
   ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు నెగ్గిన అతను ఈ మెగా ఈవెంట్‌లో తన స్వర్ణాల సంఖ్యను 11కు పెంచుకొని ఈ ఘనత సాధించిన ఏకైక అథ్లెట్‌గా గుర్తింపు పొందాడు. మరోవైపు డెకాథ్లాన్ (పది క్రీడాంశాల సమాహారం) ఈవెంట్‌లో అమెరికాకు చెందిన యాష్టన్ ఈటన్ 9045 పాయింట్లు స్కోరు చేసి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా ఈ ఏడాది అత్యుత్తమ అథ్లెట్ పురస్కారాన్ని గెల్చుకున్నాడు.
 
 అదే జోరు... అదే ఫలితం
ఫార్ములావన్‌లో వరుసగా రెండో ఏడాది తన హవా కొనసాగించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మూడోసారి ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. తొలిసారి 2008లో ఈ ఘనత సాధించిన అతను గతేడాది అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఈ సంవత్సరం కూడా ఆద్యంతం అలరించిన హామిల్టన్ తన ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మూడు రేసులు మిగిలి ఉండగానే ప్రపంచ టైటిల్‌ను ఖాయం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో జరిగిన 19 రేసుల్లో హామిల్టన్ 10 రేసుల్లో విజేతగా నిలిచి, ఆరు రేసుల్లో రెండో స్థానాన్ని పొందాడు.
 
 కాసులు కురిపించిన బిగ్ ఫైట్...
 ఈ సంవత్సరం యావత్ క్రీడాప్రపంచం అభిమానులను ఆకర్షించిన ఈవెంట్స్‌లో ఒకటిగా నిలిచింది మేవెదర్ (అమెరికా)- పకియావ్ (ఫిలిప్పీన్స్) బాక్సింగ్ బౌట్. లాస్‌వేగాస్‌లో మే 2వ తేదీన జరిగిన ఈ బౌట్ ద్వారా నమ్మశక్యంకాని రీతిలో రూ.2500 కోట్ల ఆదాయం వచ్చింది. తుది ఫలితంతో సంబంధం లేకుండా ఈ మొత్తంలో మేవెదర్‌కు రూ. 945 కోట్లు, పకియావ్‌కు రూ. 630 కోట్లు లభించాయి. నిర్ణీత 12 రౌండ్‌లపాటు జరిగిన ఈ బౌట్‌లో మేవెదర్ పూర్తి ఆధిపత్యం చలాయించి పకియావ్‌ను ఓడించాడు. పకియావ్‌తో బౌట్ తర్వాత మరో బౌట్‌లో పాల్గొన్న మేవెదర్ అందులోనూ నెగ్గి తన ప్రొఫెషనల్ కెరీర్‌ను 49 విజయాలతో అజేయంగా ముగించాడు.
 
 మారిన్ మెరిసె...
 మహిళల బ్యాడ్మింటన్‌లో చైనా దూకుడుకు చెక్ పెడుతూ స్పెయిన్ అమ్మాయి కరోలినా మారిన్ ఈ ఏడాది తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో సైనా నెహ్వాల్ (భారత్)ను ఓడించి వరుసగా రెండో ఏడాది విజేతగా నిలిచిన మారిన్... ఈ ఏడాది ఐదు సూపర్ సిరీస్ (ఆల్ ఇంగ్లండ్, మలేసియా ఓపెన్, ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, హాంకాంగ్) టైటిల్స్‌ను కైవసం చేసుకోవడం విశేషం.
 
 భళా... బార్సిలోనా క్లబ్
 ప్రపంచ ఫుట్‌బాల్‌లోని అత్యంత మేటి క్లబ్‌లలో ఒకటైన బార్సిలోనా జట్టు ఈ ఏడాది నిలకడగా రాణించింది. స్పానిష్ లీగ్ లా లిగా టైటిల్‌ను నెగ్గిన బార్సిలోనా జట్టు ఆ తర్వాత అదే జోరును కొనసాగించి చాంపియన్స్ లీగ్, యూరోపియన్ సూపర్ కప్ టైటిల్స్‌ను హస్తగతం చేసుకుంది. లియోనెల్ మెస్సీ, నెమార్, పీకే, సురెజ్, ఇనియెస్టా లాంటి స్టార్ ఆటగాళ్లతో కూడిన బార్సిలోనా జట్టు సీజన్ చివర్లో ప్రపంచ క్లబ్ చాంపియన్‌షిప్‌లోనూ విజేతగా నిలిచి ఏడాదిని ఘనంగా ముగించింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement